ఫన్ ..ఎమోషన్ : 'ఫ్యామిలీ ఆజ్ కల్' వెబ్ సీరిస్ రివ్యూ

ఫన్ ఎమోషన్‌గా సాగే వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ ఆజ్ కల్’. ఈ సిరీస్‌ ఎలా ఉంది.

Update: 2024-04-25 05:30 GMT


వెబ్ సీరిస్‌లు పరిచయం అయిన కొత్తలో అంటే కోవిడ్ టైమ్‌లో ప్రతీదీ జనం ఆసక్తిగా చూసేవారు. కానీ ఇప్పుడు బాగుంది. అద్బుతం అంటే కానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఏది పడితే అది తీసి మన మీదకు తోసేస్తే ఉపయోగం లేదని ఓటిటి సంస్థలకు అర్దమైంది. దాంతో పోటీ పడి మరీ ఓటిటి సంస్థలు వెబ్ సీరిస్‌లకు బడ్జెట్‌లు కేటాయిస్తున్నారు. కానీ కంటెంట్ దగ్గరకి వచ్చేసరికి చాలా వరకూ తడబడుతున్నారు. ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్స్‌కే ప్రియారిటీ ఇస్తున్నారు. ఇవీ బోర్ కొట్టేస్తున్నారు. ఎన్ని రోజులని వరసపెట్టి హత్యలు, ఇన్విస్టిగేషన్స్‌ని చిన్న తెరపై చూడగలరు. అందులోనూ అవి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసేవి కాదు.


ఈ క్రమంలో ప్యామిలీ వెబ్ సీరిస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్యామిలీ వెబ్ సీరిస్‌లతో ఓ సమస్య ఉంది. అవి సరైన క్వాలిటీతో లేకపోతే టీవీ సీరియల్స్‌తో పోటీ పడుతూంటాయి. అయితే సినిమాలు టీవి సీరియల్స్‌తో పోటీ పడి.. వెబ్ సీరిస్‌లూ టీవీ సీరియల్స్‌తో పోటీపడితే.. ఇంక టీవి సీరియల్స్ ఎవరితో పోటీ పడాలి? అందుకే అవి చూసే జనం తగ్గిపోతున్నారు. ఆ విషయం ప్రక్కన పెడితే.. తాజాగా ఓ ఫ్యామిలీ వెబ్ సీరిస్‌ని సోనీ లివ్ తీసుకొచ్చింది. దాని పేరు ఫ్యామిలీ ఆజ్‌కల్.


స్టోరీ లైన్‌గా బాగా చిన్నదే... డిల్లీలో ఓ చిన్న కుటుంబం. చిన్న కుటుంబం చింతలులేని కుటుంబం అన్నట్లుగా శేఖర్ (దివంగత నితీష్ పాండే), ఫైజా (సోనాలి సచ్‌దేవ్)లది హ్యాపీ ఫ్యామిలీ. వాళ్లకు ఇద్దరు పిల్లలు మెహెర్ (అపూర్వ అరోరా), సాహిర్ (ఆకర్షణ్ సింగ్). శేఖర్, ఫైజాలది లవ్ మ్యారేజ్. అప్పట్లో శేఖర్ తండ్రి (మసూద్ అక్తర్) వీళ్ల ప్రేమని యాక్సెప్ట్ చేసి ఉండడు. కానీ కాలం, కోవిడ్.. మన జీవితాల్లో చాలా మార్పులు తెచ్చాయి. ఇప్పుడు ఆయన మనవళ్లు కూడా పెద్దవాళ్లు అయ్యాక తన కొడుకు దగ్గరికి వచ్చాడు. కోడలు ఎడ ముఖం పెడముఖంగా ఉన్నా సర్దుకుపోవటానికి సిద్దమయ్యాడు.


ఇదిలా ఉండగా ఓ రోజు కూతురు మెహెర్ వాళ్లింట్లో బాంబు పేల్చింది. తాను ఓ కుర్రాడుని ప్రేమిస్తున్నాని చెప్పింది. అయితే తమది లవ్ మ్యారేజే కాబట్టి .. తమ కూతురు ప్రేమను వాళ్లు నెగిటివ్‌గా తీసుకోవాలనుకోరు. అయితే సమస్య అంతా ఆమె ప్రేమించిన కుర్రాడుతోనే వస్తుంది. అతను ఓ క్యాబ్ డ్రైవర్ కావటం కుటుంబాన్ని షాక్‌లో పడేస్తుంది. ఏ కులమైనా, మతమైనా యాక్సెప్ట్ చేసేవాళ్లం కానీ ఇలా ఓ క్యాబ్ డ్రైవర్‌ని తీసుకొచ్చి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంటే ఎలా అనేది వారి వాదన.


అయితే ఆ వాదనను వాళ్లు ఆ అమ్మాయి ఎదురుగా పెట్టరు. మొగుడు పెళ్లాం డిస్కస్ చేసుకుని మదన పడుతూంటారు. ప్రేమ పేరుతో కూతురు రేపు ఆ క్యాబ్ డ్రైవర్‌ని పెళ్లి చేసుకుంటే అతనికి సరైన సంపాదన లేక తన కూతురుపై డిపెండ్ అయ్యిపోతే ఏంటి పరిస్థితి అనేది వారికి తెగని ఆలోచన. అసలు క్యాబ్ డ్రైవర్స్ ఎలా ఉంటారు.. వాళ్లు మనతో కలిసిపోతారా... అనేది తెలిసుకోవాలనుకుంటారు.


అందుకోసం ఓ పోగ్రాం పెట్టుకుంటారు. క్యాబ్‌లు ఎక్కి ఆ డ్రైవర్స్‌ని మెల్లిగా మాటల్లోకి దింపి వాళ్ల జీవిన విధానం, సంపాదన ఎంక్వైరీ చేస్తూంటారు. ఆ క్రమంలో ఇల్లు కూడా కొనుక్కోలేని సంపాదనతో క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారనే విషయం తెలిసియడం వారిని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ విషయం కూతురుకు చెప్పి ఎలా ఒప్పించాలి.


కూతురుది కూడా కొంచెం అటూ ఇటూలో అలాంటి సమస్యే. తన తల్లి, తండ్రి తనను ఎంతో ప్రేమగా ఇంతకాలం చూసుకున్నారు. వాళ్లు గుడ్ పేరెంట్స్.. ఇప్పుడు వాళ్ల మాటని కాదని ఓ క్యాబ్ డ్రైవర్‌ని తమ కుటుంబంలోకి ఎలా తీసుకురాగలుగుతుంది. మరో పక్క ఆ అమ్మాయి తాతకు ఇదంతా ఎంటర్టైన్మెంట్‌గా ఉంటుంది. అప్పట్లో తన కొడుకు లవ్ మ్యారేజ్ అంటూ వెళ్లిపోతే తను ఎంత బాధ పడ్డాడో.. అదే బాధ తన కొడుక్కీ తెలియాలనుకుంటాడు. అందుకోసం తన మనవరాలి ప్రేమను ఎంకరేజ్ చేస్తూంటాడు. ఇలా కొంత డైలమోతో కూడిన డిఫరెంట్ డైమనన్షన్తో కథ, కథనం నడిపారు.


ఎలా ఉంది...


ఈ ఫ్యామిలీ ఆజ్ కల్ అనే సిరీస్ ఫ్యామిలీకు ఇచ్చే నిర్వచనంతో మొదలవువుతుంది. ఒక కుటుంబం అంటే కొంతమంది వ్యక్తులు కలిసి పెరిగే సమూహం అని షో అర్దం చెప్తుంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో, మూడు తరాలుని మనం చూడవచ్చు. వాళ్లు తమ పక్షపాతాలను, అహంకారాన్ని అధిగమించటం, ఇతరుల కోసం తమ ఆలోచనలను, అభిప్రాయాలను పక్కన పెట్టడం నేర్చుకోవటమే సారాంశం. ఫామిలీ ఆజ్ కల్ మెట్రో పాలిటిన్ సిటిలోని ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలోని సభ్యుల మధ్య ప్రేమ, సమస్యలను ఆవిష్కరిస్తుంది. అయితే ఇందులో డ్రామా కోసం అతిగా కథను మెలికలు వేసి అల్లుకుపోవటం నచ్చుతుంది. నార్మల్ మనుష్యులు, వారి సహజ ప్రవర్తలను డైరక్టర్ పట్టుకోవటానికి ప్రయత్నించాడు.


ఐదు చిన్న చిన్న ఎపిసోడ్స్‌లో రైటర్ మనోజ్ కల్వాని ఎక్కడా అక్కర్లేని సీన్ కానీ, డ్రామా క్రియేట్ చేయటం కానీ చెయ్యలేదు. మారుతున్న జనరేషన్స్.. కుటుంబంలో ప్రతీ ఒక్కరి ఆలోచనా సరళి ఎలా ఉంటుంది. ఆ సిట్యువేషన్స్, ఎమోషన్స్‌ని సాగతీయకుండా సజహంగా నడిపారు. ఈ సీరిస్‌లో ఒకే ఒక ఇబ్బంది ఏమిటంటే.. పాత్రలు మధ్య మధ్యలో మన కోసం తమ ఫీలింగ్స్‌ని కెమెరా వైపు చూసి చెప్పడం.. అప్పుడు ఏదో డాక్యుమెంటరీ చూసినట్లు అనిపిస్తుంది. అది తప్పిస్తే ఈ సీరిస్ ఏ ఇబ్బంది అనిపించదు. ఆర్టిస్ట్‌లు కూడా చాలా నాచురుల్‌గా చేశారు. టెక్నికల్‌గా సౌండ్ అని చెప్పలేం కానీ ఈ కథకు సరపడ ఉంది.

చూడచ్చా


ఫన్‌తో కూడిన ఈ సీరిస్‌ని ఫ్యామిలీతో చక్కగా చూడవచ్చు.. ఏ విధమైన అసభ్యత, హింస లేదు.


ఎక్కడ చూడచ్చు


సోనీ లివ్‌లో ...(తెలుగులో ఉంది)



Tags:    

Similar News