పిరవి- ఓ తండ్రి నిశబ్ద ప్రయత్నానికి చిరునామా

నన్ను వెంటాడిన సినిమాలు-7(ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్);

By :  RamC
Update: 2025-04-05 12:22 GMT

మీరు హాస్టల్ నుండి సెలవులకు, వారాంతంలోనో ఇంటికొస్తున్నారంటే, ఎవరి సంగతేమో తెలియదు కానీ, ఎదో తెలియని ఉత్సాహంతో వేచి చూసే వ్యక్తి నాన్న. మిగతా వాళ్ళందరూ ఎదురుచూసే వారు కారని కాదు, ఎందుకో తాను కొంచం ప్రత్యేకం.ఆ వచ్చే కొడుకో, కూతురో రాకని నిశ్శబ్దంగా ఆనందపడే వ్యక్తి నాన్న.

అలా ఇంజినీరింగ్ పరీక్షలు ముగించుకొని ఓనంకు వస్తున్నట్టు ఉత్తరం రాసిన రఘు కోసం, ఆ ఉత్తరం అందిన క్షణం నుండి ఓ తెలియని ఉత్సహంతో ఎదురుచూసే వృద్ధ తండ్రి చాక్యార్ కథ ఈ 'పిరవి' (1989 Indian Malayalam). తోటి వారందరు వస్తున్నా ,రఘు రాకపోవడంతో ఆ తండ్రి అసలు ఏమి జరిగిందో తెలియక పడే క్షోభ వారణాతీతం. షాజీ కరుణ్ (Shaji Karun) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒక భావోద్వేగాత్మక చిత్రంగా గ్రీఫ్ (grief) వ్యక్తిగత అశక్తత, వ్యవస్థల దైన్యాన్ని, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి భావనలపై లోతైన స్పందనను అందిస్తుంది. కేరళలో ఎమెర్జెన్సీలో ఎంతో ప్రాముఖ్యత పొందిన 'రాజన్ కేసు' స్ఫూర్తిగా తీసుకొని మలిచిన వెండి తెర దృశ్య కావ్యం 'పిరవి'.

ఈ చిత్రం గల్లంతైన వ్యక్తుల జ్ఞాపకాలు, గాయాలు మరియు ప్రభుత్వం చేసే అణచివేతను సున్నితంగా పరిచయం చేస్తుంది. రఘు అనే పాత్ర కనిపించకుండానే, కేంద్ర బిందువుగా ఉంటూ, అతడి జ్ఞాపకాలు, ఆశలు మరియు కబుర్లు ద్వారా మాత్రమే ప్రేక్షకుడు అతడిని అనుభవిస్తాడు. ఈ శూన్యత దర్శకుడు చూపిన ప్రతీ దృశ్యంలో, ప్రతీ నిశ్శబ్దంలో ప్రతిఫలిస్తుంది. సినిమా నిడివంతా కురుస్తూ ఉండే వర్షం చక్యార్ లోపలి బాధను పోలి ఉంటుంది. ఇక ఆ ఇంట్లో ఖాళీగా ఉన్న కుర్చీలు, తినని భోజనం, ప్రమిదలో దీపం వంటి చిత్రాలు నిశ్శబ్ద నిరుత్సాహానికి సంకేతాలుగా నిలుస్తాయి. స్పష్టంగా వ్యక్తీకరిస్తుంది.

ఈ కథ ఒక వ్యక్తిగత విషాదంగా కనిపించినా, ఇది ప్రభుత్వ అణచివేతను ఘాటుగా విమర్శిస్తుంది. చాక్యార్ తన కుమారుడి కోసం న్యాయం కోరుతూ ప్రయాణించే దృశ్యాలు, ప్రభుత్వ వ్యవస్థ ఎంత అచేతనంగా, నిర్లక్ష్యంగా స్పందిస్తుందో చూపిస్తాయి. కాలేజీలో ఎదో లెఫ్ట్ ఉద్యమంలో రఘు అరెస్ట్ అయిన ఘటనను చిత్రంలో చూపించకపోయినా, ఇది ఆ కాలంలో ఉన్న అనేక అసహజమైన అరెస్టులను సూచిస్తుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో కూడిన ప్రతిస్పందనలు, ఒక సామాన్య పౌరుడి ఆశలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమర్థమైన చిత్రణ ద్వారా, పిరవి ప్రభుత్వ అణచివేత ఎదుర్కొనే కుటుంబాల దుఃఖభరిత అనుభవాలను వాస్తవంగా ప్రతిబింబిస్తుంది.

చాక్యార్ ఆశలు తొలుత మెల్లమెల్లగా విచారంగా మారుతూ, ఆపై మానసికంగా దిగజారుతున్నప్పుడు, మనం ఒక లోతైన మానసిక అధ్యయనంగా మారుతాము. రోజు ఆయన బస్టాప్ కొచ్చి మౌనంగా వెనుతిరుగడం, శూన్యమైన చూపులు, చివరికి తుది దశలో తన వాస్తవతను కోల్పోవడం (all symbolize the inner breakdown of a dear father). కరుణ దీనిని అత్యంత సహజంగా, మెలోడ్రామాకు తావులేకుండా, పరిమితమైన మాటలతో, శక్తివంతమైన భావాలతో చూపిస్తాడు. ఈ కథనం అపరిష్కృత గాయం (unresolved trauma) కలిగించే దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తు చేస్తూ, వేదన ( grief) ను శాస్త్రీయంగా అర్థం చేసుకునే ఒక అధ్యయనంగా మారుతుంది. అందుకే నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది.

పిరవి సమకాలీన సామాజిక పరిస్థితులపై సార్వత్రిక స్పందనను ఇస్తుంది. రాష్ట్ర హింస, వ్యక్తుల అదృశ్యాలు మరియు అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా వర్తించగలవు. అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ లో చంపేసిఉంటారని, ఆ పట్టుకున్న వారిలోని కొందరు అనుమానం వ్యక్తం చెయ్యడంతో, ఈ చిత్రం ముగింపు ఇవ్వదు; కానీ ఇది మనకి ఒక శాశ్వతమైన ప్రశ్నగా మిగిలిపోతుంది.

కరుణ్ కథను సంయమనంతో (restraint) తో కవితాత్మకంగా చెబుతాడు. ఇది పరిచయం మాత్రమే కాదు, మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్ని ఎంత విస్మరిస్తుందో, దాన్ని ప్రశ్నించే ప్రయత్నం ఎలా అణగదొక్కుతుందో, ఎవరిని ప్రేమించామో వారి జ్ఞాపకాలను ఎలా నిలుపుకోవాలో తెలిపే ఒక నివాళిగా మారుతుంది. చివరికి, పిరవిలో రఘు గల్లంతవ్వడమంటే ఒక కుమారుని కోల్పోవడమే కాదు, అది న్యాయం, సత్యం, మానవత్వం కోల్పోవడమే అని మనల్ని వెంటాడే ఆ తండ్రి చూపులు గొప్ప కథకు దొరికిన ఆర్ద్రత.

Tags:    

Similar News