పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ ప్రభావం చూపించేనా?
x
Asaduddin Owaisi

పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ ప్రభావం చూపించేనా?

పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని మూడు రాష్ట్రాల్లో పోటీ చేయాలని మజ్లిస్ నిర్ణయించింది.ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రభావం ఏమేర ఉంచవచ్చన్నది చర్చనీయాంశంగా మారింది.


దేశంలోని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.


మూడు స్థానాల్లో మజ్లిస్ అభ్యర్థుల ప్రకటన
కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నగారా మోగించిన నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో ముగ్గురు అభ్యర్థులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇంతియాజ్ అలీ, బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి అక్తానుల్ ఇమాన్ అభ్యర్థిత్వాలను అసద్ ప్రకటించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లో మరిన్ని స్థానాల్లో తమ మజ్లిస్ పార్టీ పోటీ చేసేందుకు ఆయా రాష్ట్రాల మజ్లిస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని మజ్లిస్ అధినేత చెప్పారు.

మజ్లిస్ పార్టీకి పార్లమెంటులో రెండు సిట్టింగ్ సీట్లు
దేశంలో ముస్లింలకు తామే ప్రతినిధులమని చెప్పుకునే మజ్లిస్ పార్టీకి పార్లమెంటులో రెండు సిట్టింగ్ స్థానాలున్నాయి. హైదరాబాద్, ఔరంగాబాద్ సిట్టింగ్ ఎంపీలున్న మజ్లిస్ ఈ సారి తాము మరిన్ని స్థానాలు సాధిస్తామని అసదుద్దీన్ ధీమాగా చెప్పారు. దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ముస్లింల తరపున ఎంపీ అసద్ తన గళాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని అసద్ ప్రకటించారు. తెలంగాణలో మజ్లిస్ పార్టీకి ప్రస్థుతం ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, 67 మంది కార్పొరేటర్లు, 70 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మహారాష్ట్రలో ఔరంగాబాద్ తోపాటు నార్త్ ముంబయి, దూలే, నాందేడ్, భీవండీ, ఛత్రపతి శంభాజీనగర్ సీట్లలో పోటీ చేయాలని మజ్లిస్ యోచిస్తోందని ఆ పార్టీ నాయకుడు చెప్పారు.

ఓట్లను చీల్చేందుకు మజ్లిస్ పోటీ?
గతంలో మజ్లిస్ పార్టీ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ప్రధాన పార్టీలకు దెబ్బతీసింది. గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేయగా ఐదు స్థానాల్లో విజయం సాధించారు. 2019 వ సంవత్సరంలో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాల్లో పోటీ చేయగా, రెండు స్థానాలను గెలుచుకుంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాలు, తమిళనాడులో మూడు స్థానాల్లో ఏఐఎంఐఎం అభ్యర్థులు పోటీ చేసినా ఒక్క స్థానం కూడా దక్కలేదు. బలహీనవర్గాల కోసం పనిచేస్తున్నామని చెబుతున్నా మజ్లిస్ అధినేత కొన్ని రాష్ట్రాల్లో ముస్లిమేతరులను ఎన్నికల బరిలో దించారు.

మజ్లిస్ పై ముస్లింల వ్యతిరేకత
మజ్లిస్ వ్యవహార శైలిపై గతంలో కొందరు ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పై మజ్లిస్ అభ్యర్థిని బరిలోకి దించలేదు. తన హైదరాబాద్ ఎంపీ పరిధిలో గోషా మహల్ ఉన్నా అసెంబ్లీలో మజ్లిస్ పోటీకి దూరంగా ఉంది. మరో వైపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజహరుద్దీన్ పోటీ చేయగా, ఆయనపై మజ్లిస్ అభ్యర్థిని బరిలో దించి ఆయన్ను మజ్లిస్ ఓడించింది. మజ్లిస్ వైఖరిపై ఇటీవల ముస్లింలలోనూ కొంత వ్యతిరేకత వచ్చిందని పాత బస్తీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహ్మద్ ముజాహిద్ చెప్పారు.

యూపీలో ప్రభావం చూపించని మజ్లిస్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసినా, ఎలాంటి ప్రభావం చూపించలేదు. 2017 వసంవత్సరంలో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 38 సీట్లలో ఏంఐఎం పోటీ చేసినా 37 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో మజ్లిస్ ఎన్నికల బరిలో దిగితే, ఆ పార్టీకి కేవలం 0.43 శాతం ఓట్లే వచ్చాయి. మజ్లిస్ అభ్యర్థులు 5వేల ఓట్ల మార్కును ఎవరూ దాటలేదు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా బీజేపీ విజయానికి మజ్లిస్ తోడ్పడిందని ఆరోపణలు వచ్చాయి.
ఈ సారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి ప్రస్థుతం పార్లమెంటులో ఉన్న రెండు సిట్టింగ్ సీట్లు దక్కుతాయా? లేదా మరిన్ని సీట్లు వస్తాయా? అనేది జూన్ 4వతేదీ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.


Read More
Next Story