ధనుష్ “ఇడ్లీ కొట్టు” రివ్యూ
డైరెక్టర్‌గా గెలిచాడు… రైటర్‌గా ఓడిపోయాడు?
శంకరాపురం అనే ఊరు. తెల్లారిసరికే రోడ్డంతా వ్యాపించే ఇడ్లీ వాసన చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ అక్కడికి చేరుస్తుంది. ఆవిరి పొగతో కమ్ముకున్న ఆ ఇడ్లీ కొట్టు శివకేశవులు (రాజ్ కిరణ్)ది. ఆయన జీవితం, గౌరవం, ఊరి గుర్తింపు..మొత్తం ఆ కొట్టు చుట్టూనే అలుముకున్నాయి. ఆయన చేతి వంట అంటే ఆ ఊరికి పండగ.
కానీ కొడుకు మురళీ (ధనుష్)కి మాత్రం ఆ పొగలు ఇష్టమైనా, ఆ ఊరి పరిమితులు ఇష్టం ఉండవు. “జీవితం ఒక ఇడ్లీ కొట్టులోనే ఆగిపోకూడదు” అన్న తపన అతనిది. దాంతో గాంధేయవాది అయిన తండ్రితో పోరాడతాడు. అందరి కొడుకుల్లాగే తండ్రిని కన్వీన్స్ చేయలేకపోతాడు. దాంతో సొంత ఊరు విడిచి, హోటల్ మేనేజ్‌మెంట్ నేర్చుకొని, చివరికి బ్యాంకాక్ చేరుకుంటాడు.
అక్కడే అతని ప్రతిభను గమనించి పాపులర్ చైన్ రెస్టారెంట్ AFC యజమాని విష్ణువర్ధన్ (సత్యరాజ్) తన వ్యాపారంలో పెద్ద స్థానం ఇస్తాడు. అంతేకాదు… తన కూతురు మీరా (షాలినీ పాండే)ని పెళ్లి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతాడు. తను అనుకున్న స్దాయి, కలల పెళ్లి జరగబోతున్న సమయంలోనే… ఊరి నుంచి వచ్చిన ఓ దారుణ వార్త మురళీ ప్రపంచాన్నే తిరిగి తన ఊరు వైపు ప్రయాణించేలా చేస్తుంది. అప్పుడు ఏమైంది. తండ్రి చివరి కోరిక అయిన “ఇడ్లీ కొట్టు మూతపడి పోకూడదు.” అనేది తీరిందా?
అలాగే తన సొంత ఊరుకి చేరిన మురళికి ఎదురైన సమస్యలు ఏమిటి..తండ్రి ఆ ఇడ్లీ కొట్టును నిలబెట్టుకోవాలంటే తండ్రి వృత్తి నైపుణ్యంతో పాటు, ఊరివారి నమ్మకం కూడా పొందగలిగాడా, అలాగే విష్ణువర్ధన్ కుమారుడు అశ్విన్ (అరుణ్ విజయ్) కి మురళికి మధ్య గొడవ ఏమిటి, కల్యాణీ (నిత్యా మీనన్) ఎవరు? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ...
ఈ సినిమాలో ధనుష్ డైరెక్టర్‌గా గెలిచాడు… కానీ రైటర్‌గా ఓడిపోయాడు. నటుడుగా ఎప్పటిలాగే చేసాడు. శంకరాపురం నుంచి బ్యాంకాక్ వరకు నడిచే కథ. తండ్రి వారసత్వం, కొడుకు కలలు, ఊరి ఆత్మ గౌరవం అన్నీ కలిసిన డ్రామా. స్క్రీన్‌పై కొన్ని సన్నివేశాలు మనసును నిజంగానే హత్తుకుంటాయి. ముఖ్యంగా రాజ్‌కిరణ్–ధనుష్ సన్నివేశాలు, ఊరి వాతావరణం, తండ్రి గుర్తు అనే భావన… చూసినవాళ్ల కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాయి. అయితే…
అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ & మైనస్ పాయింట్ రెండూ ధనుష్ అనే చెప్పాలి. దర్శకుడిగా ధనుష్ నిజంగా తన ప్రతిభ చూపించాడు. సినిమా ట్రీట్‌మెంట్‌లో ఓ బ్యూటీ ఉంది, ఎమోషన్స్‌లో సహజత్వం ఉంది. కానీ ఊరి గాలి, వంట వాసన, మనుషుల సంబంధాలు— అన్ని రియల్ గా అనిపిస్తాయి చాలా సేపు. అయితే అవన్నీ ఏ కాలానివి అనే సందేహం కూడా వస్తుంది.
కానీ రైటర్ ధనుష్ – ఎందుకు ఫెయిల్ అయ్యాడు? . ఇక్కడే సమస్య మొదలవుతుంది. కథలో కావాల్సిన స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మిస్సయ్యింది. మురళీ ఎందుకు తల్లిదండ్రులకి దూరమయ్యాడు? శివకేశవుడు ఎందుకు కొడుక్కి క్షమించలేకపోయాడు? సత్యరాజ్ పాత్రలోని బలహీనత ఏంటి? అరుణ్ విజయ్ క్యారెక్టర్ గ్రే షేడ్ ఎందుకు స్పష్టంగా చూపించలేదు? ఈ ప్రశ్నలకు ఎక్కడా సరైన సమాధానం రాలేదు. దాంతో కొన్ని సన్నివేశాలు కళ్ళలో కన్నీరు తెప్పించినా… మొత్తం సినిమా చివరివరకు కూర్చోబెట్టేంత ఇంటెన్స్ ఎమోషన్ మాత్రం మిస్సయ్యింది.
ఎవరెలా చేసారు
ఈ సినిమా హైలెట్స్ లో జీవి ప్రకాష్ సంగీతం, కిరణ్ కౌశిక్ కెమెరా వర్క్. అలాగే ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది కానీ సెకండాఫ్ లో కాస్త ల్యాగ్ తగ్గించనవచ్చు అనిపించింది. ఇక తెలుగు డబ్బింగ్ బాగుంది. మాటల అనువాదం, తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా రాసారు. దర్శకునిగా ధనుష్ నుంచి గత రాయన్ కంటే ఇది మంచి వర్క్ . ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో ..
ధనుష్ & నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, తమ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.కాకపోతే కథకు కీలకంగా నిలవాల్సిన అరుణ్ విజయ్, శాలిని పాండే ఏదో ఉన్నారంటే ఉన్నారనిపించారు. తల్లి పాత్ర పోషించిన గీతా కైలాసం నటన చాలా బాగుంది. ఆ పాత్రను ధనుష్ (Dhanush) డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. రాజ్ కిరణ్ స్క్రీన్ ప్రెజన్స్ చాలా గ్యాప్ తర్వాత బాగుంది. సత్యరాజ్ మరో కీలకపాత్రలో జస్ట్ ఓకే.
ఫైనల్ థాట్
ఇది ఇడ్లీ కొట్టు నేపధ్యంలో నడిచే గాఢ్ ఫాధర్ లాంటి సినిమా అని చెప్పాలి. అయితే సినిమా అనుకున్న స్దాయిలో కిక్ కానీ ఓ ఎమోషన్ కంటిన్యుటిగానీ ఇవ్వలేకపోయింది. ఇది పూర్తిగా తండ్లి, కొడుకు ఎమోషన్, తండ్రి చేసే వృత్తి పట్ల ఉండే గౌరవం, దాన్ని కొనసాగించాలనే ఆశయం వగైరా విషయాలతో సాగుతుంది. లైన్ గా వింటే బాగుందనిపిస్తుంది. కాకపోతే మరీ పెద్ద ఉద్యోగం వదులుకుని, తండ్రి వారసత్వం అని చిన్న ఇండ్లీ కొట్టు నడపాలి అనుకున్న కథగా చూసినప్పుడే ఇబ్బందిగా అనిపిస్తుంది.