“నెట్‌వర్క్” వెబ్ సిరీస్ రివ్యూ
డిజిటల్ డేంజర్‌పై షాకింగ్ హెచ్చరిక!;
నలుగురు వ్యక్తులు, నలభై దిశలలో ఉన్న జీవితాలు… ఒకే దారిలోకి తిప్పేసిన ఒకే ఒక శక్తి… ఆన్‌లైన్ డిపెండెన్సీ. ఆన్ లైన్ ప్రపంచానికి అలవాటు పడి, బానిసై, చివరకు 'మనం డైరెక్షన్స్ ఇస్తే పని చేయాల్సిన వస్తువు… మన లైఫ్‌ని డైరెక్ట్ చేయకూడదు' అనే విషయాన్ని ఎలా తెలుసుకున్నారనేది ఈ సీరిస్ కథ.
కిరణ్ (శ్రీరామ్)
ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితంలో కొత్తగా ఓ లెవెల్‌కు వెళ్లాడు. బాస్ చేతి నుంచి భారీ మొత్తం డబ్బు తీసుకొని, భద్రంగా జమ చేయాల్సిన పని అతనిదే. కానీ అకస్మాత్తుగా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్‌లోకి అడుగుపెట్టి – “ఒక్క గంటలో డబ్బు రెట్టింపు” అనే ఆశతో – అన్నీ పోగొట్టుకుంటాడు. అప్పటి నుంచి... వేగంగా డబ్బు సంపాదించాలంటే, నేరం ఒక్కటే మార్గం అన్న డెసిషన్ తీసుకుంటాడు. టార్గెట్ – ఒక కిడ్నాప్ ప్లాన్.
శ్రీనివాస్
ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో వార్డ్ ఇంచార్జ్. బయట ప్రపంచానికి మామూలు ఉద్యోగి లానే కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం… సోషల్ మీడియా రచ్చ బోయ్. రాత్రంతా ఫిల్టర్‌లతో తాను వాయిస్ ఓవర్ వేసిన "హీరో ఎంట్రీ" రీల్స్‌తో పాప్యులర్ కావాలన్న కోరిక. ఒక రోజు… తాను చేసిన ఓ రీల్ వైరల్ అవుతుంది… కానీ అది ఆనందం తెచ్చిపెట్టదు. అనుకోని , ప్రమాదం తెస్తుంది!
స్వేచ్ఛ
వర్క్ ఫ్రమ్ హోమ్ జీవితం, యూరోప్ వ్లాగ్స్, ఫ్రీడమ్ ఫ్రెమ్‌లతో గ్లాస్‌లో కాఫీ తాగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సిటీలైఫ్ అమ్మాయి.
ఆమె నమ్మింది: కనెక్ట్ కావడానికి, ప్రేమించడానికి డేటింగ్ యాప్ చాలు. కానీ ఓ రోజు చేసిన మ్యాచ్... ఆమెను చీకటి సమస్యలోకి లాగుతుంది.
అక్కడ ప్రేమ లేదు... ట్రాప్ ఉంది. ఇప్పుడు ఆమె పోరాడాల్సింది – తాను నమ్మిన ప్రపంచంతోనే.
రాజా
ఒక మిడిల్ క్లాస్ యువకుడు. బ్రెయిన్ తక్కువ కాదు. కానీ డెసిషన్ తీసుకునే ముందు ఛాట్GPT, యూట్యూబ్ రివ్యూ, సాయం లేనిదే బ్రతకలేడు. గూగుల్ లేకుండా ఏ పని ముందుకు కదపడు. కానీ ఓ రోజు… యాప్ ను ఫాలో చేస్తూ… ఇబ్బందుల్లో పడిపోతాడు.
ఇలా ఆన్లైన్ డిపెండెంట్, ఆన్లైన్ గ్యాంబ్లర్, ఆన్లైన్ డేటింగ్, ఆన్లైన్ ఇన్ఫ్లూయన్సర్… ఇలా నాలుగు పాత్రలు నెట్‌వర్క్ బ్యాక్‌డ్రాప్‌తో ముందుకు సాగే ఈ కథనం ఎక్కడికి వెళ్లి ఆగింది. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సీరిస్ చూడాల్సిందే.
* విశ్లేషణ
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచీ, నిద్రపోయే వరకూ — ఫోన్ స్క్రీన్ వెలుతురు మన మెదడుపై పడే మానసిక ఛాయలే ఇప్పుడు మన సంస్కృతిని మలుస్తున్నాయి. ఈ వాస్తవాన్ని బేస్‌గా తీసుకొని, నాలుగు విభిన్న పాత్రల జీవితాల్లో ఆన్‌లైన్ యాప్స్ ఎలా తలుపులు తెరిచి, చివరికి గేట్లు వేసేశాయన్నది ఈ స్టోరీ థీమ్. ఈ సీరిస్ లో వచ్చే నాలుగు ప్రధాన పాత్రల ప్రపంచాలు ఇంట్రస్టింగ్ గానే క్రియేట్ చేసారు. కానీ కథ మాత్రం సరిగ్గా అనుకోలేదు. సీరిస్ ముందుకు వెళ్తున్నా..కథ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంటుంది.
ఇంటర్‌కనెక్టెడ్ డ్రామా, క్రియేటివ్ పేసింగ్ వంటి కీలక అంశాల్లో సిరీస్ తన బలం చూపించలేకపోయింది. మరీ ముఖ్యంగా ఎపిసోడిక్ క్లోజ్‌లు – cliffhangers – మిస్ అయ్యాయి. “ఇంకేం జరుగుతుంది?” అనే కుతూహలం పుట్టించే ప్రయత్నాలు కనిపించలేదు.
అలాగే ఇలాంటి కథలకు అవసరమైన బ్లాక్ హ్యుమర్, లేదా సైకలాజికల్ టెన్షన్ వంటి ఎలిమెంట్స్ ని అసలు పట్టించుకోలేదు. దాంతో ఆ పాత్రలు మన మనస్సులను తాకవు, వారి బాధ నిజమైనవి అనిపించదు, వారి తప్పులు మానవీయంగా గుర్తించబడవు.
నిజానికి ఇలాంటి సీరిస్ లు ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ బ్రిలియన్స్‌తో ఆడియన్స్‌కి సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తేనే వర్కవుట్ అవుతాయి. కానీ ఇందులో ఏ ఎలిమెంట్ ఈ సీరిస్ లో లేదు.
*టెక్నికల్ గా
అద్బుతం కాదు కానీ బాగానే ఉంది.ముఖ్యంగా డైలాగులు బాగున్నాయి. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్ కి బాగా ప్లస్ అయ్యింది. డైరక్టర్ బాగనే హ్యాండిల్ చేసాడు కానీ సరైన డెప్త్ ఉన్న కథ కాకపోవటంతో తేలిపోయింది.
*నటీనటుల్లో ...
శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రలు చేసారు. తాగుబోతు రమేష్, సమ్మెట గాంధీ, జోష్ రవి, మీనా కుమారి, ఛత్రపతి శేఖర్, శివ (హిట్ 2), పద్మంజలి, కల్పలత (పుష్ప తల్లి), జెమినీ సురేష్, సిద్ధార్థ మీనన్, మహేష్ విట్టా, శివాని, మహి, మౌనిక రెడ్డి, జబర్దస్త్ ఫణి, చిత్రం శ్రీను, సుమన్ సెట్టి, ఫన్ బకెట్ భార్గవి, ఫన్ బకెట్ ఫణి లాంటి ప్రముఖ నటులు ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో కనిపించడం విశేషం.
* ఎక్కడ చూడచ్చు
ఆహా ఓటీటీలో స్టీమింగ్ అవుతోంది. తెలుగులో ఉంది.