మహిళల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు…వివాదం

మంచు మనోజ్, అనసూయ, చిన్మయి ఆగ్రహం

Update: 2025-12-23 13:19 GMT

ఇటీవల వరకూ శివాజీ పేరు వినిపిస్తే నటన, ఎంపిక చేసిన పాత్రలు, రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌లు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అదే పేరు చుట్టూ మాటల తుఫాన్ తిరుగుతోంది. ఒక నటుడి కెరీర్‌లో పాత్రలు మాట్లాడాలి అనుకునే దశలో, ఇప్పుడు ఆయన మాటలే పెద్ద చర్చగా మారాయి. ప్రశంసల నుంచి విమర్శల దాకా శివాజీ ప్రయాణం ఒక్కసారిగా మలుపు తిరిగింది.

‘కోర్ట్’ సినిమా, ‘90స్’ వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ, ఇటీవలి కాలంలో పబ్లిక్ వేదికలపై మాట్లాడే తీరుతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాను స్పష్టంగా మాట్లాడతానని చెప్పుకునే ఆయన శైలి, కొందరికి నిజాయితీగా అనిపిస్తే, మరికొందరికి అది బోధనలుగా, మోరల్ లెక్చర్లుగా అనిపిస్తోంది. అదే ధోరణి తాజా వివాదానికి కేంద్రబిందువైంది.

ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. నేటి హీరోయిన్లు ఎలా డ్రెస్ చేసుకోవాలి అనే అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడితో ఆగలేదు. మహిళలను సూచిస్తూ “సామాను” వంటి పదాలు, అలాగే అవమానకరంగా భావించబడే “ఎం*దా” అనే పదం వాడినట్టు వీడియోలు బయటకు రావడంతో నెట్టింట ఒక్కసారిగా దుమారం రేగింది. ఆ మాటలు వినిపించిన క్షణం నుంచే శివాజీపై విమర్శల తుఫాన్ మొదలైంది.

సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. శివాజీ వ్యాఖ్యలు మహిళల పట్ల మిసోజినీ భావజాలాన్ని ప్రతిబింబిస్తున్నాయని, పాతకాలపు ఫ్యూడల్ మైండ్‌సెట్‌ను బయటపెడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఒక పబ్లిక్ ఫిగర్‌గా ఉండి ఇలాంటి భాష వాడటం అసహ్యకరమని చాలామంది మండిపడ్డారు. ఈ విమర్శలు కేవలం ట్రోలింగ్ వరకే ఆగలేదు.

ఈ వ్యవహారం మహిళా హక్కుల కార్యకర్తల దృష్టికి కూడా వెళ్లింది. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, మహిళలను అవమానించేలా మాట్లాడినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం సోషల్ మీడియా హద్దులు దాటి, చట్టపరమైన కోణంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ సెలబ్రిటీలు కూడా బహిరంగంగా స్పందించడం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది. నటుడు మంచు మనోజ్, నటి అనసూయ భరద్వాజ్, గాయని చిన్మయి శివాజీ మాటలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, సమాజంలో ఇలాంటి ఆలోచనలకు చోటు లేదని వారు స్పష్టం చేశారు.

మంచు మనోజ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో, ఒక సివిలైజ్డ్ సొసైటీ మహిళల హక్కులను కాపాడుతుందే తప్ప, వారి ఎంపికలను నియంత్రించదని పేర్కొన్నారు. శివాజీ వ్యాఖ్యలకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆ మాటలకు వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పారు. అలాగే, ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు మొత్తం పురుషులకీ, సినిమా పరిశ్రమకీ ప్రతినిధులు కాదని ఆయన స్పష్టం చేశారు.

అనసూయ భరద్వాజ్ మాత్రం శివాజీ పేరు ప్రస్తావించకుండా స్పందించారు. మహిళకు తన శరీరంపై, తన దుస్తులపై పూర్తి హక్కు ఉంటుందని ఆమె అన్నారు. “ఇది నా శరీరం, నీది కాదు” అనే ఆమె వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గాయని చిన్మయి కూడా ఘాటుగా స్పందించారు. ఎవరూ అడగకుండానే సలహాలు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే శివాజీ వాడిన అవమానకర పదాలను ప్రస్తావిస్తూ, ఇలాంటి భాష మహిళల పట్ల ఉన్న సెక్సిస్ట్, మిసోజినిస్టిక్ మైండ్‌సెట్‌ను స్పష్టంగా చూపిస్తుందని వ్యాఖ్యానించారు.

ఇంతటి విమర్శలు, స్పందనలు వెల్లువెత్తుతున్నప్పటికీ, శివాజీ ఇప్పటివరకు ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన నటించిన తాజా సినిమా ‘ధండోరా’ ఈ వీకెండ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆసక్తికరంగా, ‘కోర్ట్’ సినిమాలో ఆయన పోషించిన పాత్రలో కనిపించిన ఆలోచనా విధానమే ఇప్పుడు నిజ జీవితంలో ఆయన మాటల్లో ప్రతిఫలిస్తున్నట్టుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెరపై పాత్రకు, బయట వ్యక్తిత్వానికి మధ్య గీత మసకబారిందా అన్న ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

మొత్తానికి, ఒక నటుడిగా శివాజీ సంపాదించిన క్రెడిట్, ఒక్క ప్రసంగంతో డ్యామేజ్ అయ్యే ప్రమాదంలో పడింది. ‘ధండోరా’ విడుదల ముందు ఇది ఆయనకు అనవసరమైన షాక్‌గా మిగులుతుందా, లేక ఈ వివాదం ఆయన ఇమేజ్‌ను దీర్ఘకాలంగా ప్రభావితం చేస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.

ఈ క్రమంలోనే శివాజీకి నోటీసులను ఇవాళ(మంగళవారం) జారీ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద. శివాజీ మాట్లాడిన మాటలను మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిందని తెలిపారు. ఆయన మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. నటులు సినీ వేడుకల్లో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు నేరెళ్ల శారద.

Tags:    

Similar News