డార్క్ కామెడీ: ‘బాపు’ఓటిటి రివ్యూ

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కథేమిటి, బాపు అనే టైటిల్ ఎందుకు పెట్టారు. చూడదగ్గ సినిమానేనా?;

Update: 2025-03-08 08:31 GMT

పెద్ద స్టార్స్ లేకుండా బ్రహ్మాజీ .. ఆమని ప్రధానమైన పాత్రలను వచ్చిన చిన్న సినిమా 'బాపు' . తెలంగాణా గ్రామీణ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్ లలో పెద్దగా నడవని ఈ సినిమా వెంటనే ఓటిటిల్లోకి వచ్చేసింది. రాజు - భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి 'దయ' దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కథేమిటి, బాపు అనే టైటిల్ ఎందుకు పెట్టారు. చూడదగ్గ సినిమానేనా?

స్టోరీ లైన్:

తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం. కరువుతో నడుస్తున్న కుటుంబం. మల్లన్న (బ్రహ్మాజీ) అప్పు చేసి, తన ఎకరం భూమిలో పండించిన పత్తి నాశనం అయ్యిపోతుంది. అప్పులువాళ్లు మీదపడతారు. ఏం చెయ్యాలో అర్దం కాదు. అప్పులకే తన ఎకరం పొలం పోతుందనే బెంగ పట్టుకుంటుంది. వేరే దారిలేక ఆత్మహత్య చేసుకుందామనుకుంటాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకుంటే పెద్దగా కలిసొచ్చేది లేదని ఆపుతుంది. అదే సమయంలో ఓ ఐడియా చెప్తుంది. ఇంటి పెద్ద మల్లన్న తండ్రైన రాజయ్య (బలగం సుధాకర్‌రెడ్డి)ను చంపేసి, అది సహజ మరణంగా చూపగలిగితే గవర్నమెంట్ ఇచ్చే ఐదు లక్షలు వస్తాయి..అప్పులు తీర్చుకోవచ్చని భార్య సరోజ (ఆమని) సలహా ఇస్తుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. తండ్రిని చంపటానికి వాళ్లు ఏం ప్లాన్స్ వేసారు, చివరకు ఏమైంది అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఇదొక డార్క్ కామెడీ చిత్రం .మన తెలుగులో డార్క్ కామెడీలు అరుదే. ఆ జానర్ ని టచ్ చేయటానికి చాలా మంది ఆసక్తి చూపించరు. కానీ ఈ దర్శకుడు ధైర్యం చేసాడు. అయితే డార్క్ హ్యూమర్ పాళ్లు కాస్తంత తక్కువై ఎమోషన్ పాలు ఎక్కువైంది. దానికి తోడు స్టార్ క్యాస్టింగ్ కూడా పెద్దగా కలిసి రాలేదు. రైతులు ఆత్మహత్యలు చుట్టూ తిరిగే కథ...డబ్బు తో ముడిపెట్టి, అది కుటుంబ బంధాలను సైతం ఎలా విఛ్చిన్నం చేయగలుగుతుంది. సొంతవాళ్లనే బలిపెట్టడానికి కూడా వెను తీయని పరిస్దితిలకు ఎలా ఉసిగొల్పుతుంది అని దర్శకుడు చెప్పాలనే తాపత్రయం కనపడుతుంది. అప్పులు తీర్చటం కోసం తండ్రినే చంపాలనే ఆలోచన ఈ కథకు ప్రాణం. భార్య చెప్పిన సలహాతో కథలో మల్లన్న ఈ పని చేయటానికి ముందుకు వెళ్తాడు.

అయితే భార్య చెప్పింది అని కాకుండా తనకు వచ్చిన ఆలోచనగా చేస్తే బాగుండేది. ఎందుకంటే ఎంత తన భార్య చెప్పినా తన తండ్రిని చంపటానికి తనంతట తానుగా ముందుకు రారు కదా, తమకై బుద్ది పుడితే తప్పించి అనిపిస్తుంది. అదే సినిమా నేరేషన్ కు మైనస్ గా నిలిచింది. మన ఆలోచనలు అక్కడే ఆగుతాయి. అయితే మల్లన్న దంపతులు రాజయ్యను చంపాలని నిర్ణయించుకున్న దగ్గర నుంచి కథ మలుపు తిరిగుతుంది. అందుకోసం వాళ్లు ఏం ప్రయత్నాలు చేస్తారు? అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి?అనేవి ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. క్లైమాక్సే సింపుల్ గా తేల్చేసాడు. ఏదైమైనా తండ్రి చావు కోసం మల్లన్న , అతని భార్య ఎదురుచూసే సీన్స్ మాత్రం బాగానే నవ్వించాయి. ఏదైమైనా కొత్త ఎటెమ్ట్. ఎంకరేజ్ చేయదగ్గ కంటెంటే. .

టెక్నికల్ గా

చిన్న సినిమా..అందుకు తగ్గట్లే టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. అయితే సినిమాలో సహజత్వం చూపటానికి దర్శకుడు,కెమెరామెన్, సంగీత దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు మెప్పిస్తాయి. దర్శకుడు తను చెప్పాలనుకున్న పాయింట్ ని చాలా వరకూ ఇంట్రస్టింగ్ గానే చెప్పారు. అయితే మధ్యలో విగ్రహం దొరకటం వంటి సబ్ ప్లాట్లు కాస్త ఇబ్బంది పెట్టాయి. ఇక నటీనటుల్లో బ్రహ్మాజీ .. ఆమని .. సుధాకర్ రెడ్డి .. రచ్చ రవి అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ధ్రువ‌న్ సంగీతం, వాసు పెండెం ఫొటోగ్రఫీ స్పెషల్ మెన్షన్ గా చెప్పుకోవాలి. అనిల్ ఆలయం ఎడిటింగ్ నడిచిపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. స్లో నేరేషన్ కాస్తంత ఇబ్బంది పెట్టే అంశం. అది చూసుకోవాల్సింది.

చూడచ్చా

తెలంగాణా పల్లె వాసనలుతో ఉన్న ఈ సినిమా ఓ సారి చూడదగ్గదే. ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకపోతే బాగానే ఉందనిపిస్తుంది. ఓ లుక్కేయచ్చు

ఎక్కడుంది

'జియో హాట్ స్టార్' లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags:    

Similar News