కామెడీనే కానీ...‘3 రోజెస్’ ఓటిటి సినిమా రివ్యూ!
పెళ్లి, ప్రేమ, పరువు – ఆడపిల్లల నిజమైన పోరాటం!
బెంగళూరులో యాడ్ ఏజెన్సీ ఉద్యోగం చేస్తూ, తన కలలతో బతుకుతున్న అమ్మాయి రీతూ (ఈషా రెబ్బా). ఆమె అమ్మానాన్నలకు ఒకటే ఆలోచన. “ఇప్పుడు పెళ్లి చేయకపోతే ఎప్పుడు?” హైదరాబాద్ పిలిపించి, రొటీన్ ‘పెళ్లి చూపులు’ షెడ్యూల్ వేస్తారు. స్మైల్‌తో మొదలై, సైలెన్స్‌తో ముగిసే ఆ చూపుల్లో రీతూ తన మనసును నిశ్శబ్దంగా దాచుకుంటుంది. మరి నాటకీయ పరిణామాల మధ్య ఆమెకు నిశ్చితార్థం జరిగిపోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఒక జ్యూయలరీ షాప్ ఓనర్ ప్రసాద్ (వైవా హర్ష). ఆ నిశ్చితార్థం రీతూ జీవితాన్ని బంగారు పంజరంగా మార్చుతుందా… లేక బంధనంగా?
డబ్బు, డ్రామా, డిజైర్స్ మధ్య ఊగిసలాడే అమ్మాయి జాన్వీ (పాయల్ రాజ్‌పుత్) . మల్టీ మిలియనీర్ స్టాన్లీ కూతురు, పబ్ కల్చర్ ఆమెకు ప్యాషన్. అమ్మ భయం ఒకటే . “ఈ గారాబం ఏ దిశలో తీసుకెళ్తుందో!” ఆ భయం నిజమవుతుంది. కబీర్ (ప్రిన్స్)తో ఆమె ప్రేమలో పడుతుంది. కానీ అది ప్రేమనా, స్వేచ్ఛా? ఎవరినైనా సులభంగా నమ్మేసే ఆ అమాయకత్వం. కబీర్ తో పెళ్లికి తండ్రి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు.ఒకరోజు ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది.
మూడుపదులు నిండినా, “ఇంకా పెళ్లి కాలేదా?” అనే ప్రశ్నతో రోజూ లేచే ఇంద్రజ (పూర్ణ). తండ్రి చనిపోయిన తర్వాత, బాబాయ్ సంరక్షణలో పెరిగిన ఆమెలో తనదైన ఆత్మగౌరవం ఉంది. కానీ తనకు తాను స్థానం లేదనే బాధ ఎక్కువ. మొదట్లో వచ్చిన సంబంధాలను తిరస్కరించినా, వయసు దాటిన తర్వాత ఆమెకూ ‘ఎదో’ కోరిక మొదలవుతుంది. బాబాయ్ తెచ్చిన కొత్త సంబంధం ‘సత్యం’ రాజేశ్‌తో కేఫేలో జరిగిన ఆ పెళ్లి చూపుల సీన్. ఆమె జీవితంలోని మోనాలాగ్ లాంటిది. “నా విలువ, నా వయసుతో తగ్గిపోతుందా?” అని ప్రశ్నించే ప్రతి మహిళకు అద్దం పట్టే పరిస్దితి ఇది.
ముగ్గురూ విసిగి పోయారు. ఇంట్లో ఆర్థికం, అర్థం, ఆజ్ఞల మేళవింపు మధ్య ఊపిరాడట్లేదు. ఒక రోజు ఫ్రస్ట్రేషన్ తాళలేని రీతూ, జాన్వీ, ఇందూ కలిసి పబ్‌కి వెళ్తారు. మద్యం గ్లాసులు సాక్షిగా, గుండెల్లో దాచుకున్న మాటలు బయిటకు వస్తాయి. ఆ రాత్రి నవ్వులు, కన్నీళ్లు,నిర్ణయాలు అన్నీ కలగలిసిపోతాయి. అదే వారి జీవితాలను మార్చే ఆరంభం. చివరికి ఈ ముగ్గురు జీవితాలు ఎలాంటి టర్న్ తీసుకున్నాయి అనేదే మిగతా కథ.
స్క్రిప్టు ఎనాలసిస్ ..
“పెళ్లి” మన సమాజంలో ఆ పదం వినగానే ఒక అమ్మాయికి సంబంధించిన బాధ్యత, భయం, ఆశ, పరువు అన్నీ కలగలిసి ఒకే గుండె చప్పుడు అవుతాయి. ఈ గుండె చప్పుడు వెనుక ఉన్న శబ్దాన్ని వినిపించడానికి ప్రయత్నించేదే ఈ సినిమా. వాస్తవానికి మొదట ఇదో సీరిస్ గా వచ్చింది. ఇప్పుడు ఆ వెబ్ సీరిస్ ని రీఎడిట్ చేసి సినిమాగా వదిలారు. డైరెక్టర్ మాగీ ఈ కథను "తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకునే అమ్మాయిల" దృష్టిలో చెప్పారు. “ఆడపిల్లకు పెళ్లి ఒక గమ్యం కాదు, ఒక గమ్యస్థానం వెతుక్కోవడమే.” అనేదే సెంటర్ పాయింట్.
రైటింగ్‌లో ఒక స్పష్టమైన పాయింట్ ఉంది — ఆడపిల్లల పెళ్లి విషయంలో సమాజపు దృష్టి ఎంత పాతదో చూపించడం.అమ్మాయి ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా, చివరికి ఆమె విలువ "ఎవరిని పెళ్లి చేసుకుందో"తోనే కొలుస్తారు. స్క్రిప్ట్‌లో ఇది బాగా హైలైట్ అయినా, ఎమోషనల్ కనెక్ట్ బలంగా రాలేదు. చూసేవారి మనసులో "ఇది నాకూ జరిగిందేమో,జరుగుతుందేమో" అనిపించే స్థాయికి తీసుకురాలేకపోయింది.
అలాగే కథలో ఊహించని ట్విస్టులు ఏమీ లేవు గానీ, కథలో భాగంగా ఇచ్చిన కామెడీ టచ్ తో బోర్ అనిపించకుండా సాగిపోయేలా చేసారు. మాగీ రైటింగ్‌లో మొదటి లేయర్ "పెళ్లి" గురించి కాదు. "పెళ్లి అనే ఆలోచన ఎలా పాతదైపోయిందో" గురించి. ఇది ఒక ఫెమినిస్టిక్ నేరేషన్ కాదు; ఇది “సమాజపు సైలెంట్ హైపోక్రసీ” గురించి చర్చించే ప్రయత్నం.
పెళ్లి అనే వ్యవస్థ ఎంత యాంత్రికమైందో చెప్పే మాస్క్డ్ సెటైర్స్ అక్కడక్కడా వేసారు. ఇలాంటి “మల్టీ-టోన్ రైటింగ్” కాస్త కష్టమే. హాస్యం ,హృదయభారం ఒకే ఫ్రేమ్‌లో చూపటం అంటే మాటలు కాదు. దాంతో స్క్రిప్ట్‌లో ఎమోషన్ “రియాక్షన్” స్థాయిలో ఉంది, “రియలైజేషన్” స్థాయికి చేరలేదు.
పర్ఫార్మెన్స్ అండ్ ప్రజెంటేషన్
ఈషా రెబ్బా, పాయల్, పూర్ణ — ముగ్గురి గ్లామర్ మరియు ప్రెజెన్స్ ఈ సిరీస్‌ను లైట్ టోన్‌లో నిలబెట్టాయి. ప్రత్యేకంగా ఈషా రెబ్బా తన పాత్రలో చాలా సైలెంట్ పేస్ తో జీవించింది. కామెడీ సీన్‌లు సహజంగా వర్కౌట్ అయ్యాయి — ముఖ్యంగా వైవా హర్షతో ఉన్న పెళ్లి చూపులు సీన్ హైలైట్. కానీ సపోర్టింగ్ కాస్ట్ ఓవర్‌యాక్టింగ్ కారణంగా కొన్ని సన్నివేశాలు వెబ్ సిట్కామ్ లాగా మారాయి.
సినిమాటిక్ అబ్జర్వేషన్
టెక్నికల్‌గా షో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. రంగులు, ఫ్రేమ్‌లు, లైటింగ్ అన్నీ లావishly ఉన్నా, ఆ లావిష్‌నెస్ వెనుక ఉన్న భావం మాత్రం మిగిలిపోతుంది. “Glitz and Glamour over Grit and Grief.” దీని వల్ల ఇది ఒక “బ్యూటిఫుల్ షో”గా కనిపిస్తుంది, కానీ “బ్యూటిఫుల్ స్టోరీ”గా అనిపించదు. ఇది ఒక గ్లామర్‌తో కప్పబడ్డ ఫెమినిస్టిక్ ఐడియా, అందంగా కనిపిస్తుంది కానీ లోతు కొంచెం తగ్గింది
ఫైనల్ థాట్
ప్రేమ, పెళ్లి, పరువు అనే మూడు వలయాల మధ్య జీవించే ఈ మూడు యువతుల కథ. ఒక తరానికి ప్రతిధ్వనిలా నిలుస్తుంది. స్క్రిప్ట్‌లో లోపాలున్నా, దాని ఉద్దేశం స్పష్టంగా ఉంది. “ఒక ఆడపిల్లను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆమె పెళ్లి గురించి అడగకూడదు; ఆమె కలల గురించి అడగాలి.”
చూడచ్చా
ఇంతకు ముందు ఈ వెబ్ సీరిస్ చూడకపోతే సినిమాగా ఏకబిగిన చూసేయచ్చు. అద్బుతం కాదు కానీ ఓ సారి చూడటానికి బాగానే ఉంటుంది.ఓ లుక్కేయండి.
ఎక్కడ చూడచ్చు
ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది