పార్లమెంటు నుంచి ప్రతిపక్షాన్ని తరిమేస్తారా?

పార్లమెంటు భద్రతా వైఫల్యం ఉభయ సభలను కుదిపిస్తోంది


పార్లమెంటు నుంచి ప్రతిపక్షాన్ని తరిమేస్తారా?
x
ఫోటో కర్టసీ సన్సద్ టీవీ

పార్లమెంటు నుంచి ప్రతిపక్షాన్ని తరిమివేయాలనుకుంటోందా అధికార పక్షం? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఆ దారిలోనే ఉన్నట్టు అర్థమవుతుంది. ఇటివలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 92 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉభయ సభల నుంచి సోమవారం ఒక్కరోజే 78 మంది పార్లమెంటు సభ్యులపై సస్పెండ్‌ చేశారు. సభ్యుల సస్పెన్షన్‌తో సభ అట్టుడికింది. ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

పార్లమెంటును కుదిపేస్తున్న భద్రతా వైఫల్యం
పార్లమెంటు భద్రతా వైఫల్యం ఉభయ సభలను కుదిపిస్తోంది. భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆందోళనలో భాగంగా సభ మధ్యలోకి దూసుకువచ్చి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే పేరిట విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేటు పడింది. లోక్‌సభ నుంచి 33 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సస్పెండ్‌ కాగా రాజ్యసభ నుంచి ఏకంగా 45 మందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి సహా 33 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనపై హోం మంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఈ సస్పెన్షన్లు జరిగాయి. పార్లమెంటు భద్రతా వైఫల్యానికి సంబంధించిన వ్యవహారంలో రాజ్యసభ, లోక్‌సభలో ఇప్పటికి సస్పెండ్‌ అయిన వారి సంఖ్య 92కి చేరింది.
ఆ ఎంపీని సస్పెండ్‌ చేయాలి
బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా ఇప్పించిన విజిటర్స్ పాసులతో లోక్‌సభలోకి వచ్చిన ఇద్దరు సభలోకి దూకిన వ్యవహారమై ఉభయ సభల్లో గందరగోళం జరుగుతోంది. విజిటర్స్ పాసులు ఇప్పించిన ఎంపీని సస్పెండ్ చేయాలని, హోం మంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని విపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా విపక్షాల సభ్యులు సభ మధ్యలోకి దూసుకువెళ్ళారు. దీంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా విపక్ష సభ్యులను ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారమై సభలో గందరగోళం చెలరేగింది.
రాజ్యసభలో 45 మందిపై వేటు
అటు రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎంపీలు జైరాం రమేశ్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ సహా పలు పార్టీల విపక్ష నేతలపై ఈ వేటు పడింది. వీరిలో 34 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా.. మరో 11 మందిని ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక అందే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ వెల్లడించారు. కాగా.. ఇప్పటికే రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌పై ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో నేటి సస్పెన్షన్‌తో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తంగా 90 మందికి పైగా విపక్ష ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు.
ఉభయ సభలు రేపటికి వాయిదా..
‘భద్రతా వైఫల్యం’పై ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. విపక్షాలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉభయ సభలను సభాపతులు రేపటికి వాయిదా వేశారు.


Next Story