'కాంత'లో దుల్కర్: హత్య కేసులో జైలుపాలైన సూపర్ స్టార్ కథ తెరపైకి!?

తమిళ చిత్ర సీమలో తొలి తరం హీరో కథ;

Update: 2025-07-29 12:42 GMT
‘కాంత’ సినిమాలో దుల్కర్

దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం 'కాంత' టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. క్లీన్ బ్లాక్ అండ్ వైట్ టోన్, అప్పటి మద్రాస్ నాటి సినీ వాతావరణం, స్క్రీన్‌పై పాత్రల నడక—all cinematic and haunting. "తెలుగులో మొట్టమొదటి హర్రర్ ఫిల్మ్?" అంటూ ఓ ఇంట్రిగ్యుయింగ్ డైలాగ్‌తో టీజర్ మొదలవుతూ, ప్రతి ఫ్రేమ్‌‍లోనూ 1950ల మద్రాస్ సినిమాల శైలిని గుర్తుచేస్తోంది.

దుల్కర్ సీరియస్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. అదే సమయంలో ఈ కాంత సినిమా ఎవరి కథ అనేది తెలిస్తే.. ఆన్‌స్క్రీన్ మ్యాజిక్‌కు అర్థం వస్తుంది.

బయోపిక్ వెనకున్న గొప్ప జీవితం
కాంత చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉన్న ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్నారని తెలుస్తోంది.ఈయనెవరో కాదు – మాయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్. ఎం.కే.టి. (MKT) గా ప్రసిద్ధిచెందిన ఈయన, తమిళ చిత్రపరిశ్రమలో తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు.
నటుడిగా, నేపథ్యగాయకుడిగా, సంగీత ప్రియుడిగా అనేక కళా రంగాల్లో తనదైన ముద్రవేసిన మల్టీటాలెంటెడ్ లెజెండ్. ఎనిమిది దశాబ్దాల క్రితం జరిగిన ఓ హత్యా ఘటన ఆ సూపర్ స్టార్ హీరో జీవితాన్ని కబళించి వీధిన పడేసింది. అసలు ఎవరీ త్యాగరాజ భాగవతార్? ఆయన జీవితంలో ఏం జరిగింది
తంజావూరు జిల్లాలోవున్న మైలదుత్తురై (మాయవరం)లో జన్మించిన త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్. త్యాగరాజు చిన్నవయస్సులోనే సంప్రదాయ కర్ణాటక సంగీతంలో అద్బుతమైన ప్రతిభను చూపించారు.
దాంతో ఆ వయస్సులోనే ఆయన్ని ‘భాగవతార్’ అనే బిరుదు వరించింది. కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు అయిన భాగవతార్ స్వయంగా వ్రాసుకుని కచేరీలు చేసేవారు. ఆయన కచేరీలకు చాలా డిమాండ్ ఉండేది.
మరో ప్రక్కన ‘వళ్లి తిరుమనం’, ‘నందనార్’,‘పావళక్కోడి’ వంటి పౌరాణిక నాటకాలు వేస్తూండేవారు. అవి ఎంత పెద్ద హిట్ అంటే శ్రీలంక, మలేసియా, మయన్మార్ దేశాలలలో కూడా ప్రదర్శితమయ్యాయి.


 


అలా చేస్తూండగా ‘పావళక్కోడి’ నాటకం చూసిన నిర్మాతలు ఆయన్నే హీరోగా పెట్టి ఆ నాటకాన్ని తెరకెక్కించారు. 1934లో విడుదలై బాక్సాఫీస్ హిట్ అయ్యి, త్యాగరాజు ని సినిమాల్లో బిజి చేయటం మొదలెట్టింది.
ఆ తర్వాత 1935 లో ‘నవీన సారంగధర’ , ‘సత్యశీలన్’ సినిమాలు చేసారు. అందులో ‘సత్యశీలన్’ భాగవతార్ హీరో సత్యశీలునిగా, ఆస్థాన గాయకుడిగా ద్విపాత్రాభినయం చేసారు.
అలా దక్షిణాదిలో మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన ఖ్యాతి త్యాగరాజ భాగవతార్ దే.1937లో ‘చింతామణి’ చిత్రంలో బిల్వమంగలుడు గా త్యాగరాజ భాగవతార్ నటించి మెప్పించారు.
తర్వాత ‘అంబికాపతి’ ..అది ఇంకా పెద్ద హిట్.1939లో ‘తిరునీలకంఠర్’ మంచి సక్సెస్ అయ్యింది. ఇక తిరిగేలేకపోయింది. అయితే ఆయన ఆచి,తూచి పాత్రలు ఎంచుకునేవారు. 1934 మరియు 1959 మధ్య భాగవతార్ కేవలం 14 చిత్రాలలో మాత్రమే నటించారు. అందులో 10 సూపర్ హిట్స్ అయ్యాయి.
1944లో భాగవతార్ చిత్రం ‘హరిదాసు’ మద్రాసులోని బ్రాడ్‌వే థియేటర్‌లో దీపావళి రోజు రిలీజైంది. మూడు దీపావళిలు పాటు ఆడుతూనే ఉంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉంది. ఆయన చేతిలో 12 సినిమాలు ఉన్నాయి.
అయితే అప్పుడే అనుకోనిది జరిగింది. భాగవతార్ ..సి.ఎన్. లక్ష్మీకాంతన్ అనే ఓ తమిళ సినీ జర్నలిస్టు హత్య కేసులో చిక్కుకున్నారు. ఓ టాబ్లాయిడ్ పత్రికను నడిపిన లక్ష్మీకాంతం, భాగవతార్ చిత్రాలపై తీవ్ర విమర్శలు చేసేవారు.
అతని కథనాలు సూపర్‌స్టార్ భాగవతార్‌కు కోపం తెప్పించాయి. అప్పటి బ్రిటీష్ గవర్నర్ ఆర్థర్ ఒస్వాల్డ్ జేమ్స్ హోప్ ను కలిసి లక్ష్మీకాంతన్ నడిపే సినీ పత్రిక లైసెన్స్ ను రద్దుచేయించారు. కానీ లక్ష్మీకాంతన్ ఆగలేదు.
వేరే పేరుతో ‘హిందూనేశన్’ అనే పత్రికను నడపడం మొదలెట్టి. ఈ సారి మరింత దారుణంగా భాగవతార్ పై రూమర్స్ రాయడం ప్రారంభించాడు. దాంతో భాగవతార్..ఈసారి లక్ష్మీకాంతన్ ని వదలడని చెప్పుకున్నారు.
ఈలోగా అనుకోని విధంగా నవంబర్ 8, 1944 న లక్ష్మీకాంతన్ పై దాడి జరిగింది. రెండు రోజులకు చనిపోయాడు. అది వచ్చి భాగవతార్ పై పడింది. నిజానికి లక్ష్మీకాంతన్ తక్కువ వాడేం కాదు. అంతకు ముందే అతనిపై రకరకాల కేసులు ఉన్నాయి.
ఓ ఫోర్జరీ కేసులోరాజమండ్రి, అండమాన్ జైల్లో ఏడేళ్లుకు పైగా శిక్ష అనుభవించి వచ్చినవాడే. అయితే ప్రభుత్వం అతని హత్య కి కారణం భాగవతార్ అని తేల్చి జైలు శిక్ష వేసింది.
ఆ తర్వాత ఆ కేసు నడిచి,నడిచి 30 నెలల (రెండున్నర సంవత్సరాలు) అండమాన్ నికోబార్ జైల్లో గడిపి బయిటకు వచ్చారు. ఆయన అప్పటిదాకా సంపాదించిన డబ్బు అంతా కోర్టు ఖర్చులకే సరిపోయింది.
మరో ప్రక్క భాగవతార్ జైలుకు వెళ్లడంతో దాదాపు 12 సైన్ చేసిన సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అంతేకాకుండా ఆయన జైలుకు వెళ్ళాక వచ్చిన నెగివిటితో ... విడుదలైన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. జైలు నుంచి బయిటకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది. తమిళ పరిశ్రమలో భాగవతార్ తన ఆధిపత్యాన్ని కోల్పోయాడు.
గతంలో భాగవతార్ ని పెట్టి సినిమా తీయడానికి నిర్మాతలు ఎవరు ముందుకు రాలేదు. తమిళ సినిమా కొత్త నటీనటులతో నిండిపోయింది. చివరకు అవకాశాల్లేక భాగవతార్ విధిలేక గాయకుడిగా కొనసాగుతూ, దేశమంతటా దేవాలయాలకు వెళ్లి కచేరీలు చేస్తూ శేష జీవితం గడిపారు. జైలు జీవితం, మానసిక ఒత్తిడి, అనారోగ్యంతో భాగవతార్ తన 49వ ఏట తుది శ్వాస విడిచారు. అలా తొలితరం సూపర్‌స్టార్ జీవితం ముగిసింది.
ఇదే కథను సినిమా గా చేస్తున్నారని తమిళ పరిశ్రమ అంటోంది. అందులో నిజమెంత అనేది ప్రక్కన పెడితే ఈ సందర్బంగా తొలితరం సూపర్ స్టార్ త్యాగరాజ భాగవతార్ ని తలుచుకోవటం మాత్రం ఆయనకు మనం ఇచ్చే నివాళే. అలాగే ఇదే కథతో వస్తే మాత్రం కాంత ఒక బయోపిక్ మాత్రమే కాదు, ఒక జీవితం ఎలా వెలిగిందో, ఎలా కూలిపోయిందో చూపించే ట్రాజెడీ థ్రిల్లర్ కూడా కావొచ్చు.
లైమ్‌లైట్‌లో ఉన్న ఒక కళాకారుడి మీద వచ్చిన ఆరోపణ, దానికి సమాజం, మీడియా, చట్టం ఎలా స్పందించాయన్నది ఈ కథలో కీలకం కానుంది. ఈ కోణం కూడా కాంతను సాధారణ బయోపిక్‌ల నుండి పూర్తిగా వేరు చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News