విక్రమ్, నువ్వింకా డైరెక్టర్ బాలా బ్లాక్ లిస్ట్ లోనే ఉన్నావు: అందుకు ఈ మాటలే సాక్ష్యం

విక్ర‌మ్ కు నటుడుగా పేరు పెట్టేవాళ్లు ఎవరూ లేరు. కానీ చిత్రంగా ఆయన సరైన సక్సెస్ ని ఆస్వాదించి ద‌శాబ్దం కాలంపైనే అయింది.

Update: 2024-12-31 06:20 GMT

విక్ర‌మ్ కు నటుడుగా పేరు పెట్టేవాళ్లు ఎవరూ లేరు. కానీ చిత్రంగా ఆయన సరైన సక్సెస్ ని ఆస్వాదించి ద‌శాబ్దం కాలంపైనే అయింది. అప‌రిచితుడు త‌ర్వాత ఆయ‌న న‌టించిన చిత్ర‌మేది సూపర్ హిట్ అనిపించుకోలేదు. రీసెంట్ గా వచ్చిన విక్రమ్ చిత్రం తంగలాన్ సైతం నిరాశ‌నే మిగిల్చింది. త‌న ప‌దేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతుంద‌నుకున్న ఈ సినిమా అభిమానులకు బాగుందనిపించినా,సామాన్య ప్రేక్షకుడి తిర‌స్కారానికి గురై ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం, స్క్రీన్ ప్లేలో చోటుచేసుకున్న త‌ప్పులు వెర‌సి ఈ సినిమాని ప‌రాజ‌యంగా నిలబెట్టాయి. అయితే ఇలాంటి సమయంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ దగ్గరకు ఏ హీరో అయినా వెళ్తారు. కానీ హీరోగా విక్రమ్ ఆ పని చేయలేకపోయారు. అందుకు కారణం బాలాకు, విక్రమ్ కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అని చెప్పాలి.

వరస వైఫ‌ల్యాల కార‌ణంగా విక్ర‌మ్‌ ఖచ్చితంగా బాలాతో సినిమా చేయాలని నిర్మాతలు ప్రయత్నించినా ఫలించలేదు. ఓ హిట్‌తో తన ఖాతాలో వేసుకుని త‌నపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధాన‌మివ్వాలనేది విక్రమ్ ఆలోచన. విక్ర‌మ్ అందుకోసం త‌న సినీ జీవితాన్ని మ‌లుపుతిప్పిన ద‌ర్శకుడు బాలా దగ్గరకు వెళ్లలేని సిట్యువేషన్. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సేతు, పితామ‌గ‌న్ చిత్రాలు చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్నాయి. ఈ సినిమాల‌తోనే విక్ర‌మ్ స్టార్ హీరోగా ఎద‌గ‌టం విశేషం. బాలా ద‌ర్శ‌క‌త్వంలో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం వస్తే పూర్వ వైభ‌వం ఖచ్చితంగా వస్తుందని విక్రమ్ అభిమానుల,నిర్మాతల ఆలోచన. అయితే అందుకు ఆస్కారమే లేదని రీసెంట్ గా బాలా అన్న మాటలు ప్రూవ్ చేస్తున్నాయి.

అదేమిటంటే.. ద‌ర్శ‌కుడు బాలా (BALA) దర్శకత్వం వ‌హించ‌గా అరుణ్‌ విజయ్ (Arun Vijay) హీరోగా నటించిన చిత్రం ‘వణంగాన్‌’ (Vanangaan)రిలీజ్ కు రెడీ అయ్యింది.. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. జనవరి 10 వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ కోసం డైరెక్టర్ బాలా...వరస పెట్టి యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు వరస పెట్టి ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా బాలా ని యాంకర్ ...విక్రమ్ నటన గురించి చెప్పండంటూ ఓ ప్రశ్న వేయడం జరిగింది. దానికి బాలా సమాధానం ఇస్తూ... మీరు విక్రమ్ నటన గురించి అడిగే ముందు నా వంక చూడండి.,నన్ను చూసి అతని నటన గురించి ఏమి చెప్పాలో అని నేను ఎలా ఆలోచిస్తున్నానో చూడండి; అదే నా సమాధానం అన్నారు.

ఈ స్టేట్మెంట్ కోలివుడ్ ఇండస్ట్రీ ని షాక్ కు గురి చేసింది. విక్రమ్ పై ఆయన నర్మగర్భంగా చేసిన కామెంట్స్ వాళ్లిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ ని గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. వర్మ సినిమా టైమ్ లో విక్రమ్ కు, బాల కు వచ్చిన విభేధాలే ఇప్పటికీ ఆయన గుర్తు పెట్టుకుని ఇలా కామెంట్ చేశారంటున్నారు.

ఆ వివాదం ఏమిటంటే.. అమెరికాలో చదువు పూర్తి చేసిన తన కొడుకు ధృవ్‌ను విక్రమ్‌ హీరోగా పరిచయం చేయాలని మంచి కథ కోసం అన్వేషణ సాగిస్తున్న ఆయకు తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి దృష్టిలో పడింది. ఇదే తన వారసుడికి సరైన ఎంట్రీ అవుతుందని భావించారు. అంతే అర్జున్‌రెడ్డి ధృవ్‌ హీరోగా తమిళంలో రీమేక్‌కు రెడీ అయిపోయింది. అయితే దర్శకుడెవరన్న ప్రశ్నకు విక్రమ్‌కు సేతు చిత్రంలో నటుడిగా బ్రేక్‌ ఇచ్చిన సంచలన దర్శకుడు బాలా అని అనిపించింది. దాంతో బాలాని ఒప్పించి అర్జున్‌రెడ్డిని తమిళంలో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యి మొదలు పెట్టి ఫినిష్ చేశారు.

ఈ సినిమాను వర్మ పేరుతో డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ పడింది. ఈ సినిమా అవుట్ పుట్ తమకి నచ్చలేదని, అందువలన దానిని పక్కన పెట్టేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ధృవ్ హీరోగా వేరే దర్శకుడితో ఈ సినిమాను నిర్మించనున్నట్టు చెప్పారు. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి కారకుడు విక్రమ్ అనే మాట కోలీవుడ్లో బలంగా వినిపించింది.

వర్మ సినిమా అవుట్ పుట్ తన కి ఎంత మాత్రం నచ్చలేదని విక్రమ్ ..స్వయంగా బాలాకు చెప్పారట. ఈ సినిమా విడుదలైతే .. తన కొడుకు కెరియర్ ఇబ్బందుల్లో పడుతుందని భావించి ఆపేయమన్నాడట. ఎంత ఖర్చైనా ఫర్వాలేదనే సంకేతాలు ఇవ్వడం వల్లనే నిర్మాతల నుంచి ఈ ప్రకటన వచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఆ తర్వాత బాలా తీసిన ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా మరో దర్శకుడితో తెరకెక్కించారు. వర్మ సినిమా పేరును ఆదిత్య వర్మగా మార్చి మళ్లీ రూపొందించారు. అర్జున్‌ రెడ్డి ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. ఆ తర్వాత బాలా కెరీర్ సమస్యల్లో పడింది. మళ్లీ ఆయన కోలుకుని సినిమా చేయడానికి ఇంత కాలం పట్టింది.

సేతు, నందా, పితామగన్, పరదేశి, తారై తప్పట్టై ఇలా వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు బాలా 18 ఏళ్ల సినీచరిత్రలో తొలిసారిగా రీమేక్‌ చిత్రానికి దర్శకత్వం వహించాలని విక్రమ్ కోసం అనుకున్నా అది బెడిసి కొట్టింది. అదే వీరిద్దరి మధ్య విభేదాలకు దారి తీసింది.

Tags:    

Similar News