తమన్నా 'డు యూ వాన్నా పార్ట్నర్' వెబ్ సిరీస్ రివ్యూ!
ఫన్ ఉంది… హార్ట్ మిస్సైంది!;
శిఖా రాయ్ (తమన్నా) చిన్నప్పుడే ఆమె కళ్ల ముందే ఒక దారుణం జరుగుతుంది. ఆమె తండ్రి సంజయ్ రాయ్ ఎంతో కష్టపడి తయారు చేసిన ఓ కొత్తరకం బీర్ ఫార్ములా దొంగతనానికి గురి అవుతుంది ఆ ఫార్ములాను దొంగిలించి విక్రమ్ వాలియా (నీరజ్) తాను ఎదగటం మొదలెడతాడు. అది చూసి మోసాపోయానన్న ఆ బాధలో శిఖారాయ్ తండ్రి చనిపోతాడు. తండ్రిని కోల్పోయిన బాధ, వాలియా చేసిన ద్రోహం — చిన్నారి శిఖా మనసులో శాశ్వతంగా ముద్ర వేసేస్తాయి.
ఏళ్ళు గడిచాయి…
ఇప్పుడు కష్టపడి సంపాదించిన కార్పొరేట్ ఉద్యోగం పోగొట్టుకుని నిరాశలో ఉంటుంది శిఖా. అప్పుడు ఆమె తన భవిష్యత్..తన తండ్రి కలను నిజం చేయటమే అని అర్దం చేసుకుంటుంది. దాంతో తానే స్వయంగా బీర్ బ్రాండ్ లాంచ్ చేస్తుంది. అదే “జుగారో బ్రాండ్. కానీ ఇలా సొంతంగా వ్యాపారంలో ముందుకు వెళ్లటం ఆమె ఒక్కదాని వల్ల సాధ్యంకాదు. దాంతో ఈమె కలలకి రెక్కలివ్వటానికి ముందుకు వస్తుంది ఆమె బెస్ట్ ఫ్రెండ్ అనహిత (డయానా పెంటీ). అనహిత మార్కెటింగ్‌లో మాస్టర్. అలా ఇద్దరూ కలసి బీర్ బిజినెస్‌లో అడుగుపెడతారు.
అయితే అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. అక్కడ వారికి రకరకాల సమస్యలు ఎదురౌతాయి. మొదట “ఇది లేడీస్ చేసే బిజినెస్ కాదు” అంటూ పురుష ఆధిపత్యం తలుపులు మూసేసే ప్రయత్నం చేస్తుంది. దానికి తోడు వాలియా ఇప్పటికే ఆ రంగంలో పెద్ద ప్లేయర్ గా ఎదిగిపోయాడు. ఇప్పటికే మార్కెట్ పై గట్టి పట్టు పట్టి బిగించి కూర్చున్నాడు.
ఇప్పుడు ప్లాన్ ఏమిటి?
అక్కడే శిఖా–అనహిత బ్రెయిన్‌కి ఒక క్రేజీ ఆలోచన వస్తుంది. బిజినెస్‌కి ఒక కల్పిత మగ యజమాని ని క్రియేట్ చేస్తారు —అతని పేరు డేవిడ్ జోన్స్ ! AIలో ఫోటోలు, డేటా అన్నీ తయారు చేసి, అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తారు.
అయితే అనుకోనిది జరుగుతుంది. డేవిడ్‌ని డైరక్ట్ గా కలవాలనుకునే ఇన్వెస్టర్లు, డీలర్లు గందరగోళం సృష్టిస్తూంటారు. అప్పుడు? ఇద్దరూ ఒక ఫన్నీ కానీ రిస్కీ ప్లాన్ వేస్తారు — మతిమరుపుతో అల్లరి చేసే ఒక యాక్టర్ (జావేద్ జాఫ్రి)ని తీసుకుని, డేవిడ్ జోన్స్ గా నటింపజేస్తారు.
ఇక మొదలవుతుంది అసలైన ఆట! జావేద్ జాఫ్రి చేసే కామెడీ, మార్కెట్ ఒత్తిడి, వాలియా వేసే ఎత్తుకు పై ఎత్తులు — ఇవన్నీ కలగలసి శిఖా–అనహిత కలను ఎక్కడికి తోసుకెళ్తాయి?.
వాలియా దుర్మార్గాలకి గట్టి సమాధానం చెప్పగలిగారా?
లేదా డేవిడ్ జోన్స్ అనే అబద్ధమే వారిని కూలదోసేస్తుందా? చివరకి ఏమైంది.
జుగారో అనే ఆ ఇద్దరు స్నేహితుల స్వప్నయానం! ఏ తీరం చేరింది, తెలియాలంటే వెబ్ సీరిస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
"Do You Wanna Partner" అనే సిరీస్, మగవారి ఆధిపత్యం ఉన్న మద్యం పరిశ్రమలో, ఇద్దరు మహిళలు ఎలా బారియర్స్ బ్రేక్ చేస్తారనే థీమ్‌తో ముందుకు వెళ్తుంది. అక్కడిదాకా మంచి ఐడియానే. కానీ ఎక్కడా డెప్త్ గా వెళ్లకుండా లైట్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లా చేసారు. అలా చేయటమూ మంచి ఐడియానే అనుకుందాం. అయితే అక్కడైనా పూర్తిగా ఎంగేజ్ చేస్తే హ్యాపీ. అదే జరగలేదు.
స్క్రిప్ట్ ఒక సంఘర్షణ నుంచి ఇంకో సంఘర్షణ (కాంప్లిక్ట్) కి దూసుకెళ్తుంది. కానీ నిజమైన కాంఫ్లిక్ట్ లేదా ఎమోషనల్ అడ్డంకులను ను ఎక్కడా ఆవిష్కరించదు.
శిఖా చిన్నతనపు ట్రామా — తండ్రి దొంగిలించబడిన ఫార్ములా — నిజంగా హృదయాన్ని తాకాల్సింది. కానీ స్క్రీన్‌పై అది కేవలం ప్లాట్ పాయింట్ గానే నిలిచిపోతుంది. అనహిత కెరీర్ ఫ్రస్ట్రేషన్స్ కూడా సర్ఫేస్ స్థాయిలోనే ఆగిపోతాయి.
స్క్రీన్ రైటర్ విలియమ్ గోల్డ్‌మన్ అన్నట్టుగా: “Screenplays are structure. That’s all they are.”
ఇక్కడ అదే స్ట్రక్చర్ బలహీనంగా ఉంది.
అలాగే స్క్రిప్ట్ కాస్త అటూ ఇటూగా ఉన్నా, నటీనటులు కొన్ని సందర్భాల్లో తమ టాలెంట్ తో దాన్ని రక్షిస్తారు. ఇక్కడ అలాంటి స్ట్రాంగ్ క్యారక్టర్స్ పడలేదు. కామెడీ కోసం అనుకున్నారేమో ఏదీ సీరియస్ గా ఉండదు.
రాబర్ట్ మెకీ స్టోరీ పుస్తకంలో అన్నట్టుగా: “పాత్రలు అంటే వారు ఏమంటారో కాదు, వారు ఏమి చేస్తారో.” అదే జరగలేదు. అలా ఈ సీరిస్ స్క్రిప్టు దశలోనే స్ట్రాంగ్ గా లేకపోవటంతో కాస్తంత ఇబ్బందిగానే ఉంది. కాకపోతే అక్కడక్కడా వచ్చే ఫన్ లాక్కెళ్లిపోయింది.
* విజువల్స్ & మ్యూజిక్
దిల్లీ, కోల్‌కతా కాంట్రాస్ట్ విజువల్స్ ఆథెంటిక్‌గా ఉన్నాయి. ఫ్రేమ్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రిచ్‌గా ఉంది. పాటలు కొన్ని సీన్లను లిఫ్ట్ చేశాయి.
ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్రేమ్‌లో ఉన్నది అందంగా ఉంది. కానీ ఫ్రేమ్ వెనుక ఉన్న కథ మాత్రం బలహీనంగా ఉంది.
జెండర్ బైయాస్, ఆంట్రప్రెన్యూర్షిప్, ఇన్‌స్టిట్యూషనల్ అడ్డంకులు — ఇవన్నీ డీప్‌గా చూపాల్సింది. కానీ అవన్నీ ఫన్ మాంటేజ్‌లు గా మిగిలిపోయాయి.
ఫైనల్ వెర్డిక్ట్ :
Do You Wanna Partner పూర్తిగా మిస్ చేసిన అవకాశమనే చెప్పాలి. ఫిమేల్ ఆంట్రప్రెన్యూర్షిప్‌ని సెలబ్రేట్ చేయాలని ప్రయత్నించింది. కార్పొరేట్ అబ్సర్డిటీలపై ఫన్ చేయాలని చూశింది. కానీ రైటింగ్ డెప్త్ లేకపోవడం వల్ల ఈ 'బీరులో నురుగే కానీ రుచి లేదు'.
ఎక్కడ చూడచ్చు
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది