దియా మీర్జా 'కాఫిర్' ఓటీటీ సినిమా రివ్యూ
దియా మీర్జా - మోహిత్ రైనా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కథేంటి, ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.;
వెబ్ సీరిస్ గా వచ్చి క్లిక్ అయిన తర్వాత దాన్ని సినిమా రూపొందిస్తే ఎలా ఉంటుంది ...ఇదిగో 'కాఫిర్' సినిమాకి అలాగే జరిగింది.
2019 లో హిందీలో 'కాఫిర్' అనే సిరీస్ 'జీ 5'లో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు ఈ సిరీస్ ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. దియా మీర్జా - మోహిత్ రైనా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కథేంటి, ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
పాకిస్థాన్ కు చెందిన కైనాజ్ (దియా మీర్జా) కి , ఫరూక్ తో వివాహమవుతుంది. అయితే ఆమెకి సంతానం లేదని చెప్పి, ఆమె భర్త ఇంకో వివాహం చేసుకుంటాడు. దాంతో ఆమె ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలో భాగంగా అక్కడున్న 'నది'లో దూకేస్తుంది. అయితే ఆమె చనిపోదు. ఆ నది ప్రవాహంలో కొట్టుకుపోతూ భారత నియంత్రణ రేఖను దాటుకుని కొట్టుకుని వస్తుంది.
ఆమె కొట్టుకుని వస్తున్న ఆ సమయంలోనే ఆ నదీ తీరంలో కొంతమంది మిలిటెంట్లను ఇండియన్ ఆర్మీ పట్టుకుంటుంది. అలా వాళ్లతో పాటు ఆమె తీవ్రవాదిగా ఇక్కడ జైలు జీవితం గడుపుతుంటుంది. ఆ జైలు శిక్ష సమయంలోనే ఆమె తల్లి అవుతుంది. ఓ ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ పాపకు 'సెహర్' అని పేరు పెడతారు.
మరో ప్రక్క తీవ్రవాదుల దాడిలో తన తమ్ముడిని కోల్పోయిన వేదాంత్, కైనాజ్ కు విముక్తిని కలిగించాలని నిర్ణయించుకుంటాడు. ఆర్మీకి తాను దొరికినప్పుడు తనకి 15 నెలల శిక్షను మాత్రమే విధించారని, కానీ తాను జైల్లో ఏడేళ్లుగా మగ్గుతున్నానని కైనాజ్ చెబుతుంది. తాను గర్భవతిగా ఉన్న విషయం, తాను ప్రాణాలతో బయటపడిన తరువాతనే తెలిసిందని అంటుంది. దాంతో ఆమెను జైలు నుంచి విడిపించడానికి అతను గట్టిగా ప్రయత్నించడం మొదలుపెడతాడు.
ఆ క్రమంలో ఆమె కొన్ని విషయాలలో తనకి అబద్దం చెప్పిందనే సంగతి వేదాంత్ కి అర్థమవుతుంది. ఆమె అసలు అబద్దాలు ఎందుకు చెప్పింది. ఆమె దాచిన ఆ విషయాలేమిటి? అందుకు గల కారణాలు ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమా కథ ఓ నిజ జీవిత సంఘటనను బేస్ చేసుకుని తీసారు. పాక్ అడ్మినిస్ట్రీ భూభాగంలో నివసిస్తున్న కాశ్మీరీ మహిళ షెహ్నాజ్ పర్వీన్ యొక్క నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఆమె అనుకోకుండా నియంత్రణ రేఖను దాటి ఎనిమిదేళ్ల పాటు భారతదేశంలో నిర్బంధించ పడింది. ఆమెను మిలిటెంట్ గా అనుమానించారు. పర్వీన్ లాగే, చిత్ర హీరోయిన్ కైనాజ్ (దియా మీర్జా) వరుస భయంకరమైన సంఘటనల ఫలితంగా సరిహద్దులో భారతదేశం వైపు ముగుస్తుంది.
దేశ భద్రతకు ప్రమాదమని భావించిన ఆమె ఏడేళ్లుగా జైలులో ఉన్నారు. కైనాజ్‌కు ఒక కుమార్తె ఉంది, ఆమె జైలులో ఉండగా, ఆమె గదిలోని కఠినమైన పరిస్థితుల్లో ఆమెను పెంచుతుంది. ఇదంతా తెరపైకి ఎక్కించారు. వాస్తవ పరస్దితులను ఆధారం చేసుకున్న ఈ హ్యూమన్ డ్రామా..ఫస్టాఫ్ బాగానే స్పీడ్ గా వెళ్లిపోయినా, సెకండాఫ్ కు వచ్చేసరికి నత్త నడక మొదలెట్టింది. వెబ్ సీరిస్ వేరు, సినిమా వేరు. ఈ రెండింటి లెక్కలు వేరు, స్క్రీన్ టైమింగ్, స్క్రీన్ ప్లే అన్ని వేర్వేరుగా ఉంటాయి. అదొక్కటి చూసుకుని ఉంటే మరో మంచి సినిమా అయ్యేది. ఏదైమైనా ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా థియేటర్ లో ఇప్పుడున్న పరిస్దితుల్లో వర్కవుట్ అవటం కష్టమే. ఓటీటీలోనే ఇవి జనం చూస్తారు.
టెక్నికల్ గా ..
ఈ సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్ అన్ని క్రాప్ట్ లు సహజత్వం కోసం ప్రయత్నించడం. రాజు సింగ్ ఇచ్చిన నేపధ్య సంగీతం బావుంది కానీ కొన్ని చోట్ల శ్రుతిమించిందనిపిస్తుంది. ప్రతీక్ షా కెమెరాపని తనం బావుంది. విజువల్స్ లో రిచ్ నెస్ వుంది. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. నిర్మాణంలో రాజీపడలేదు. కేవలం ఎమోషన్ ని ని నమ్ముకొని తయారైన సినిమా ఇది.
నటీనటుల్లో దియా మీర్జా తన అనుభవాన్ని చూపించారు. ఆ పాత్రని హుందాగా అదే సమయంలో ఎదో బలమైన ఫ్లాష్ బ్యాక్ ని మోస్తున్న పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆమె అమాయకత్వం చూసి చాలా చోట్ల జాలి పుడుతుంది. దియా మీర్జా ఆ పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చింది.
చూడచ్చా
అందరినీ ఆద్యంతం కట్టిపడేసే సినిమా కాదు కానీ ఎమోషన్ తో కూడిన కథలు ఇష్టపడే ఆడియన్స్ కి ఓ మోస్తారుగా నచ్చే కంటెంట్ ఉంది. కాబట్టి ఓ సారి ట్రై చేయచ్చు.
ఎక్కడుంది.
జీ5 లో తెలుగులో ఉంది