'నా సామిరంగ' సినిమా రివ్యూ
ఈ సినిమాలో ఎమోషన్స్ని పండించడానికి అవకాశం ఉన్న పాత్ర నరేష్ పాత్రనే. దాన్ని బాగానే యూటిలైజ్ చేసుకున్నాడు.
By : The Federal
Update: 2024-01-14 11:31 GMT
-సలీమ్ బాషా
కొంతవరకు 'నా సామి రంగ' అనిపించిన నాగార్జున
సంక్రాంతి ని తెరపై చూపింది
ఈ సంక్రాంతికి పోటీపడిన మూడు పెద్ద సినిమాల్లో ఇది చివరిది. మొదటి రెండు సినిమాలు ఒక క్లిష్టమైన సమస్యతో ముడిపడి ఉంటాయి. నా సామీ రంగ మాత్రం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన సాదాసీదా కథ. నిజానికి ఈ సినిమా 2019 సంవత్సరం మలయాళం లో వచ్చిన" పురింజు మరియన్ జోస్" అనే సక్సెస్ ఫుల్ సినిమాకి రీమేక్. ఇందులో తెలుగు వాతావరణానికి, ప్రేక్షకులకు అనుగుణంగా చేసిన మార్పులు ఉన్నాయి. మహేష్ బాబు " గుంటూరు కారం", విక్టరీ వెంకటేష్ " సైంధవ్" సినిమాల కన్నా దీనికి ఎక్కువ మార్కులు వస్తాయి. సంక్రాంతికి, సంక్రాంతి నేపథ్యంతో వచ్చి, సంక్రాంతిని ఆహ్లాదకరంగా తెరపై చూపించి ప్రేక్షకులను అలరించిన సినిమా ఇది. ఈ మధ్యకాలంలో కింగ్ నాగార్జునకి బ్లాక్ బస్టర్స్ లేవు. ఒక బంగారు రాజు లాంటి సినిమా కొంత ఊరటను ఇచ్చినా మెగా సక్సెస్ లు లేవు. ఈ సినిమా చాలావరకు నాగార్జునకు సంతృప్తి ఇవ్వవచ్చు
సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి నాగార్జునను విజేతగా నిలబెట్టిన సినిమా అని చెప్పాలి
.
పై రెండు సినిమాలు కన్నా తక్కువ బడ్జెట్ తో(దాదాపు 50 కోట్లు) తీసిన సినిమా ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కనక ఫోటోగ్రఫీ బాగుంటే ఇబ్బంది పడకుండా దీన్ని చూడవచ్చు. అదే జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు, ఇతర ప్రేక్షకుల కు కొంతవరకు, నాగార్జున ఫ్యాన్స్ కు, చాలావరకు నచ్చే సినిమా ఇది. మొదటి రెండు యాక్షన్, ప్లస్ హీరో కు ఉన్న సమస్యతో కూడిన సినిమాలు. “నా సామి రంగా” అలా కాదు. 1963 నుండి మొదలై ఓ పాతిక సంవత్సరాలు నడిచే పీరియాడికల్ సినిమా. ఇందులో ఈ మధ్య తెలుగు సినిమాల్లో వస్తున్న అల్ట్రా మాడ్రన్, స్టైలిష్, హెవీ ఫైట్లు అస్సలు లేవు. అంత నాటు గా కత్తి తో నరకడాలే. బాంబ్ బ్లాస్ట్ లో, వాహనాలు మనుషులు గాల్లో ఎగరడం వంటి ఫైట్లు లేకపోవడం వల్ల ప్రేక్షకులు కొంచెం ప్రశాంతంగా కూర్చుని చూసే సినిమా కాబట్టి, ఇది చాలామందికి నచ్చవచ్చు.
సింపుల్ రీమేక్ కథ
రీమేక్ సినిమా కాబట్టి కథ గురించి ప్రేక్షకులకి అంతో ఇంతో తెలిసే ఉంటుంది. పల్లెటూరులో ఒక అనాధ( లేక అనాధలు), వారికి సహాయం చేసిన పెద్దయ్య అనే ఒక పెద్ద మనిషి, ఆయన ముగ్గురు కొడుకులు రెండు మూడు ప్రేమ కథలు, పల్లెటూర్లలో సహజంగా ఉండే కొన్ని సమస్యలు, ఓ రెండు మూడు ఫైట్లు, అందమైన,కొత్త తరహాగా కంపోజ్ చేసిన ఒకటి రెండు పాటలు. అందరూ ఊహించే క్లైమాక్స్ తో కూడిన కథ ఇది. కొత్తది కాదు గాని ఈ సినిమాని నిలబెట్టే అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.
ఇంతకు ముందు చెప్పినట్లు గత కొంతకాలంగా వచ్చిన సినిమాలు చాలా యాక్షన్, ట్విస్టులు, సస్పెన్స్ లు వంటి వివిధ రకాల ఫార్మేట్ లలో ప్రజలను ఇబ్బంది పెట్టడం అన్నది ఈ సినిమాకి కలిసి వచ్చింది. 1963 లో మొదలై కొంతకాలం నడిచిన సినిమా అయినప్పటికీ అది అలా కనపడదు. అయినప్పటికీ గతకాలంగా వచ్చిన కొన్ని సినిమాల కంటే ఇది కొంచెం రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా అటు ఇటుగా చూడదగ్గ సినిమాగా తయారైంది.
డిఫరెంట్ మాస్ పాత్రలో నాగార్జున
నటీనటుల గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నాగార్జున(కిష్టయ్య) ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించాడు. అంతకు ముందు నాగార్జున సోగ్గాడే చిన్నినాయన, బంగారు రాజు లాంటి పల్లె నేపథ్యంలో వచ్చిన సినిమాలకు ఇది కొంచెం భిన్నంగా ఉంది. 80 సినిమాలో నటించిన, ఒక ప్రముఖ నటుడి వారసుడైన నాగార్జున యాక్షన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పని తాను సమర్థవంతంగా చేసుకుంటూ పోయాడు. ఇక్కడ నాగార్జున ఒక మంచి పని చేసినట్లు కనిపిస్తుంది. . తన పాత్రకు ఎక్కువ ఫుటేజ్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ పని అల్లరి నరేష్(అంజి) కి, ఇతర నటులకు ఇచ్చాడు. ఇది సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమా హీరోయిన్ ఆషిక రంగనాథ్(వరలక్ష్మి అలియాస్ వరాలు) నటనకు మంచి మార్పులు వస్తాయి. అందంగా ఉండడం సినిమాకి ప్లస్ పాయింట్. "గమ్యం" సినిమా తర్వాత ఆ స్థాయి పాత్ర నరేష్ కు దక్కింది. నరేష్ దానికి చాలా వరకు న్యాయం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాలు, పాటలు, ఫైట్లలో కూడా అల్లరి నరేష్ కొంచెం ఎదిగాడనిపించింది. ఈ సినిమాలో ఎమోషన్స్ని పండించడానికి అవకాశం ఉన్న పాత్ర నరేష్ పాత్రనే. దాన్ని బాగానే యూటిలైజ్ చేసుకున్నాడు.
ఇక లవర్ బాయ్ రాజ్ తరుణ్(భాస్కర్) కి ఇది కొత్త తరహా పాత్ర. ఏదో అలా నెట్టుకుపోయాడు అంతే. నాజర్(పెద్దయ్య ) గురించి చెప్పడానికి ఏముంది. ప్రొఫెషనల్ నటుడు. ఈ సినిమాకి విలన్ (షబ్బీర్ కలక్కల్) అంటూ ఒకడు ఉండాలి కాబట్టి ఉన్నాడు. కానీ అనూహ్యంగా అతను విలన్ గా బాగా చేశాడు. ఇది సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్.
మొదటి సిన్మా అయినా....
థ్రిల్స్,సస్పెన్స్, ట్విస్టులు లేని సినిమా కాబట్టి దాన్ని నడపడం కొంచెం కష్టమే, అయితే దర్శకుడు విజయ్ బిన్నీ ని అభినందించాలి. చాలా వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా నడపడానికి ప్రయత్నం చేశాడు. దాంట్లో చాలా వరకు సఫలం కూడా అయ్యాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా తన మొదటి సినిమా అని అనిపించకుండా తీయడం. ఈ సినిమాలో కామెడీ కూడా చాలా వరకు పండింది. వృత్తిపరంగా నృత్య దర్శకుడు కాబట్టి ఈ సినిమాలో నృత్యాలు కూడా కొత్త స్టైల్ లో బాగా ఉన్నాయి .. కొంతవరకు హాయిగా ఉన్నాయి కూడా. ఈ సినిమా మొత్తం ప్రశాంతంగా ఉండడానికి చాలా వరకు కారణం ఫోటోగ్రాఫర్ దాశరధి శివేంద్ర. దాదాపు చాలా మటుకు సినిమా కంటికి ఇంపుగా ఉంది. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన డైలాగులు విలేజ్ నేటివిటీ కి దగ్గరగా ఉన్నాయి. అక్కడక్కడ పేలాయి అయి కూడాను.
కీరవాణి మ్యూజిక్.. మ్యాజిక్
ఇక చివరకు చెప్పాల్సింది కీరవాణి గురించి. కీరవాణి చాలా క్రియేటివ్, ఈస్తటిక్ సెన్స్ ఉన్న సంగీత దర్శకుడు అని అందరికీ తెలుసు. దీనిలో అది చాలా వరకు చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజి సినిమా బ్యాక్ డ్రాప్ కి అనుగుణంగా ఉంది. ఇది కీరవాణి క్రియేటివిటీ.. ఇంతకు ముందు వచ్చిన చాలా సినిమాల్లో మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నిజంగానే "అదిరి"పోయేలా ఉంది. అది ఆ సినిమాలకు మైనస్ అయితే, ఈ సినిమాకు ప్లస్ అయింది. రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూడడం కాకుండా, మొగుడిని చూసిన కళ్ళతో రాజును చూడటం లాంటిది ఈ సినిమా.
ముఖ్యంగా "దుమ్ము దుకాణం" పాట దానికి సంబంధించిన డాన్స్ ఒక లెవెల్ లో ఉంది.. కొంత కాలం పాటు ఇది ఈ తరం సెల్ ఫోన్ లలో రింగ్ టోన్ గా మనం వినొచ్చు. లోకల్ బార్ లో నాగార్జున బృందంతో తీసిన పాటతో పాటు కొరియోగ్రఫీ, తాగుబోతుల మనస్తత్వాన్ని కి అనుగుణంగా ఉంది. కొంచెం క్రియేటివ్ గా కూడా ఉంది. ఈ పాట నాగార్జున ఫ్యాన్స్ కి పండగే.
చివరగా చెప్పాలంటే ఈ సంక్రాంతి పోటీలో నా సామిరంగా సినిమాతో, నాగార్జున విన్నర్ గా నిలబడే అవకాశం ఉంది. సినిమా టైటిల్ ని బట్టి చెప్పాలంటే కొంతవరకు " నా సామి రంగ" అనిపించింది..
తారాగణం :
నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్, షబీర్ కల్లరక్కల్, రావు రమేష్, నాజర్
స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: విజయ్ బిన్ని
కథానువాదం , మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి
కూర్పు : చోటా కె. ప్రసాద్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
బడ్జెట్:సుమారు 50 కోట్లు
విడుదల తేదీ: 14జనవరి 2024