ధన్యబాలకృష్ణ 'హత్య' ఓటీటీ మూవీ రివ్యూ!
బాబాయ్ ని ఎవరు మర్డర్ చేశారు?;
రాజకీయ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు ఫలానా టైమ్ అని ఉంటుంది. ఆ టైమ్ అయిపోతే వాటికి జీవం, ఆదరణ ఉండవు. నిజ జీవిత సంచలన రాజకీయ సంఘటనలతో కథ తయారు చేసుకున్న ఈ సినిమా కాస్త లేటుగా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి బాబాయ్ హత్య ఈ సినిమా కథకు బేస్. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో 'హత్య' సినిమా రూపొందింది. రవివర్మ .. ధన్యబాలకృష్ణ .. పూజా రామచంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి శ్రీవిద్య బసవ దర్శకత్వం వహించారు. జనవరి 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాంటి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కు కథ ఏమిటి, ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
'పులివెందుల' లో దయానంద్ రెడ్డి (రవివర్మ) మర్డర్ జరుగుతుంది. ఆయన రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అంతేకాదు ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి (భరత్ రెడ్డి)కి స్వయానా బాబాయ్. ఈ దారుణ హత్య కేసు కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ సుధారావు (ధన్య బాలకృష్ణ) సీన్ లోకి వస్తుంది. ఆమె ఒక్కో ఆధారం చూసుకుని, సంఘటన చుట్టూ ఉన్న విషయాలను విశ్లేషిస్తూ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో చాలా విషయాలు బయటకు వస్తాయి.
దయానంద్ రెడ్డి చాలా మంచి వాడని, ఆయన గత కొంతకాలంగా కుటుంబంతో పడక ఒంటిరిగా ఉంటున్నాడని తెలుస్తుంది. అలాగే ఆయన బంగ్లాకు సీసీ కెమెరాలు లేవని అర్థం చేసుకుంటుంది. అందుకు కారణం ఆయనకి గల ఇతర సంబంధాలే అని అర్దం చేసుకుంటుంది. అలాగే ఆయన సూసైడ్ లెటర్ కూడా అనేక డౌట్స్ రప్పిస్తుంది. వీటితో పాటు ఆయన జీవితంలో 'షహీన్' అనే యువతకి కూడా ఉందని, పెద్ద మొత్తంలో అప్పులు కూడా చేసాడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఏమైంది. అసలు దయానంద్ రెడ్డి ఎవరి కోసం ఎందుకు అప్పులు చేశారు. ఆ క్రమంలో ఏ నిజాలు బయటపడ్డాయి. ఆయన్ని హత్య చేసిందెవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓ హత్య ఆధారంగా రూపొందినట్లు అనిపించే ఈ కథ ...టైటిల్ కు తగినంత ఇంటెన్స్ తో అయితే సాగదు. రెగ్యులర్ పోలీస్ కథను హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా మార్చారని అర్థమవుతుంది. ఇలాంటి కథ ఎలక్షన్స్ ముందు వస్తే ఉపయోగం ఉండేదేమో. ఎందుకంటే ఈ సినిమాలో పాత్రలు,కథనం మొత్తం మనం నిత్యం పేపర్ లో, మీడియా లో చూసి, విన్న సంఘటనలే. ముఖ్యంగా కీలకమైన పాత్ర ముఖ్యమంత్రికి బాబాయ్ గా ఉండటం , ఆయన బంగ్లాలో ఒంటరిగా ఉండటం, బాత్ రూమ్ లో శవమై పడి ఉండటం , అంతేకాకుండా గుండెపోటు వలన చనిపోయారని వార్తలు రావడం ఇవన్నీ మనకు తెలిసినవే.
అలాగే అదే సమయంలో ఆయన గదిలోని డాక్యుమెంట్స్ మాయం కావడం .. అక్కడ సూసైడ్ లెటర్ లభించడం .. ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా గతంలో జరిగిన సంఘటనకి దగ్గర పోలికలతో కనిపిస్తూ ఉంటాయి. పాత్రల పేర్లు కూడా తెలిసినట్లే అనిపించేలా పెట్టారు. డైరెక్టర్, నిర్మాత ఉద్దేశ్యం క్లారిటీనే. అయితే అంతవరకూ పెద్దగా ఆసక్తి రేపదు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఇలాంటి సినిమాలకు కీలకం. అక్కడ పెద్దగా ట్విస్ట్ లు పేల్చలేకపోయారు. ఇలాంటి కథతో ఎలక్షన్స్ కు ముందు ఓ సినిమా వచ్చి క్లిక్ అయ్యింది. మర్డర్ తోనే మొదలయ్యే ఈ సినిమా .. ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ముందుకు వెళ్తుంది. కొత్తదనం ఏమీ లేదు. అప్పుడు రిలీజ్ చేద్దామనుకున్న రెడీ చేసుకున్న సినిమా ఇది అని అర్థమవుతుంది. అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
టెక్నికల్ గా
ఇది చిన్న బడ్జెట్ లో తీసిన సినిమా. అందుకు తగిన వనరులు, టెక్నీషియన్స్ ఈ సినిమాకు లభించినట్లున్నారు. అలాగే ఉంటాయి సీన్స్. అభిరాజ్ రాజేంద్రన్ ఫొటోగ్రఫీ .. నరేష్ కుమరన్ నేపథ్య సంగీతం .. అనిల్ కుమార్ ఎడిటింగ్ ఉన్నంతలో బాగానే చేసారు. పోలీస్ ఆఫీసర్ గా ధన్య బాలకృష్ణ, షహీన్ పాత్రలో పూజా రామచంద్రన్ బాగా చేశారు.
చూడచ్చా
పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా నడిచే ఈ సినిమా కొన్ని వర్గాలకు నచ్చుతుంది. మిగతా వారికి పెద్దగా ఆసక్తి కలిగించదు. రాంగ్ టైమ్ రిలీజ్ అనిపించే ఈ సినిమా రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఓ లుక్కేయచ్చు.
ఎక్కడ చూడచ్చు
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది