బ్రహ్మీ 'బ్రహ్మా ఆనందం' రివ్యూ
అసలు ఈ చిత్రం కథేంటి, ఎలా ఉంది వంటి విషయాలు చూద్దాం.;
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో పెడితే సినిమా ఆడతాయా అంటే కంటెంట్ స్ట్రాంగ్ గా అది కామెడీ కాస్త ఎక్కువగా ఉంటే బయట పడిపోవచ్చు అనే అభయహస్తం భాక్సాఫీస్ ఇస్తుంది. అదే ధైర్యంతోనే చాలా కాలం తర్వాత బ్రహ్మానందం కీలక పాత్రలో 'బ్రహ్మా ఆనందం' అనే సినిమా తీసి వదిలారు. ప్రభాస్, చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్స్ ఈ చిన్న చిత్రాన్ని ప్రమోట్ చేసారు. దాంతో ఏదో మంచి సినిమాతోనే బ్రహ్మానందం వస్తున్నాడు, దానికి తోడు ఆయన కొడుకు కూడా కీలక పాత్ర కదా అని ప్రేక్షకులు ఉత్సాహపడ్డారు. ఆ ఊపుని, ఉత్సాహాన్ని ఈ సినిమా కొనసాగించిందా...అసలు ఈ చిత్రం కథేంటి, ఎలా ఉంది వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
థియేటర్ ఆర్టిస్ట్ బ్రహ్మ (రాజా గౌతమ్) కి పెద్ద సినిమా నటుడు కావాలనేది జీవితాశయం. అయితే అతనికి ఆ అవకాశం ఇచ్చే వాళ్ళు ఎవరూ కనపడరు. ఈ క్రమంలో దిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాసం వస్తుంది. అయితే అందుకు రూ.6 లక్షలు కట్టాలి. అయితే డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు ఏమీ వర్క్ అవుట్ కావు. ఆ సమయంలో వృద్ధాశ్రమంలో ఉండే తన తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) సీన్ లోకి వస్తాడు.
కోదాడ దగ్గర ఆరెకరాల భూమి తన పేరు మీద ఉందని, తాను చెప్పినట్లు చేస్తే అది తనకు ఇస్తానని చెప్పి ఊరుకి తీసుకెళ్తాడు ఆనంద రామ్మూర్తి. అయితే ఆ డబ్బు ఇవ్వడం కోసం కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆనంద రామ్మూర్తి వృద్ధాశ్రమంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? జ్యోతి (తాళ్లూరి రామేశ్వరి) పాత్రకు ఈ కథలో ప్రాధాన్యత ఏమిటి? చివరికి బ్రహ్మ కోరిక తీరిందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి ఇదేమీ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. పిల్ల జమీందార్, నిన్న మొన్నటి నరుడు బ్రతుకు నటన సినిమాలు కూడా ఇదే పంధాలో వెళ్తాయి. డబ్బు కోసం ఆశపడి చేసే జర్నీలో లైఫ్ లెస్సన్స్ నేర్చుకోవటం ఈ తరహా కథల ఫార్ములా. ఓ రకంగా ఇది అరిగిపోయిన ఫార్ములానే. అదే పాయింట్ ని బలంగా నమ్మి సినిమా చేశాడంటే నిర్మాత, దర్శకుడు ధైర్యమే. అయినా పాత పాయింటే చెప్పినా, దాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దితే పాస్ అయిపోవొచ్చు. రొటీన్ అనే ముద్ర గురించి కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమాలో అది మిస్సయ్యింది. పాయింట్ పరంగా ఎంత నీరసంగా గా ఉందో, రైటింగ్ పరంగానూ ఈ సినిమా అంతే బలహీనంగా కనిపించింది.
తెరపై బ్రహ్మానందం ఉన్నాడు కాబట్టి, తన కామెడీ టైమింగ్ తో కొద్దో గొప్పో.. ఫన్ పుట్టించగలిగాడని భావిస్తాం. కానీ అదే జరగలేదు. మొదటి సగంలో అక్కడక్కడైనా ఈ కథని భరించొచ్చు. సెకండాఫ్ కు వచ్చేసరికి బ్రహ్మి కూడా ఏమీ చేయలేకపోయాడు.డైరక్టర్ కు ఈ ఎమోషనల్ రైడ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు.అంతర్లీనంగా ఓ సందేశం ఇస్తున్నాను,క్లాస్ ఫిల్మ్ తీస్తున్నా అనుకుని దర్శకుడు సినిమాలో ఏమి లేకుండా చేసేసాడు.
టెక్నికల్ గా..
సినిమా ప్రొడక్షన్ వైజ్ క్వాలిటీ గా బాగుంది. పాటలు వింటున్నప్పుడు ఓకే అనిపిస్తాయి. లెంగ్త్ పరంగా సినిమా చిన్నదే. కామెడీ సినిమా చూడబోతున్నాం అని ప్రేక్షకులు ఫిక్సయ్యాక… వాళ్లని నవ్వించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ స్థాయిలో నవ్వించే సత్తా ఈ స్క్రిప్టులో లేకపోయింది. దాంతో 'బ్రహ్మా ఆనందం' కాస్త బోరింగ్ గా తయారైంది.
చూడచ్చా
థియేటర్ కు వెంటనే వెళ్లి మరీ చూడదగ్గ సినిమా కాదు. ఓటీటీ లో ట్రై చేయచ్చు.