పొలిటికల్ థ్రిల్లర్: 'ఎ హౌస్ ఆఫ్ డైనమైట్' మూవీ రివ్యూ!
స్క్రీన్ పై బాంబ్… కానీ పేలింది మన బుర్రల్లో
అలాస్కాలోని ఒక హై-సెక్యూరిటీ మిలిటరీ బేస్‌లో ఆ రోజు ఉదయం ఎప్పటిలాగే సాధారణ పనిరోజు మొదలైంది.కానీ కొద్ది నిమిషాల్లో దేశ భద్రతా వ్యవస్థలను మొత్తం అలెర్ట్ మోడ్‌లోకి నెట్టేసే సిట్యువేషన్ ఎదురైంది. కెప్టెన్ ఒలీవియా వాకర్ (Rebecca Ferguson) తన విధుల్లో ఉన్నప్పుడు రాడార్ లో ఒక్కసారిగా ఒక కీలక సిగ్నల్ గమనిస్తుంది . పసిఫిక్ దిశ నుంచి అమెరికా వైపు దూసుకొస్తున్న బాలిస్టిక్ మిస్సైల్. మొదట ఇది సాధారణ టెస్ట్ అనుకున్న టీమ్, ట్రాజెక్టరీ చికాగో వైపు మళ్లడంతో ఒక్కసారిగా షాక్‌లో పడుతుంది.
వాకర్ వెంటనే పై అధికారులకు సమాచారం అందించి, వైట్ హౌస్‌తో కనెక్ట్ అవుతుంది. కొన్ని నిమిషాల్లోనే దేశం మొత్తం అత్యవసర మోడ్‌లోకి మారుతుంది — పెంటగాన్ టీమ్ యాక్షన్‌లోకి దిగుతుంది, డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ చేయబడతాయి, కానీ ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది.
ఒక దశలో అధికారం ఉన్నవారే చేతులెత్తేస్తారు. తమ కుటుంబాలను సంప్రదించి చివరి మాటలు చెప్పే మానవీయ క్షణాలు కనిపిస్తాయి. ఈ న్యూక్లియర్ దాడి వెనుక ఎవరు ఉన్నారనే ప్రశ్న మాత్రం సమాధానం లేకుండా తిరుగుతూనే ఉంటుంది. రష్యా, చైనా, పాకిస్థాన్ వంటి దేశాలపై అనుమానాలు పడతాయి, కానీ రష్యా వెంటనే తన ప్రమేయాన్ని ఖండిస్తుంది.
అమెరికా ఇప్పుడు రెండు యుద్ధాల్లో చిక్కుకుంటుంది. ఒకటి బయట నుంచి వచ్చే అణు బెదిరింపు, మరొకటి లోపలే పుట్టిన భయం మరియు గందరగోళం. అమెరికా ప్రెసిడెంట్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ప్రతిదాడి చేస్తాడా? లేక అంతర్జాతీయ యుద్ధాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తాడా? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది..
హాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలు తీయాలంటే మగాళ్లు మాత్రమే ఫిట్ అవుతారు అనే మిథ్‌ని బద్దలు కొట్టిన పేరు — కాథరిన్ బిగెలో.
ఆమె సినిమాలు కేవలం బుల్లెట్లు, ప్రేలుళ్లు మాత్రమే కాదు. మెదడు, మానసిక ఒత్తిడి, ప్రాణాలు పణంగా పెట్టిన నిర్ణయాలు, నిశ్శబ్దంలో దాగిన భయం.
“Zero Dark Thirty”లో ఒసామా బిన్ లాడెన్ హంట్ — ఒక సీఐఏ అనలిస్ట్ తనలోని చీకటిని ఎలా ఏక్సెప్ట్ చేసిందో, వర్క్ కోసం తన మనసును స్వయంగా ఎలా స్ట్రాంగ్ చేసుకుందో కనపడుతుంది. బిగెలో తెరపై చూపింది రక్తపాతం కాదు, మనస్తత్వం.
ఇక “The Hurt Locker”లో బాంబులను డిసార్మ్ చేసే సైనికుడు — ప్రమాదం అతని పని కాదు… అతని పిలుపు. యుద్ధభూమి అతనికి నరకం కాదు… అతని సుఖం. మనసు ఎంతగా ప్రమాదాన్ని ప్రేమించగలదో చూపించడంలో బిగెలో ప్రత్యేకంగా చూపెడుతుంది.
ఎవరూ చేయలేని యాక్షన్ రియలిజం,యాక్షన్ చర్యల ద్వారా క్యారెక్టర్ రివీల్ చేయటం వంటివాటితో ప్రపంచంలో బిగెలో స్థానం ప్రత్యేకం. కానీ “A House of Dynamite” — బిగెలో ఔట్ ఆఫ్ సింక్? న్యూక్లియర్ కౌంట్‌డౌన్ థ్రిల్లర్… అణుబాంబ్ ముప్పు… అమెరికా నగరం ప్రమాదంలో… విన్న వెంటనే “Fail Safe”, “Seven Days in May” మైండ్‌లోకి వస్తాయి. కాని రిజల్ట్?
లోతుకు వెళ్లకుండా పైపైన నడిచిన స్క్రిప్ట్ ఈ సినిమాపై ఆసక్తిని చంపేసింది. థ్రిల్లర్ అనుకుని చూస్తే , చివరకు మిగిలింది సూట్ వేసుకున్న అధికారుల మాటలే. గదిలో గడియారం టిక్‌టిక్… ఏజెన్సీ అబ్రివియేషన్స్… డైలాగ్‌లు డైరీ లో వాక్యాల్లా, కథలో కానీ కథనంలో కానీ, సీన్స్ లో కానీ ఎక్కడా టెన్షన్ లేకుండా ఓపిక పరీక్ష పెట్టే సినిమా ఇగి. ఈ సినిమాని బిగెలో తీసింది అంటే నమ్మబుద్ది కాదు.
సినిమా అయ్యే సరికి, గోళ్లు కొరికేటంత టెన్షన్ కాదు, సీట్లో కుదురుగా కూర్చోలేనేంత బోర్. అణుబాంబ్ పేలలేదు… దర్శకురాలిగా బిగె పై నమ్మకం పేలిపోయింది. బిగెలో తన క్రాఫ్ట్‌తో ఓడిపోయినట్టు అనిపిస్తుంది. “A House of Dynamite”? చిన్న రక్తపు బొట్టు కూడా చూపించదు.
కథంతా ఆఫ్‌స్క్రీన్ థ్రెట్ మాత్రమే. ప్రత్యక్ష మరణాలు లేవు — ఒకటి తప్ప, అది కూడా వ్యంగ్యాత్మకంగా హాస్యంగా కనపడే విధంగా ఉంటుంది.
ఈ ఏడాది వచ్చిన “Mission: Impossible – The Final Reckoning”, రియలిజం అనే ట్యాగ్ లేకపోయినా, అణు ప్రమాదం గురించి మరింత ఛిల్లింగ్ గా చూపించింది. అక్కడ ప్రెసిడెంట్ ఏ ముందస్తు నిర్ణయం తీసుకోవాలి అనే డిబేట్ ...AI న్యూక్లియర్ కోడ్స్‌ని స్వాధీనం చేసుకున్నప్పుడు జరగటం గమనించవచ్చు.
బిగెలో సాధారణంగా శబ్దం కన్నా శ్వాసతో టెన్షన్ రేపే దర్శకురాలు. ఇక్కడ అయితే టెన్షన్ బదులుగా టెక్నికల్ స్టేట్మెంట్లు, రీసెట్ నారేటివ్, గదుల్లో పాకే ఎమోషన్ లేకపోవడం ఎక్కువగా ఉన్నాయి. సినిమాలో థ్రిల్ లేదు —ప్రొసీజర్ ఉంది. సైలెన్స్ లేదు —స్కోర్ హడావిడి మాత్రమే.
వాస్తవికతకు అద్దం కాదు —బ్యూరోక్రటిక్ డ్రై రన్‌లా అనిపిస్తుంది.
ఏదైమైనా బిగెలో లాంటి మాస్టర్‌కు ఇది సరిపడే యుద్ధభూమి కాదు.
చూడచ్చా
సినిమా న్యూక్లియర్ భయం గురించి, కానీ అది మనలో ఆ భయాన్ని రేపటం మర్చిపోయింది. కాబట్టి యాక్షన్ సినిమా అనుకుని ఆవేశపడితే నిరాశ మిగులుతుంది.
ఎక్కడ చూడవచ్చు
నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది