కంగువా'సినిమాతో కార్తీ స్క్రీన్ కాన్వాస్ పెద్దదయిందా?

సినిమాలో కామియో రోల్స్ వల్ల కమర్షియల్ ఎట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. అది సినిమాకు ఒక పాజిటివ్ సైన్ లా ఉంటుంది.కార్తీ కూడా ఈ సినిమాలో అంతేనా?

Update: 2024-11-14 12:05 GMT

-శృంగవరపు రచన


తమిళ హీరోలకు తెలుగులో క్రేజ్ తెలుగు స్టార్స్ తో సమానంగా ఉందన్న విషయం అనేక తమిళ సినిమాలకు ఇక్కడ ఏర్పడిన క్రేజ్ తో స్పష్టమైంది. రజనీకాంత్, ధనుష్, విజయ్, సూర్య లాంటి స్టార్స్ ఎక్కువ తమ స్టార్ డం ద్వారానే కనక్ట్ అయ్యారు. వీరికి భిన్నంగా కార్తీ తెలుగు సినిమాల్లో తెలుగు వాడేనన్నంతగా ప్రేక్షకులకు కనక్ట్ అయ్యేలా నటించి తనను తాను తెలుగు నాట కూడా బలంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు.అందులోనూ ఎక్కువగా ఎమోషనల్ పాత్రల్లో నటించిన కార్తీ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా సహజంగా ఉండటంతో కార్తీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ కూడా ఏర్పడిపోయింది.

సినిమా సక్సెస్ కి కమర్షియల్ ఫార్ములాలు ఉండొచ్చు. అందులో ఇమిడిపోతూ సక్సెస్ అయ్యే నటులు కూడా ఉండొచ్చు. వారు ఎన్నో రికార్డులు నెలకొల్పవచ్చు. కానీ హ్యూమన్ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథల్లో నటిస్తూ ఎమోషనల్ గా నటించే అరుదైన నటుల్లో ఒకరు కార్తీ. ఈ రకమైన నటన ఎప్పటికీ గుర్తుండిపోవడమే కాదు, ఆ నటుడితో ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా ఏర్పడేలా చేస్తుంది. ఆ ఎమోషనల్ బాండింగ్ కార్తీకి తెలుగునాట ఉన్న బలం. మనసులో ఉన్నది దాచుకోకుండా బయట ప్రెస్ మీట్స్ లో, ప్రమోషన్ ఈవెంట్స్ లో మాట్లాడే ఫ్రాంక్ నేచర్ కూడా కార్తీ మీద ఉన్న అభిమానానికి ఒక కారణం.

మొదట్లో చేసిన సినిమాల్లో కొంత ఓకే తరహా నటన కనిపించినా ఈ మధ్య ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు కార్తీ. అలాగే మధ్యలో కొంత కమర్షియల్ ఫార్ములా మోడ్ లోకి వెళ్ళినా, అవి బెడిసి కొట్టినప్పుడు, సినిమాలు చేసే విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు కూడా. 'జపాన్', 'సర్దార్' సినిమాల తర్వాత కార్తీ 'సత్యం సుందరం' సినిమా ఎంపికే దీనికి నిదర్శనం. 'సత్యం సుందరం'లో కార్తీతో పాటు అరవిందస్వామి కూడా నటించినా, సుందరంగా ఉన్న కార్తీ నుండి ప్రేక్షకులు కళ్ళు తిప్పుకోలేకపోయారు. కార్తీ ఏ స్టార్ తో కాంబినేషన్ లో నటించినా,కల్మషం లేని స్వచ్ఛమైన భావోద్వేగాలను ప్రతిఫలించడంలో ఎక్కువ మార్కులు పడేలా మెప్పిస్తాడు.

ఇక ఇప్పటి సందర్భానికి వస్తే తమిళ సినిమా అయినా తెలుగులో కూడా కంగువా సినిమాకు భారీ ప్రమోషన్లు చేశారు. సినిమా విషయానికి వస్తే కొంత అంచనాలు అందుకోని సినిమాగానే మిగిలిపోయింది కంగువ. కానీ కంగువా చివర్లో కార్తీ మెరుపులా కనిపించారు. కార్తీ స్వాగ్, బాడీ లాంగ్వేజ్,డైలాగ్ డెలివరీ, కళ్ళ ఎక్స్ ప్రెషన్స్ తో పది నిమిషాల్లోనే మ్యాజిక్ చేశాడు. సినిమా మొత్తం ఒక లెవల్ అయితే, కార్తీ ఎంట్రీ నుండి ఇంకో లెవల్.

'యుగానికి ఒక్కడు'లో ఒక రకమైన అమాయకత్వం, కొంత మొరటుతనంతో కనబడిన కార్తీ....

'ఊపిరి'లో ఎమోషనల్ గా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసిన కార్తీ...

'ఖాకీ 'లో సీరియస్ గా మెప్పించిన కార్తీ...

'సత్యం సుందరం'లో కన్నీళ్ళు పెట్టించిన కార్తీ....

ఇవన్నీ ఒక ఎత్తయితే, వీటికి భిన్నంగా క్రూరత్వం, పైశాచికత్వం వంటి అంశాలతో ఇంకో షేడ్ లో 'కంగువ'లో కనిపించిన కార్తీ వేరు... పూర్తిగా వేరు! ఇప్పటివరకు 'పాజిటివ్ ఎమోషనల్ స్కేప్ 'కే పరిమితమైన కార్తీ కంగువ తో 'నెగెటివ్ ఎమోషనల్ స్కేప్ 'కి షిఫ్ట్ అయ్యాడు. ఈ ఎమోషనల్ షిఫ్ట్ తో కార్తీ వైవిధ్యత లో ఇంకో అడుగు ముందుకు వేశాడు.అందుకే కంగువా లో కార్తీది కామియో రోల్ అయినా అది ప్రత్యేకమైనదే!

ఇప్పుడే తెలుగులో కూడా సత్తా చాటుతున్న కార్తీ తన స్క్రీన్ కాన్వాస్ ను ఒక్కో సినిమాతో విస్తరించుకుంటూ ఉన్నాడు. సమీప భవిష్యత్తులో ఒకవేళ కార్తీ పీరియాడిక్ స్టోరీ లో చేస్తే తప్పక పాన్ ఇండియా రేసులో నిలబడే సత్తా ఉందన్న సంకేతమే ఈ కంగువా లో 'కార్తీ'పాత్ర.

'కంగువ' కథ, సినిమా ఎలా ఉంది అనేవి ఇక్కడ ముఖ్య అంశాలు కాదు. తమిళనటులైన సూర్య, కార్తీ తెలుగులోనూ ఓ ఫ్యాన్ బేస్ ను సృష్టించుకున్నారు. నిజానికి సూర్య కన్నా ఎక్కువ ఎమోషనల్ స్పేస్ లో నటించిన నటుడు కార్తీ.ఇలాంటి ఎమోషనల్ కాన్వాస్ ను దాటి విరుద్ధతను ప్రదర్శించే టోన్ లో 'కంగువా' కార్తీ ఇంకా గొప్పగా ఇమిడిపోవడమే ఇక్కడ విశేషం.రెండున్నర గంటల సినిమాలో పది నిమిషాల పాత్ర కార్తీది అంతే!

సాధారణంగా సినిమాలో కామియో రోల్స్ వల్ల కమర్షియల్ ఎట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. అది సినిమాకు ఒక పాజిటివ్ సైన్ లా ఉంటుంది.కార్తీ కూడా ఈ సినిమాలో అంతేనా? అంటే ఒక కోణంలో అవుననే ఒప్పుకోవాలి. కానీ ఆ స్వల్ప వ్యవధిలోనే పీరియాడిక్ సినిమాల్లో తన ఇంటెన్సిటీ స్థాయి వేరు అని స్పష్టం చేశారు కూడా!

చూద్దాం!కార్తీ త్వరలో ఎటువంటి సినిమాటిక్ మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడో!


Tags:    

Similar News