రేవంత్ విషయంలో కేటీయార్ సక్సెస్ అవుతారా ?
x
KTR on Revanth (source BRS Twitter)

రేవంత్ విషయంలో కేటీయార్ సక్సెస్ అవుతారా ?

కేటీయార్, హరీష్ రావు ప్రతిరోజు రేవంత్ మీద ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. రేవంత్ పైన ఉన్న అక్కసంతా బయటపెడుతున్నారు.అయితే, వాళ్ల లక్ష్యం నెరవేరుతుందా?


రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయిన దగ్గర నుండి కారుపార్టీలోని కీలకనేతలంతా ఒకటే గోలచేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, మాజీమంత్రి హరీష్ రావు అయితే ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. చేస్తున్న ఆరోపణల్లో రేవంత్ పైన తమకున్న అక్కసంతా బయటపడుతున్నా వాళ్ళు లెక్కచేయటంలేదు. మధ్యమధ్యలో కేసీయార్ కూడా ఏదో పేరుమీద జనాల్లోకి వచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు తిట్టేసి మళ్ళీ వెళిపోతున్నారు. తాజాగా రేవంత్ కు వ్యతిరేకంగా కేటీయార్ విచిత్రమైన చాలెంజ్ చేశారు. అదేమిటంటే ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతు టెలిఫోన్ ట్యాపింగ్ పై తాను లైడిటెక్టర్ టెస్టుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఆయన పెట్టిన కండీషన్ ఏమిటంటే లైడిటెక్టర్ టెస్టుకు రేవంత్ రెడ్డి కూడా చేయించుకోవాలట.

నిజానికి ట్యాపింగ్ ఆరోపణలపై కేటీయార్ ను లైడిటెక్టర్ టెస్టు చేయించుకోమని ఎవ్వరూ అడగలేదు. లైడిటెక్టర్ టెస్టుకు సిద్ధామా అని ఎవరూ చాలెంజ్ కూడా చేయలేదు. తనంతట తానే భుజాలు తడుముకుంటున్నారు. అరెస్టయిన పోలీసు అధికారులు చెబుతున్నది ఏమిటంటే కేసీయార్ పాలనలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము వందలమంది ప్రతిపక్ష నేతలు, అనుమానితులు, ప్రత్యర్ధుల మొబైల్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. పనిలోపనిగా ఒక అధికారి అయితే బీఆర్ఎస్ లోని పెద్ద తలకాయ ఆదేశిస్తేనే ట్యాపింగ్ జరిపినట్లు బయటపెట్టారు. అయితే ఆ పెద్ద తలకాయ ఎవరన్నది బహిరంగ రహస్యంగా ఉండిపోయింది. అందుకనే ప్రభాకరరావు అమెరికా నుండి తిరిగొస్తే కాని ఆయనకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వంలోని పెద్దతలకాయ ఎవరన్నది తేలదు.

ఇపుడు ఆరోపణలన్నీ బీఆర్ఎస్ పాలనలో జరిగిన ట్యాపింగ్ గురించి అయితే రేవంత్ లైడిటెక్టర్ టెస్టుకు రెడీ అవ్వాలని కేటీయార్ కండీషన్ ఎందుకు పెట్టినట్లు ? ఎందుకంటే రేవంత్ సీఎం అయిన దగ్గర నుండి కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతోందట. అంటే బట్టకాల్చి మీదేసేయాలని అనుకున్నారు కాబట్టే కేటీయార్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. తమ హయాంలో జరిగిన ఇల్లీగల్ ట్యాపింగ్ గురించి అడిగితే రేవంత్ పైన బురదచల్లేయటం కేటయార్ కే చెల్లింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేవంత్ కు మధ్య విభేదాలు సృష్టించటమే పనిగా కేటీయార్, హరీష్ పెట్టుకున్నట్లున్నారు. అందుకనే రేవంత్ తొందరలోనే దిగిపోతారు, తనవర్గంతో కాంగ్రెస్ పార్టీని చీల్చేస్తారు, తెలంగాణాలో రేవంత్ మహారాష్ట్ర షిండే లాగ అయిపోతారని నానా రచ్చచేస్తున్నారు. మరీవిచిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డి తన చీలికవర్గంతో బీజేపీతో చేతులు కలపబోతున్నట్లు ఆరోపిస్తున్నారు. తమ ఆరోపణలకు ఆధారాలు ఏమిటంటే మాట్లాడటంలేదు.

ఇక హరీష్ రావు అయితే కరువు యాత్రలంటు నానా గోలచేస్తున్నారు. నిజానికి వర్షాభావ పరిస్ధితులు దేశంలోని చాలాప్రాంతాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే డిసెంబర్లో. మార్చిలో కరువు ఛాయలున్నాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలైన సమస్యగానే చూడాలి. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణం నాసిరకంగా ఉంది కాబట్టే నీటినిల్వకు పూర్తిస్ధాయిలో పనికిరావటంలేదని ప్రాజెక్టుల నిపుణులే చెబుతున్నారు. నీటినిల్వ సామర్ధ్యాన్ని తగ్గించేయమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి స్పష్టంగా చెప్పటం వల్లే ప్రాజెక్టుల్లోని నీటిని బయటకు వదిలేశారు. ఈ విషయాలు తెలిసికూడా ప్రాజెక్టులకు రిపేర్లు చేయించటం చేతకాకపోతే అధికారంలో నుండి దిగిపోమ్మని కేసీయార్, హరీష్ పదేపదే రేవంత్ ను మాటలతో గుచ్చుతున్నారు.

మొత్తంమీద ప్రతిరోజు కేటీయార్, హరీష్ ఏదో కారణం పెట్టుకుని రేవంత్ మీద బురదచల్లేయాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. అందుకనే రేవంత్ ను తెలంగాణా షిండే అని, లైడిటెక్టర్ టెస్టుకు రెడీ అవ్వాలంటు ఏదో విధంగా రెచ్చగొడుతునే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగునెలల నుండి రేవంత్ కు వ్యతిరేకంగా ఇదే గోల చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేటీయార్ సక్సెస్ అవుతారా ? ఏమి జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.

Read More
Next Story