ప్యాన్ ఇండియా పేరు చెప్పి మన ఆర్టిస్ట్ లకు మట్టిగడ్డేనా?
ప్యాన్ ఇండియా కాన్సెప్ట్ పేరు చెప్పి ఇప్పుడు తెలుగు సినిమా దేశం మొత్తం రిలీజ్ అవుతుంది. బాషా భేధం, రీజనల్ ఫీలింగ్ ని దాటుకొని ముందుకు వెళ్తున్న సందర్భం ఇది.
ప్యాన్ ఇండియా కాన్సెప్ట్ పేరు చెప్పి ఇప్పుడు తెలుగు సినిమా దేశం మొత్తం రిలీజ్ అవుతుంది. బాషా భేధం, రీజనల్ ఫీలింగ్ ని దాటుకొని ముందుకు వెళ్తున్న సందర్భం ఇది. అయితే ఈ ప్యాన్ ఇండియా దండయాత్ర లో విజయం సాధించటానికి నార్త్ నుంచి నటీ నటులను తీసుకు వస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే బాబీ డయోల్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, జామీ లివర్ , ఇమ్రాన్ హష్మీ వంటి వారు తెలుగులో అడుగు పెట్టారు. వీరంతా సౌత్లో తెరకెక్కుతున్న అనేక ఆసక్తికరమైన ప్రాజెక్టులలో భాగమవుతున్నారు. వీరి మూలంగా నార్త్ లో మన సినిమాలకు మార్కెట్ అవుతోందో లేదో కానీ వాళ్ళకు మాత్రం చాలా రకాలుగా కలిసి వస్తుంది.
బాలీవుడ్ స్టార్స్ ... సౌత్ లో కేవలం పెద్ద స్టార్స్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. వీరు ఇక్కడ హీరోలుగా చెయ్యకపోయినా వారి రెగ్యులర్ గా తీసుకునే ఎమౌంట్ కు దాదాపు రెట్టింపు ఇక్కడ నిర్మాతలు పే చేస్తున్నారు. అలాగే అక్కడ వాళ్ళ డేట్స్ మూడు,నాలుగు నెలలు అవసరం అయితే ఇక్కడ ప్లానింగ్ ప్రకారం మన వాళ్లు నెల రోజులు లోపే నార్త్ నటుల సీన్స్ లాగేస్తున్నారు. అంతేకాదు సంజయ్ దత్ కానీ ఇమ్రాన్ హష్మీ కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ, బాబీ డయోల్ కానీ స్టార్స్ హోదా నుంచి తప్పుకుని ఫెడవుట్ అయిన దశలోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అంటే అక్కడ వారికి ప్రత్యేకించి సినిమాలు ఏమీ లేవు. గమనిస్తే వీళ్లు ఎవరికీ హిందీలో సినిమాలు కనపడవు.
ఇక మన సౌత్ ఫిల్మ్ మేకర్ ..బాలీవుడ్ స్టార్స్ ని హిందీ బెల్ట్ లోనూ, ఇంటర్నేషనల్ మార్కెట్ ని రీచ్ అవ్వడానికి ఎంచుకుంటున్నారు. అలాగే ఓటీటీ రైట్స, మ్యూజిక్ సేల్స్ , థియేటర్ సేల్స్ పెరుగుతాయని వీరిని తీసుకువస్తున్నారు. ఈ క్రాసోవర్ వర్క్ ల వలన ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుందని ట్రేడ్ అంటోంది. సౌత్ సినిమా కొత్త ఆడియన్స్ ని పలకరించడానికి , వెతుక్కోవటానికి ఈ బాలీవుడ్ మాజీ స్టార్స్ ని అడ్డం పెడుతున్నారు. అయితే వీళ్లంతా మన సౌత్ లో విలన్స్ గానే కనబడుతున్నారు.
ఇక అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ సైతం సౌత్ సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో సౌత్ లో జర్నీ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ‘కల్కి’ మూవీలో అశ్వద్ధామగా పవర్ ఫుల్ రోల్ లో నటించి మెప్పించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ మూవీలో లాయర్ గా నటించారు. అలాగే సంజయ్ దత్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తో విలన్ గా సౌత్ ఎంట్రీ ఇచ్చేశారు. లియోతో దాన్ని కొనసాగించారు.
సైఫ్ అలీఖాన్ ‘దేవర’ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘స్పిరిట్’ మూవీ కోసం అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఒకప్పటి హీరో బాబీ డియోల్ కూడా సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ మూవీలో బాబీ డియోల్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ‘యానిమల్’ హిందీ మూవీ అయినా కూడా సౌత్ లో సూపర్ సక్సెస్ అయ్యింది. ‘యానిమల్’ లో బాబీ డియోల్ క్యారెక్టర్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలు కమిటయ్యారు.
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. అలాగే నందమూరి నటసింహం బాలయ్య ‘NBK109’ మూవీలో కూడా బాబీ డియోల్ విలన్ గా నటించారు. కోలీవుడ్ లో సూర్య పాన్ వరల్డ్ మూవీ ‘కంగువా’ లో స్ట్రాంగ్ విలన్ గా కనిపించబోతున్నారు. అలాగే దళపతి విజయ్ 69 చిత్రంలో కూడా అతనే విలన్.
ఈ బాలీవుడ్ నటులు అంతా 6 నుంచి 10 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇలా బాలీవుడ్ వారు మన సౌత్ కు వచ్చి పేరు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. మరి సౌత్ నటుల పరిస్థితి ఏమిటి. వారిని నార్త్ సినిమా ఎందుకు ఎడాప్ట్ చేసుకోవడం లేదనే ప్రశ్న ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అక్కడ ప్యాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నప్పుడు అదీ మన సౌత్ డైరక్టర్స్ డైరక్షన్ చేస్తున్నప్పుడు కూడా మన సీనియర్ నటులను తీసుకు వెళ్లడం లేదు. ఇది ఇప్పుడు చర్చగా మారుతోంది.
అలాగే అక్కడ నటులను ఇక్కడ కీలకమైన పాత్రలో తీసుకుంటున్నారు. దాంతో ఇక్కడ మన సీనియర్ నటులు ఖాళీగా ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఒక వెలుగు వెలిగిన క్యారక్టర్ ఆర్టిస్ట్ లు సైతం తెరపై కనపడటం లేదు. అందుకు ఏకైక కారణం ప్యాన్ ఇండియా పేరు చెప్పి తీస్తున్న సినిమాల్లో నార్త్ వాళ్లకు చోటు ఇవ్వటమే. కేవలం తెలుగు మాత్రమే కాదు, కన్నడ,మలయాళ, తమిళ పరిశ్రమలోని సీనియర్ నటులు చాలా మంది ఖాళీ పడుతున్నారు. పెద్ద సినిమాల్లో తమకు వేషాలు లేకపోవడం వాళ్లను కలవరపరుస్తోంది. మనం నార్త్ స్టార్స్ ని తెచ్చుకున్నట్లుగానే మన వాళ్లను అక్కడ వాళ్లు కూడా ఎంకరేజ్ చేసి తమ సినిమాల్లో తీసుకుంటే ఏ సమస్యా ఉండదు.