ఓటీటీ డీల్స్: డైరెక్టర్ వెట్రిమారన్ చెప్పింది నిజమే, అంతకు మించి దారి లేదు

గత కొద్ది నెలలుగా చిన్నా, పెద్దా ప్రతీ ప్రొడక్షన్ కంపెనీలోనూ ఒకటే హాట్ టాపిక్ అదే...ఓటీటీ అమ్మకాలు.

Update: 2024-11-17 07:05 GMT

గత కొద్ది నెలలుగా చిన్నా, పెద్దా ప్రతీ ప్రొడక్షన్ కంపెనీలోనూ ఒకటే హాట్ టాపిక్ అదే...ఓటీటీ అమ్మకాలు. తమ సినిమా ఓటీటీ వాళ్లు కొనుక్కుంటారా లేదా, తాము అనుకున్న రేటు వస్తుందా రాదా, ఓటీటీ బిజినెస్ అయితే కానీ రిలీజ్ డేట్ పెట్టుకోలేం. ఈ లోగా వడ్డీలు పెరిగిపోతున్నాయి. అసలు ఎందుకు ఈ సినిమా మొదలెట్టామా అని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఓటీటీ సంస్దలు ఇదివరకు మాదిరిగా వ్యవహించటం లేదు. తమ రూల్స్ ని రెవిన్యూని బట్టి మార్చుకుంటూ పోతున్నాయి. ఓటీటీ ల నుంచి వచ్చే రెవిన్యూ అదనం కాకుండా అదే ప్రధానంగా చాలా మంది నిర్మాతలు భావించటమే ఇలాంటి చాలా సమస్యలకు దారి తీస్తోంది.

స్టార్‌ హీరోల సినిమాలకు రిలీజ్ కు ముందే కాంబినేషన్ ను బట్టి ఓటిటి సంస్దలు రేటు ఫిక్స్ చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలకు కూడా హిట్ టాక్‌ వస్తే భారీ మొత్తంలో ఓటీటీ రైట్స్ రూపంలో నిర్మాతలకు దక్కుతున్నాయి. దాంతో ఈ రెవిన్యూ ప్రధానం అవటంలో వింతేమీ లేదు. అయితే కానీ కొన్ని స్టార్‌ హీరోల సినిమాలు రకరకాల కారణాలతో ఓటీటీ బిజినెస కాక రిలీజ్ లేటు అవుతూ వస్తోంది. ఆ మధ్యన తెలుగులో ఒక స్టార్‌ హీరో సినిమాను పాన్ ఇండియా మూవీ అంటూ విడుదల చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ స్టార్‌ హీరోకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ ను కూడా చెల్లించింది.

రిలీజ్ తర్వాత సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఓటీటీ వారు ఇప్పుడు సినిమాను తీసుకునేందుకు ముందుకు రాలేదు. పైగా చాలా తక్కువ మొత్తంలో కోట్‌ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎంత పెద్ద హీరో అయినా కూడా ప్రేక్షకులకు నచ్చని సినిమాకు ఎలా అదనంగా ఖర్చు పెట్టగలం అన్నట్లుగా సదరు ఓటీటీ ప్రతినిధులు నిర్మాతలతో అంటున్నరని వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఈ విషయం నిర్మాతల మండలి వద్దకు వెళ్లినా తెమలటం లేదు.

కరోనా తర్వాత కాలంలో సినిమా స్టార్స్ తమ రెమ్యునరేషన్ ఏటేటా పెంచుకోవడం మొదలెట్టారు. దాంతో ఇతర వ్యాపారాల మాదిరిగానే సినిమా మేకింగ్ బిజినెస్ కూడా భారీగా మారిపోయింది. పెద్ద స్టార్స్ నటించిన కొన్ని సినిమాల హక్కుల కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ లు బోలోడు డబ్బులు చెల్లిస్తున్నాయి. అయితే దాని వలన రకరరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇండస్ట్రీ ఓటిటి సంస్దల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎందుకంటే ఓటిటి ప్లాట్ ఫామ్ వారు ఎంత ఇస్తారో చూసి దాన్ని బట్టే బడ్జెట్ లు, వాళ్లు ఎప్పుడు చెప్తే అప్పుడు రిలీజ్ లు చేసే స్దాయికి ఇండస్ట్రీ చేరుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడారు.

స్టార్స్ సినిమాల హక్కుల కోసం భారీ మొత్తాలు చెల్లించి స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ లు చిత్ర పరిశ్రమలో అసమతుల్యతకు దారితీశాయని వెట్రిమారన్ ఆరోపించారు. అసురన్, విడుదలై వంటి చిత్రాలకు పాపులరైన ఈ దర్శకుడు ఇదే విషయాన్ని నొక్కి చెప్తూ... స్టార్లు నటించిన చిత్రాల స్ట్రీమింగ్ హక్కులను పొందడానికి ఓటిటి సంస్దలు 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తాయని, అందువల్ల స్టార్స్ తమ రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు.

వాస్తవానికి ఇక్కడ ఫెయిల్ అవుతున్నది థియేట్రికల్ బాక్సాఫీస్ కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ సృష్టించిన ద్రవ్యోల్బణమే అని చెప్పాలంటున్నారు ఆయన. కరోనా సమయంలో 'రజినీకాంత్, విజయ్ సినిమాలకు రూ.120 కోట్లు ఇస్తాం, మీరే తీయండి' అని వాళ్ల అన్నారు. ఆ తర్వాత బడ్జెట్లు పెద్దవయ్యాయి, ఆ వెంటనే రెమ్యునరేషన్స్ కూడా పెరిగాయి' అని వెట్రిమారన్ పేర్కొన్నారు.

అయితే కొన్ని నెలల్లోనే స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ లు ఈ ఫార్ములా స్థిరంగా లేదని తెలుసుకున్నాయని, దాంతో ఇప్పుడు అంత పెద్ద మొత్తాలను ఇవ్వడం మానేశాయని ఆయన అన్నారు. కానీ నిర్మాతలు పెద్ద సినిమాలు తీయడం అలవాటు చేసుకున్నారని, నటీనటులు ఎక్కువ రెమ్యనరేషన్ తీసుకోవడం అలవాటైందన్నారు. ఇప్పుడేం చేయాలి?' అని వెట్రిమారన్ ప్రశ్నించారు.

అదే సమయంలో డైరెక్టర్ మారి సెల్వరాజ్ ను వెట్రిమారన్ కొనియాడారు. చిన్న బడ్జెట్‌ మూవీలను చేస్తూ రెండింతల లాభం ఆర్జిస్తున్నారంటూ మెచ్చుకున్నారు. "మారి సెల్వరాజ్‌ తీసిన 'వాఝై'లాంటి చిత్రాలకు బాగా లాభాలు వచ్చాయి. మంచి సినిమాలు తీస్తే థియేటర్‌కు వచ్చి చూసే ప్రేక్షకులూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం పునః సమీక్షించుకోవాలి. థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చేలా ప్రేక్షకులను ప్రోత్సహించాలి. సిల్వర్ స్క్రీన్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీయాలి.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సెల్ఫ్ సెన్సార్ షిప్ కు పాల్పడుతున్నాయని, బీఫ్ తినే వారిని ఒక ప్రత్యేక కమ్యూనిటీగా చూపించడం ఓటీటీలకు ఇష్టం లేదని, సినిమాల్లో ఇలాంటి చిత్రణలతో ఒక వర్గానికి భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. వారు పేమాస్టర్లు కాబట్టి వారి డిమాండ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే నేను కూడా నా జనం వద్దకు వెళ్లి ప్రజాస్వామిక వ్యాపారం చేయవచ్చు' అని ఆయన అన్నారు.

అయితే తనకు థియేటర్స్ నమ్మకం ఉందని, థియేట్రికల్ ఆదాయం పుంజుకుంటుందని వెట్రిమారన్ ఆశాభావం వ్యక్తం చేసారు. రెమ్యునరేషన్ ల్లో 30 నుంచి 40 శాతం కోత విధించడం, బడ్జెట్ ఫ్రెండ్లీ సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టడం వల్ల థియేట్రికల్ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వెట్రిమారన్ వివరించారు.

Tags:    

Similar News