సంక్రాంతి బరిలో దిగిన మూడు పెద్ద సినిమాలు పెద్దగా విజయవంతం కాలేదు.వాటిని ప్రేక్షకులు మర్చిపోయారు. హనుమాన్ సినిమా ఇంకా మంచి కలెక్షన్లతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి శుక్రవారం విడుదలైన చిన్న సినిమా " అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. పిల్ల తెమ్మెర లా ప్రేక్షకులకు కొంత రిలీఫ్ ఇచ్చే సినిమా ఇది. దర్శకుడు దుష్యంత్ కటికినేని మొదటి సినిమానే అయినప్పటికీ, ఒక మెచ్చుకోదగ్గ సినిమా తీశాడని చెప్పొచ్చు.
సంక్రాంతి బరిలో దిగిన మూడు పెద్ద సినిమాలు పెద్దగా విజయవంతం కాలేదు.వాటిని ప్రేక్షకులు మర్చిపోయారు. హనుమాన్ సినిమా ఇంకా మంచి కలెక్షన్లతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి శుక్రవారం విడుదలైన చిన్న సినిమా " అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. పిల్ల తెమ్మెర లా ప్రేక్షకులకు కొంత రిలీఫ్ ఇచ్చే సినిమా ఇది. దర్శకుడు దుష్యంత్ కటికినేని మొదటి సినిమానే అయినప్పటికీ, ఒక మెచ్చుకోదగ్గ సినిమా తీశాడని చెప్పొచ్చు.
ఈ సినిమా కథ కొత్తది ఏమి కాదు. ఇంత ముందు సామాజికంగా వెనకబడిన వర్గానికి, ఉన్నత స్థాయి వర్గాలకీ మధ్య వర్గ పోరాటం (క్లాస్ స్ట్రగుల్) తో చాలా సినిమాలు వచ్చాయి. ఊరిలో ఒక పెద్ద మనిషి, ఊరిని తన చేతిలో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నం, మధ్యలో రెండు వర్గాల చెందిన యువతీ యువకుడి ప్రేమ. చివరికి ఊరంతా కలిసి ఇచ్చే ఒక సినిమాటిక్ ముగింపు. ఈ నేపథ్యంతో సినిమాలు ఎన్నో వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి కూడా. అయితే ఇంతవరకు వచ్చిన ఇలాంటి కొన్ని వందల సినిమాల్లో చాలా సినిమాలు మరుగున పడిపోయాయి. కేవలం కొన్ని మాత్రమే మెరిసాయి., మరికొన్ని మెరిసే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ కూడా అయ్యాయి. ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రెండో కేటగిరీలోకి వస్తుంది. చాలా చోట్ల ఈ సినిమా ఉన్నత, వెనుకబడిన తరగతుల మధ్య సంఘర్షణను చూపించే ప్రయత్నంలో కొంచెం విజయం సాధిస్తుంది.
దర్శకుడు చూసిన కొన్ని నిజమైన సంఘటనల మీద ఏ సినిమా కథ రాసుకున్నట్లు సుహాస్(సినిమాలో ప్రధాన పాత్రధారి ""మల్లీ") ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది సినిమాలో నిజంగానే కనిపిస్తుంది. ఒక సోషల్ డ్రామాను మెలో డ్రామా ఉచ్చులో పడకుండా, సింపుల్ గా తీయడంలో దర్శకుడు తన ప్రతిభను చూపించాడు. అక్కడక్కడ కొంచెం సినిమాటిక్ గా, కొంచెం అతిగా అనిపించినా సినిమా చాలా మటుకు సహజంగానే ఉంటుంది. ఇందుకు కారణం దాదాపు ఏ పాత్ర కూడా నేల విడిచి సాము చేయకపోవడం. పాత్రల్ని మలిచిన తీరు, నడిపించిన తీరు కూడా సింపుల్ గా ఉంటూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే ఈ సినిమా బలం. గతంలో వచ్చిన "బలగం" సినిమా( దీన్నిఆస్కార్ పరిశీలనకు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమీక్షించింది) తర్వాత కొంతమంది దర్శకులు ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేశారు. ఈ సినిమాని సమర్పించిన మహా గతంలో " కేరాఫ్ కంచరపాలెం" అనే ఒక సక్సెస్ ఫుల్ సినిమా తీశాడు.
అయితే దీన్ని ఒక వర్గ పోరాటం కింద కాకుండా "ఆత్మాభిమానం" (self dignity) ఫ్లేవర్ ఇవ్వడం ద్వారా, దర్శకుడు వర్గ పోరాటం కాన్సెప్ట్ నుంచి సినిమాను కొంచెం దూరంగా పెట్టడం వల్ల, ఈ సినిమా సహజత్వానికి దగ్గరగా వెళ్లి, ప్రేక్షకులను చాలా వరకు అలరిస్తుంది.
అంతర్లీనంగా వర్గ పోరాటమైనప్పటికీ ఈ సినిమా కవలలైన ఇద్దరు పద్మ(శరణ్య ప్రదీప్), "మల్లీ"(సుహాస్) లకు ఆ ఊరిలో ఉన్న ఉన్నత ధనిక వర్గానికి చెందిన వెంకట్(నితిన్ ప్రసన్న) కు మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ. మధ్యలో మల్లీ(సుహాస్), వెంకట్ చెల్లెలు లక్ష్మి(శివాని నగరం) ల ప్రేమకథ ఈ సినిమా నేపథ్యం. రెండు వర్గాల మధ్య సంఘర్షణ, "మల్లీ" లక్ష్మీల ప్రేమ కథ (కొంచెం హృద్యంగా అనిపిస్తుంది) చాలా వరకు సహజంగానే అనిపిస్తాయి. నటన పరంగా ఈ నలుగురూ బాగానే చేశారు. అయితే ఎక్కువ మార్కులు సుహాస్ కొట్టేస్తాడు. మొదటి సినిమాతోనే శివాని మంచి పేరు తెచ్చుకుంది.
దానికి తోడు ఇంతవరకు కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలలో తన టాలెంట్ చూపించిన శరణ్య ప్రదీప్, ఒక ముఖ్యమైన పాత్రలో తన నటనతో ఈ సినిమాను నిలబెట్టింది. అయితే ఈ సినిమాలో ఇంకొక సర్ప్రైజింగ్ ప్యాకేజీ ఉంది. తనది మొదటి సినిమానే అయినప్పటికీ మెచ్చుకోదగ్గ నటన ప్రదర్శించిన శివాని నాగరం ఈ సినిమాలో యువ ప్రేక్షకులు లీనమయ్యేలా చేయగలిగింది. ఈ అమ్మాయికి అందంతో పాటు అభినయం కూడా ఉందని చూపించిన సినిమా ఇది. మొదటి సినిమాలోని బాగా చేసిన శివానికి భవిష్యత్తులో ఇంకా కొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పాటికి వచ్చేసి ఉన్న ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఒక పరిణితి చెందిన నటనను ప్రేక్షకులు(ముఖ్యంగా యువత) ఆస్వాదిస్తారు. ఈ సినిమాకు ఇది ఒక బలం.
చిన్నచిన్న పాత్రలతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి కలర్ ఫోటో(జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు వచ్చింది) సినిమా ద్వారా కొంత వెలుగులోకి వచ్చిన సుహాస్, హిట్ 2 సినిమాలో విలన్ పాత్రలో మెరిసి ఈ సినిమాతో తన టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. చాలా సన్నివేశాల్లో సుహాస్ నటన ఒక స్థాయిలో ఉంది.
సినిమా కథ కొత్తది కాకపోయినా, దాన్ని కొత్తగా అనిపించేలా రాసిన, తీసిన దర్శకుడు దుష్యంత్ భవిష్యత్తులో ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంది. కథ ఎలా రాసుకున్నారో దాన్ని యధాతధంగా తీయడం చాలా కొద్ది మంది దర్శకులకే సాధ్యమైన పని. కొత్త దర్శకుడు అయినప్పటికీ దుష్యంత్ ఈ పని బాగానే చేశాడు.
ఈ సినిమాల్లో చాలామంది నటీనటులు తమ నటనతో సినిమాను ఎలివేట్ చేశారు. గోపరాజు రమణ అండర్ ప్లే, హీరోయిన్ తల్లిదండ్రులు, పుష్ప సినిమాలో మెరిసిన జగదీష్ ప్రతాప్ బండారి, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి తదితరులు ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేటట్లు చేయగలిగారు. విలన్ పాత్ర వేసిన నితిన్ ప్రసన్న,అక్కడక్కడ ఓవర్ అనిపించినప్పటికీ, కథకు మూలస్తంభమైన విలనీని ప్రతిభావంతంగానే చూపించాడు.. సినిమా మొత్తం నాలుగు పాత్రల మధ్యలో నడిచింది అనుకోవడం సబబు కాదు. మిగతా పాత్రలు కూడా ఈ సినిమాను నడిపించడంలో తమ వంతు పాత్ర పోషించాయి, మొత్తంగా కాకపోయినా, కొంతవరకు ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా చేయగలిగాయి. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే శేఖర్ చంద్ర సంగీతం. ఒకటి రెండు పాటలు, నేపథ్య సంగీతం ప్రశంసించదగ్గ స్థాయిలోనే ఉంది. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర స్వరపరిచి, స్వయంగా పాడిన " గుమ్మ.. గుమ్మ" పాట సాహిత్యం, సంగీతం చాలా బాగున్నాయి. కొంతకాలం పాటు యూత్ పాడుకునే అవకాశం ఉంది. దరిమిలా రింగ్ టోన్ గా మారిన ఆశ్చర్యం లేదు. రెహ్మాన్ రాసిన ఈ పాట సాహిత్యం పల్లెటూరు నేపథ్యానికి చక్కగా సరిపోయింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా లో సుహాస్ పై చిత్రీకరించిన ఈ పాట సుహాస్ లోని డాన్సింగ్ టాలెంట్ ను బయటపెట్టింది. కొరియోగ్రాఫర్ మోయిన్ కొరియోగ్రఫీ హాయిగా, ప్లెజెంట్ గా, కొత్తగా ఉంది. కళా దర్శకత్వం వహించిన ఆశిష్ తేజ పులాల పనితనం పల్లెటూరి బ్యాగ్రౌండ్ ని చక్కగా, కొత్తగా చూపించింది.
ఈ సినిమాలో డైలాగులు కూడా సింపుల్ గా, సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. " ఆడదానికి ముందు ఉండడం మగతనం కాదు, వెనక ఉండి నడిపించడం మగతనం", " ఓ ప్రాణం భూమ్మీదికి రావడానికి పది నెలలు పడుతుంది. అలాంటిది ఒక్కరోజులో నిన్ను లేకుండా చేశాడు", "నేనే గనుక నీ అమ్మని కాకపోయి ఉంటే, కంతలో నుంచి నన్ను కూడా చూసేవాడివి", ఆలోచింపజేస్తాయి. మరికొన్ని హృదయాన్ని తాకుతాయి. గుచ్చుకుంటాయి. "మా వాళ్లకు పీకల మీద కత్తులు పెట్టడం కొత్త ఏం కాదు" లాంటి ఒకటి రెండు డైలాగులు పేలాయి.
ఇలాంటి సినిమాల్లో రొటీన్ గా ఉండే కొన్ని సీన్లను కొంత వైవిధ్యం తో తీయడం ఫ్రెష్ గా ఉంది. అదే సినిమాకు ప్లస్ పాయింట్. ఇవన్నీ కలిసి ఏజ్ ఓల్డ్ కథతో తీసిన సినిమా అయినప్పటికీ, దాన్ని చూడగలిగే స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాలో లోపాలు లేవని కాదు. ఉన్నాయి. అయితే ఆ సినిమా వేగాన్ని, ప్రభావాన్ని, తగ్గించలేదు.
నటీనటులు: శరణ్య ప్రదీప్, సుహాస్, నితిన్ ప్రసన్న, శివాని నాగరం, జగదీశ్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, తదితరులు
దర్శకత్వం : దుశ్యంత్ కటికినేని
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
సంగీతం: శేఖర్ చంద్ర
కళా దర్శకత్వం: ఆశిష్ తేజ పులాల
ఎడిటింగ్: కొదాటి పవన్ కల్యాణ్
నిర్మాత: ధీరజ్ మోగిలినేని
విడుదల : ఫిబ్రవరి 02, 2024