ఆంధ్రాలో పవన్ 'O.G' బెనిఫిట్ షో టికెట్ కేవలం రూ.1000
పవన్ కల్యాణ్ అభిమానుల కేరింత.. ఓజీ పులకింత;
By : The Federal
Update: 2025-09-18 11:17 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ‘ఓజీ’ (OG) సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కొన్ని రోజుల పాటు థియేటర్లలో టికెట్ల ధరలు పెంచుకోవచ్చు. బెనిఫిట్ షోల టికెట్ల ధరలూ పెంచుకోవచ్చు. ఈ నెల 25న రాత్రి 1గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000 (జీఎస్టీతో కలిపి)కు విక్రయించేందుకు అనుమతించింది. అలాగే, చిత్రం విడుదల రోజు నుంచి అక్టోబరు 4 వరకు (OG Movie Ticket Prices- AP) సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీ సహా) మేరకు అదనంగా పెంచుకొనేందుకు వీలు కల్పించింది.
టికెట్ ధరల పెంపుపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్స్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థాంక్స్ చెప్పింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో పవన్ 'ఓజాస్ గంభీర' (OG)గా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో ఓమీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా నేపథ్యం సంగీతంలో కొత్త ఒరవడి సృష్టించనున్నారు. జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి కొన్ని సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేశారు. లండన్‌లోని ప్రఖ్యాత స్టూడియోలో 117 మంది సంగీత కళాకారులతో వర్క్ చేశారు.
ఈ సినిమాకి సంబంధించి తాజాగా తమన్ (Thaman) ఓ మ్యూజికల్ అప్‌డేట్ షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా కోసం జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి బీజీఎం క్రియేట్ చేసినట్లు తెలిపిన ఆయన తాజాగా మరో పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. లండన్‌లోని స్టూడియోలో దీని రికార్డింగ్ పనులు జరుగుతున్నట్లు తమన్ తెలిపారు. 117 మంది సంగీత కళాకారులు దీనికోసం వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చిందన్నారు. తమన్ పోస్ట్‌తో #HungryCheetah హ్యాష్ ట్యాగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.