బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం' ఓటీటీ మూవీ రివ్యూ!
ఈ కంటెంట్ ఎలా ఉంది, సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;
కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. పాటలు .. సంగీతం .. ఎడిటింగ్ .. నిర్మాణం .. దర్శకత్వం ఇలా అన్ని విషయాలను ఒకరే చేయాలంటే చాలా కష్టం. అప్పట్లో దాసరి నారాయణరావు అలా అన్నీ తానై నడిపించేవారు. అలా ఈ జనరేషన్ లో దర్శకులు ఎవరూ కనిపించలేదు. తాజాగా బండి సరోజ్ కుమార్ అనే ఈ దర్శకుడు సవ్యసాచిలా తను నటిస్తూ, అన్ని తానై చూసుకుంటూ చేసిన సినిమా ఇది. థియేటర్ లో రిలీజై పెద్దగా ఆడని ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో ఆయన అందించిన ఈ కంటెంట్ ఎలా ఉంది, సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
థియేటర్ ఆర్టిస్ట్ సత్తిరాజు ( బండి సరోజ్ కుమార్)కి అతని ఊర్లో చార్లి చాప్లిన్ అని పేరు. తన కమ్యూనిటీలో జరిగిన ఓ అన్యాయాన్ని నాటకంగా మలిచి ప్రదర్శించాలనుకుంటాడు. అది సాధ్యం కాదు. అంతేకాదు తనకు అన్యాయం చేసినవాళ్లను ఎదిరించే సత్తా ఉన్నవాడు కాదు. యముడు వేషం వేస్తే తన ఊరి మునసబుకు యముడు అంటే ఉన్న భయం కొద్ది వేయద్దని ఆపేస్తాడు. దాంతో అనారోగ్యం పాలైన సత్తిబాబు తన కొడుకు లోవరాజు (బండి సరోజ్ కుమార్) ని పిలిచి ఎప్పటికైనా తను రాసిన పరాక్రమం అనే నాటకాన్ని వేయమని మాట తీసుకుని చనిపోతాడు.
ఇక లోపరాజుకు చిన్నప్పటి నుంచి నాటకాలు, క్రికెట్ అంటే పిచ్చి. పాక్ క్రికెటర్ అఫ్రిది అంటే ప్రాణం. దాంతో బెట్ కానీ మరీ తన ఊర్లో మ్యాచ్ లు అన్ని గెలుస్తూంటాడు. అయితే అతన్ని పరాక్రమం నాటకం వెంబడిస్తూనే ఉంటుంది. ఎలాగైనా రవీంద్రభారతిలో ఆ నాటకం వెయ్యాలని ప్రయత్నిస్తూంటాడు. మరో ప్రక్క లోవరాజు చుట్టు ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రన్ అవుతుంది. లోవరాజును అతని మరదలు భవాని ప్రేమిస్తూ ఉంటుంది. అతను కూడా ఆమెను ఇష్టపడతాడు. అయితే మునసబు కూతురు లక్ష్మి కూడా లోవరాజును ప్రేమిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అన్నయ్య నానాజికి లోవరాజు అంటే పడదు.
ఇదిలా ఉంటే అన్ని ఏర్పాట్లు చేసుకున్న రవీంద్రభారతిలో నాటక ప్రదర్శనకు బయలుదేరతాడు. అప్పుడు అతనికి రకరకాల సమస్యలు, అడ్డంకులు వస్తాయి. వాటిని లోవరాజు ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు తన నాటక ప్రదర్శనను ఎలా పూర్తి చేశాడు. అతని ప్రేమ కథ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
బండి సరోజ్ కుమార్ సినిమాలకు ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఉంది. తనకు నచ్చిన సినిమాలను తన కు నచ్చినట్లు తీసుకుంటూ పోతూంటాడు. ఫ్లాఫ్, హిట్ లు పట్టించుకోడు. ఈ సినిమా కూడా అలా తీసిందే అనిపిస్తుంది. సినిమా కథగా కన్నా సీన్స్ గా ఈ సినిమా చాలా చోట్ల మెప్పిస్తుంది. అతనిలోని నటుడు, డైరెక్టర్ పోటీ పడతారు కొన్ని చోట్ల. ఓ ప్రక్క తండ్రి కోరిక తీర్చాలనే తపన, క్రికెటర్ గా తనేంటో చూపించుకోవాలనే తాపత్రయం, వీటితో పాటు తన ప్రేమ కథ వీటిని మూడు లేయర్స్ గా సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్లాడు.
కథగా కొత్తగా ఏమీ అనిపించదు. కానీ చాలా చోట్ల ఎమోషనల్ వైజ్ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్ గా తీసుకోవాల్సింది అనిపిస్తుంది. సినిమా బేసిక్స్ ని పక్కన పెట్టి సహజంగా రాసుకుంటూ వెళ్లిన కథనం కావటంతో కొత్తగా అనిపిస్తుంది. అయితే గతం ..ప్రస్తుతం మధ్య కథ నడపడం కాస్త ఇబ్బంది పెట్టింది. డైలాగ్స్ బాగున్నాయి. చాలా సహజంగా సినిమా టెక్ లేకుండా నడిచిపోతాయి.
టెక్నికల్ గా
ఈ సినిమాలో బడ్జెట్ పరంగా చిన్నది అయినా టెక్నికల్ గా చాలా అబ్బుర పరిచే అంశాలు ఉంటాయి. మంచి ఫేస్ తో పరుగెత్తే ఎడిటింగ్, ట్రాన్సాక్షన్స్, మ్యూజికల్ టచ్ వంటివి బాగుంటాయి. కెమెరా వర్క్ కూచాలా చాలా ఎనర్జీగా ఉంటుంది. లో బడ్జెట్ లో తీసిన సినిమా అయినా ఎక్కడా సాంకేతికంగా తగ్గదు. అన్ని డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసాయి. నటుడుగా బండి సరోజ్ కుమార్ మరో మెట్టు ఎక్కిన సినిమా ఇది.
చూడచ్చా
ఓ సారి చూడదగ్గ సినిమానే. బండి సరోజ్ కుమార్ గత సినిమాల్లో బూతులు గట్రా ఉంటాయి కానీ ఇందులో అలాంటిదేమీ లేదు. అసభ్యత లేదు.
ఎక్కడ చూడచ్చు
ఈటీవి విన్ లో ఈ సినిమా తెలుగులో ఉంది