'కోర్టు' సినిమాలపై కోర్టుకి.. నిజంగానే ఇబ్బంది పెట్టే కంటెంట్ ఉందా?
సినిమాల్లో లాయర్స్, జడ్జీలను కూడా కామెడీ చేయటం ఈ మధ్యన చూస్తున్నాం. ఇదే విషయంపై ఇప్పుడు ఇంతకాలానికి నిరసన ప్రారంభమైంది.
న్యాయవాదిని తన్నడం, కర్రతో వెంబడించడం, జడ్జి గుట్కా తినే సీన్స్, డబ్బు లావాదేవీలు ఇవన్నీ సినిమాలో చూపెడుతున్నారు. న్యాయ వ్యవస్దను కించపరుస్తున్నారు. వారు సినిమాల్లో చూపించే సీన్స్ కోర్టు, న్యాయవ్యవస్థ, న్యాయవాదులు, న్యాయమూర్తుల పరువు ప్రతిష్టలకు ఏమాత్రం తగ్గట్టుగా లేవని వివరించారు. సినిమా షూటింగు సమయంలో ఈ విషయాన్ని పట్టించుకోవాలని, మేకర్స్‌కి నోటీసులివ్వాలని, వారిపై నిషేధం విధించాలని ఫిర్యాదు ద్వారా కోరతానని అజ్మీర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంప్లైంట్ చేసారు. ఇంతకీ ఆయన చెప్పుతున్న సినిమా ఏమిటీ అంటే 'Jolly LLB' సీరిస్ గురించి.
బాలీవుడ్‌లో వచ్చి సెన్సేషన్ హిట్స్ గా నిలిచిన సినిమాలు జాలీ ఎల్.ఎల్.బి., జాలీ ఎల్.ఎల్.బి –2 . ఈ సినిమాలు ఎక్కువ భాగం కోర్టులోనే జరుగుతాయి. ఏదో ఒక సీన్ కు మాత్రమే కాకుండా సినిమా మొత్తం లాయర్స్, కోర్టు చుట్టూ తిరిగే కథలు ఇవి. ఈ సినిమాల్లో మొదటిది 2013లో, రెండోదీ 2017లో విడుదలయ్యాయి. ఇప్పుడు మూడో సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. జాలీ ఎల్‌ఎల్‌బిని 10 కోట్లు పెట్టి తీశారు. 37 కోట్లు వచ్చింది. జాలీ ఎల్‌ఎల్‌బి–2 ని 30 కోట్లు పెట్టి తీశారు. 197 కోట్లు వచ్చింది. దాంతో మూడో సీక్వీల్ ని మరింత ఉత్సాహంగా తీస్తున్నారు.
ఈ మూడు సినిమాల డైరెక్టరూ ఒకరే. ఆయనే సుభాష్ కపూర్. మూడు చిత్రాల కథ కూడా ఆయన రాసుకున్నదే. ఫస్ట్ జాలీలో అర్షద్ వార్సీ ఢిల్లీలో ఉండే లాయర్. సెకండ్ జాలీలో అక్షయ్‌కుమార్ లక్నోలో ఉండే లాయర్. ఇద్దరి పేర్లూ సినిమాలో ‘జాలీ’నే. ఇప్పుడు మూడో జాలీ కథ ఏ ప్రాంతంలో జరుగుతుందో తెలియాల్సి ఉంది. సరే ఇది ప్రక్కన పెడితే..ఇప్పుడు ఈ మూడో సినిమా రిలీజ్ దాకా కూడా వెళ్లకుండానే కోర్టుకు ఎక్కింది.
“'జాలీ LLB 3' చిత్ర నిర్మాతలు, దర్శకులు మరియు నటులు దేశ రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థ యొక్క గౌరవాన్ని మరియు ప్రతిష్టను ఏమాత్రం గౌరవించనట్లు కనిపిస్తోంది. జాలీ ఎల్‌ఎల్‌బి 3 షూటింగ్ అజ్మీర్‌లోని డిఆర్‌ఎం కార్యాలయంతో సహా చుట్టుపక్కల గ్రామాలు మరియు ప్రాంతాలలో జరుగుతోంది, ఇది చాలా రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా, చిత్ర నటీనటులు న్యాయమూర్తులతో సహా న్యాయవ్యవస్థ యొక్క ఇమేజ్, ప్రతిష్ట మరియు గౌరవం గురించి అస్సలు సీరియస్‌గా ఉన్నట్లు అనిపించదు, ”అని అజ్మీర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నారు. ఆయన చెప్పిన దాంట్లో నిజమెంత ఉంది? ఓ సారి ఈ ఇద్దరి జూలీలని పలకరిస్తే...
జూలీ సిరీస్‌లో మొదటి పార్ట్ లో అర్షద్ వార్సీ చెట్టుకింది లాయిర్. ఓ హిట్ అండ్ రన్ కారు కేసులో ఆరుగుని చంపిన వ్యక్తికి అనుకూలంగా తన సీనియర్ వాదిస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా వాదనకు దిగుతాడు. అక్కడ నుంచి అది పైకి కనిపించే కేసు మాత్రమే కాదని, ఎన్నో కుట్రలు ,కుతంత్రాలు ఆ కేసులో ఉన్నాయని తెలుసుకుంటాడు. తనకు ఎన్ని బెదిరింపులు, ప్రలోభాలు వచ్చినా తట్టుకుని నిలబడతాడు. చివరకు కారు డ్రైవర్‌ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కేసు గెలుస్తాడు అర్షద్. ఇలా కట్టె,కొట్టే తెచ్చే అన్నట్లు చెప్తే ఈ కథ కిక్ ఉండదు. ఈ సినిమాని తెలుగులో సప్తగిరితో సప్తగిరిLLBఅని కూడా తీసారు. ఈ సినిమాలో వచ్చే కోర్టు వాదోపవాదాల కోసమే జనం తెగ చూసారు. చట్టానికి కళ్లు లేకపోవచ్చు. కానీ జడ్జికి ఉంటాయి డైలాగ్ తో సినిమాని గెలిచేసారు.
ఇక జాలీ ఎల్‌ఎల్‌బి–2 విషయానికి వస్తే ...ఈ సారి అర్షద్ ప్లేస్ లో అక్షయ్ కుమార్ వచ్చాడు. అక్షయ్ కుమార్ ఓ పెద్ద పేరున్న అడ్వొకేట్ దగ్గర అసెస్టెంట్ గా పనిచేస్తూంటాడు. అతనికి డబ్బులు బాగా అవసరం. ఎందుకంటే తననో చాంబరు లేకపోతే ఎవరూ పట్టించుకోరు. అది కట్టుకోడానికి డబ్బుల కావాలి. దాంతో తను అసిస్టెంటు పనిచేసే ఆ పెద్ద అడ్వొకేట్ వాదిస్తాడని చెప్పి ఆయనకు తెలియకుండా ఒక మహిళ కేసును తీసుకుంటాడు.
ఇంతకీ కేసు ఏమిటంటే...ఆమె భర్తను టెర్రరిస్టు అనే పేరుతో ఒక పోలీసు అధికారి ఫేక్ ఎన్‌కౌంటర్‌లో చంపేసి ఉంటాడు. ఆ కేసు వాదించటానికి ఆమె దగ్గర్నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకుంటాడు. అక్షయ్ మోసం చేశాడని తెలుసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో బుద్ది వచ్చిన అక్షయ్... లక్నో నుంచి కశ్మీర్ వరకు నానా పాట్లు పడి, అసలు టెర్రరిస్టును పట్టి తెచ్చి, కోర్టులో హాజరుపరుస్తాడు. లంచం తీసుకుని అతడిని వదిలిపెట్టిన పోలీసు అధికారికి శిక్ష వేయిస్తాడు. ఈ సమయంలో అక్షయ్ వాదన పదే పదే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించింది.
ఈ రెండు సినిమాల్లో స్ట్రగుల్ లో ఉన్న చిన్న లాయర్స్ ఎలా ఉంటారో అలా చూపించే ప్రయత్న చేసారు. ఈ క్రమంలో వాళ్లను సహజత్వం కోసం కాస్తంత లిబర్టీతో చేసిన సీన్స్ లాయిర్స్ గౌరవం తగ్గించినట్లు ఉండి ఉండవచ్చు. అయితే అలాంటి లాయిర్స్ బయిట మనకు కనపడరా అంటే చాలా మంది కనపడతారు. అయితే కేసు వేసినా ఆయన కూడా లాయిరే కాబట్టి ఖచ్చితంగా తన వృత్తికి గౌరవం తగ్గినట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా మూడో పార్ట్ షూటింగ్ ఆయన చూసి మరీ కేసు వేసారంటున్నారు. అయితే షూటింగ్ లో ఉన్న సీన్స్ తెరపైకు ఎలా వస్తాయనేది అదీ ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగులు, కథలో భాగంగా వచ్చే సీన్స్ ..వంటి అనేక అంశాలు ఆధారపడి ఉంటాయనటంలో సందేహం లేదు.
అయినా సినిమాల్లో టీచర్స్ ని , లెక్చరర్స్ ని, అలాగే అనేక కుల వృత్తుల వాళ్లను కామెడీ చేయటం మనకు కొత్తేమీ కాదు. ఇప్పుడు తగ్గింది కానీ ఆ మధ్యకాలంలో లెక్చరర్ ని కామెడీ కోసం వాడని సినిమా ఉండదు అన్నట్లు వరస సినిమాలు వచ్చాయి. జనాలు సైతం ఎంజాయ్ చేసారు. అక్కడక్కడా అప్పుడప్పుడూ గురువుని ఇలా కామెడీ చేయటం ఏమిటి నిరసనలు ఎదురయ్యాయి. అవి ఎక్కువలేవు కాబట్టి వాటికి అడ్డు అదుపు లేకుండా కొంతకాలం ఆ టైప్ కామెడీ రాజ్యం ఏలింది. అలాగే లాయర్స్, జడ్జీలను కూడా కామెడీ చేయటం ఈ మధ్యన చూస్తున్నాం. ఇదే విషయంపై ఇప్పుడు ఇంతకాలానికి నిరసన ప్రారంభమైంది. ఇది ఒకందుకు మంచిదే. కాస్త అన్నీ ఆలోచించి, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా సినిమా తీసే ప్రయత్నం చేస్తారు దర్శక, నిర్మాతలు.