వరుణ్ తేజ్ ‘మట్కా’రివ్యూ
వరుణ్ తేజ్ ఫ్లాప్ ల నుంచి తప్పించుకోవటానికి కొత్త సబ్జెక్ట్ లతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మట్కా కింగ్ రతన్ ఖేత్రి స్ఫూర్తితో అల్లిన కథ తో మన ముందుకు వచ్చాడు.
వరుణ్ తేజ్ ఫ్లాప్ ల నుంచి తప్పించుకోవటానికి కొత్త సబ్జెక్ట్ లతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మట్కా కింగ్ రతన్ ఖేత్రి స్ఫూర్తితో అల్లిన కథ తో మన ముందుకు వచ్చాడు. అయితే సినిమా అనుకున్న స్థాయిలో ఉందా...లేదా తేడా కొట్టిందా..సినిమా వరుణ్ తేజ్ కెరీర్ కు కొత్త వెలుగు ఇస్తుందా లేక మరో ప్రయోగం వైపు ప్రయాణించేలా చేస్తుందా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
కథా కాలం 1958- 1982 మధ్య నడుస్తుంది. బర్మా నుంచి శరణార్థి వాసు (వరుణ్ తేజ్) చేసిన అనుకోని పరిస్థితుల్లో చేసిన ఓ హత్య వల్ల బాల ఖైదీగా జైల్ కు వెళ్తాడు. అక్కడే బాల్యం పూర్తి చేసుకుని యుక్తవయసు వచ్చాక జైల్లోంచి బయట ప్రపంచంలోకి వస్తాడు. జైలులో తనకు అయిన పరిచయాలు, తనలోని అసలు నైజం కలిపి ఓ మొరటు వ్యక్తిగా తయారవుతాడు. రౌడీయిజం ని తన వృత్తిగా ఎంచుకుంటాడు. బతుకుతెరువు కోసం మొదట్లో విశాఖలో కూలీ గా ప్రయాణం మొదలెట్టినా షార్ట్ పీరియడ్ లో ఎదిగిపోవాలనే ఆలోచన అతని మెదుడ్ని తొలిచేస్తుంది.
దాంతో తెలిపిన వాసు గ్యాంబ్లింగ్ లోకి ఎంటరవుతాడు. మట్కాని ప్రవేశపెట్టి అంచెలంచెలుగా మట్కా కింగ్ గా ఎదుగుతాడు. ఆ క్రమంలో అతనికి నానినాబు (కిషోర్) లాంటి వాళ్లు సాయిపడితే కెబి (జాన్ విజయ్) లాంటి రౌడీలు వాళ్ళు శతృవులు అవుతారు. కెబికు ఒకటే జీవితాశయం తన రౌడీయిజానికి ఎదురొచ్చిన వాసుని చంపాలని. ఇక వాసు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే... వాసుకి ఒక వేశ్య (సలోని) చెల్లెలు (మీనాక్షి) పరిచయమవుతుంది. అది మెల్లిగా ఇద్దరినీ ఒకటి చేస్తుంది.
ఇక గ్యాంబ్లర్ గా తన “మట్కా” సామ్రాజ్యాన్ని వాసు దేశమంతా ఎలా విస్తరింపజేస్తూంటే సీబీఐ కన్ను అతనిపై పడుతుంది. వారి నుంచి ఎలా వాసు తప్పించుకున్నాడు. సీబీఐ అధికారి సాహు (నవీన్ చంద్ర) అతన్ని పట్టుకోవడానికి వల విసురుతాడు. అప్పుడు ఏమైంది. మట్కా కింగ్ గా ఎదిగిన అతని జీవితం చివరకు ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
పీరియడ్ సినిమాలు డీల్ చేయాలంటే చాలా ఖర్చు , చాలా టైట్ స్క్రిప్ట్ అవసరం. అసలు ఆ కథ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామనే విషయం కన్నా ఎంతలా జనాలకు కనెక్ట్ అయ్యామనే చెప్తేనే కనెక్ట్ అవుతారు. ఓ ప్రక్కన కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలు నెగిటివ్ హీరోయిజంతో వస్తుంటే వాటిని అనుసరిస్తూ ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది. అయితే వాటిలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, స్క్రిప్ట్ మీద ఉన్న పట్టుకానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఇందులో మిస్సయ్యాయి. గాఢ్ పాధర్ ఛాయలు కొన్ని చోట్ల కనబడతాయి. అది పక్కన పెడితే స్లో నేరేషన్, కొంత డాక్యుమెంటేషన్ టైప్ వ్యవహారం కలబోసి ఉంది.
వీటన్నింటితో పాటు రొటీన్ ఫార్ములా ఎలిమెంట్స్ సైతం చొప్పించాడు దర్శకుడు. దాంతో సినిమా అటూ, ఇటూ కాకుండా పోయింది. ఎక్కడా ఇంటెన్స్ సాగే సీన్స్ కానీ, చూసేవారిని ఆశ్చర్యపరిచే ట్విస్ట్ లు కానీ ఉండవు. ఉన్న కాసిని సోసో గా ఉన్నాయి. అయినా ఫస్టాఫ్ లోనే సినిమా ప్రేక్షకుడిని వదిలేసింది. వచ్చాం కాబట్టి సెకండాఫ్ కూడా చూసి పోదాంలే అనే ఆలోచన తప్పించి పూర్తి గా చూడటానికి కారణం కనిపించదు. ఏదైమైనా పుష్ప, కేజీఎఫ్ ని చూసి రాసుకున్నట్లున్న ఈ సినిమా వాటి ఛాయిలుకూడా రాలేదు. అవేమీ రాకముందు ఈ సినిమా వస్తే కాస్త అలరించేదేమో.
టెక్నికల్ గా..
జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి పేరు. అయితే ఆయన ఈ సినిమాలో చాలా చోట్ల ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేసాడు. ఆయన ఇచ్చిన స్కోర్ కొన్ని చోట్ల సీన్స్ ని లేపుతుంది. మరికొన్ని చోట్ల సీన్ ని మించిపోయిన...ప్రక్కకు తీసుకెళ్తుంది. పాటలు లేలే రాజా, తస్సాదియ్యా విజువల్ గా బాగున్నాయి. స్క్రీన్ ప్లే సినిమాపై ఆసక్తిని చంపేయటంతో దర్శకత్వ మెరుపులు ఏమీ హైలెట్ కాలేదు. వింటేజ్ ప్రొడక్షన్ డిజైన్, వరణ్ తేజ్ కు ఏజ్డ్ లుక్ ఇవ్వడం వంటివి బాగున్నాయి. ఆ డిపార్టమెంట్ కష్టం కనిపిస్తుంది.
ఏదైమైనా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఎఫ్ 3 తో సక్సెస్ ని వెంకటేష్ తో షేర్ చేసుకున్న వరణ్ తేజ్ మట్కాతో మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయాలని భావించాడు. వేర్వేరు టైమ్ లలో వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కూడా పాత్రకు తగ్గట్లు గంభీరంగా బాగుంది. సుజాతగా మీనాక్షి చౌదరి డీ గ్లామర్ రోల్ చేసింది. సోసోగా ఉంది సోఫియాగా నోరా ఫతేహి కాళ్లతో(డాన్స్ లు) కాకుండా కళ్లతో (ఎక్సప్రెషన్స్ ) కష్టపడింది. పద్మగా సలోని డిఫరెంట్ గా కనబడింది. కిశోర్, జాన్ విజయ్, 'సత్యం' రాజేష్, నవీన్ చంద్ర తదితరులు తమ తమ పాత్రలు తగ్గట్టు చేశారు.
చూడచ్చా
మట్కా గురించి మీకు కనీస పరిజ్ఞానం లేదు తెలుసుకోవాలంటే ఈ సినిమాకు వెళ్లచ్చు. లేకపోతే ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేయచ్చు.