‘ఫైటర్’ హిందీ మూవీ రివ్యూ
యుద్ధాన్ని, ఎమోషన్స్ ని కలిపి సినిమా తీయడం బాగుంటుంది. కానీ ఏది ఎక్కువ ఉండాలన్నది కొంత విజ్ఞతతో కూడిన వ్యవహారం. అక్కడే సినిమా కొంచెం తేలిపోయింది.
By : The Federal
Update: 2024-01-26 05:24 GMT
-సలీమ్ బాషా
ఇది సిద్ధార్థ ఆనంద్ తీసిన మరో యాక్షన్ సినిమా. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల తర్వాత హృతిక్ రోషన్ హీరోగా తీసిన మూడో సినిమా. 2004తో సిద్ధార్థ సినీ ప్రస్థానం “ సలాం నమస్తే” లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాతో మొదలైంది. తర్వాత అతను తీసిన సినిమాలు యాక్షన్ సినిమాలు. “బ్యాంగ్ బ్యాంగ్” తో యాక్షన్ సినిమాలు తీయడం మొదలైంది. ఇంతవరకు తీసిన 3యాక్షన్ సినిమాలు, (పఠాన్ లాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు) విజయవంతమైన సినిమాలు. సిద్ధార్థ ఆనంద్ రాజ్ కపూర్ సినిమాలకు పని చేసిన పాత తరం రచయిత ఇంద్ర రాజ్ ఆనంద్ మనవడు కావడం విశేషం.
సాధారణంగా సిద్ధార్థ సినిమాలు భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ తో ఉంటాయి. ఫైటర్ సినిమాలో అవి తారాస్థాయికి చేరాయి. సినిమా మొత్తం భారతదేశానికి చెందిన ఫైటర్ విమానాలు చేసిన విన్యాసాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం జేమ్స్ బాండ్ సినిమాల తో పాటు, అనేక హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన DNEG అనే విజువల్ ఎఫెక్ట్ సంస్థ, ఈ సినిమాకి కూడా పనిచేయడం. సినిమాలో కథ, కథనం, నటన, పాటలు, డైలాగులు వంటి వాటి కంటే, గాలిలో విన్యాసాలు, పోరాటాలు ఈ సినిమాకి ఉన్న బలాలు. నోరూరించే జిలేబి లాంటి ఈ పోరాటాలు, విన్యాసాలు ఎక్కువ కావడం సినిమాకు కొంత మైనస్. కథ నడిపే క్రమంలో, దాన్ని ఎమోషనల్ గా కూడా మలచటానికి చేసిన ప్రయత్నం అంత ఆకట్టుకునేలా లేదు.
అన్ని సిద్ధార్థ సినిమాల లాగే ఇందులో కూడా పెద్దగా కథ ఏమి లేదు, కేవలం విన్యాసాలు, విజువల్ ఎఫెక్ట్స్, కథనం మాత్రమే ఈ సినిమాను చూడదగ్గదిగా చేశాయని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాకు ఉన్న ఇంకొక బలం ఒకరిద్దరు నటీనటులు. అందులో అనిల్ కపూర్, దీపిక, హృతిక్ రోషన్ ఉన్నారు. పెద్దగా లేని కథకు వీళ్ళు కొంత ఊతం ఇచ్చారు. యుద్ధాన్ని, ఎమోషన్స్ ని కలిపి సినిమా తీయడం బాగుంటుంది. కానీ ఏది ఎక్కువ ఉండాలన్నది కొంత విజ్ఞతతో కూడిన వ్యవహారం. అక్కడే సినిమా కొంచెం తేలిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ ని చాలా బాగా తీయగలిగిన దర్శకుడు, కథలో ఎమోషన్స్ మమేకం చేయడంలో కొంతవరకు విఫలమయ్యాడు. అయినప్పటికీ ఇది చూడదగ్గ సినిమాగా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.
అయితే ఇది యుద్ధ నేపథ్యం ఉన్న సినిమా కాదు. గతంలో హిందీలో వచ్చిన "ఉరి"(surgical strike)" సినిమా లాంటిది. 2016 ఉరి సంఘటన తర్వాత భారత్ ఆర్మీ బదులు తీర్చుకోవడం ఉరి సినిమా నేపథ్యం. అది కొన్ని నిజ సంఘటనల మీద ఆధారపడి తీసిన సినిమా. ఫైటర్ సినిమాకు అటువంటి నేపథ్యం లేకపోయినప్పటికీ, పుల్వామా సంఘటన తర్వాత పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడం మీద ఆధారపడి అల్లుకున్న కథ. ఈ సినిమా రెండు గంటల 46 నిమిషాలు సేపు నడుస్తుంది. అలా కాకుండా 2 1/4 గంటల్లో ఈ సినిమా ఉండి ఉంటే మరింత పకడ్బందీగా ఉంటూ ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండేవి. కొన్ని అవసరమైన సన్నివేశాలు, అవసరమైన దానికన్నా ఎక్కువ గా చిత్రీకరించడం వల్ల సినిమా వేగం తగ్గింది. అయితే ఈ సినిమాని తక్కువ చేయడానికి వీలు లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఎన్నో యాక్షన్ సినిమాల కన్నా, ఈ సినిమా చాలా బెటర్. ఈ సినిమాకి చాలా ఖర్చుపెట్టినట్లు ఉన్నారు. అందుకే చాలా సంఘటనలు నిజంగా జరిగినట్లు అనిపిస్తుంది.
దీనికి చాలా వరకు కారణం పదునైన ఎడిటింగ్ . కానీ అవసరమైన చోట్ల అనవసరమైన సన్నివేశాలకు కత్తెర వేయకపోవడం వల్ల సినిమా మందకొడిగా సాగినట్టు అనిపిస్తుంది. నిజానికి దేశభక్తి, యుద్ధం నేపథ్యంలో వచ్చే సినిమాలకు, ఎమోషనల్ సపోర్ట్ అవసరమే. అది ఎక్కువైనపుడు కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది.
సినిమాలో కొన్ని పాటలు ఉన్నాయి.అవి బాగానే చిత్రీకరించడం వల్ల అవసరమేమో అనిపిస్తుంది. ముఖ్యంగా హృతిక్ రోషన్ మంచి డాన్సర్, కాబట్టి ఒక పాట పెట్టారు. అది బాగానే ఉంది. పాటల రచయిత కుమార్ రాసిన పాటల్లో "షేర్ ఖుల్ గయా","వందేమాతరం" చిత్రీకరణ బాగుంది. ముఖ్యంగా వందేమాతరం లిరిక్స్ చాలా బాగున్నాయి. . దీపిక, హృతిక్ రోషన్ ప్రేమ ను సైలెంట్ గా చూపిస్తూ చిత్రీకరించిన పాట " దిల్ బనానే వాలేయ" పాట వినడానికి చూడ్డానికి బాగుంది
ఈ సినిమాలో హృతిక్ షంషేర్ పఠానియా అలియాస్ ప్యాటి పాత్రకు సరిపోయాడు, కానీ అనవసరమైన సన్నివేశాల వల్ల పాత చిత్రీకరణ చాలావరకు తేలిపోయింది.నటనాపరంగా అనిల్ కపూర్(రాకేష్ అలియాస్ రాకీ సింగ్), కరణ్ సింగ్ గ్రోవర్(తాజ్), దీపిక( మినాల్ అలియాస్ మిన్ని) సినిమాను కొంతవరకు నిలబెట్టారు.
అయితే సినిమాకి ఇంకొక మైనస్ ఏంటంటే వీరిద్దరి మధ్య ప్రేమను చూపించడం. ఇంతకుముందు ఐదు మంచి రొమాంటిక్ సినిమాలు తీసిన సిద్ధార్థ ఆనంద్ ఇక్కడ ప్రేమను ఎస్టాబ్లిష్ చేయడం, సున్నితంగా నడపడం లో సక్సెస్ కాలేకపోయాడు.
ఈ సినిమా కు కొంత మైనస్ అయిన విషయం మరొకటి ఉంది. ఆకాశంలో జరిగే ఫైటర్ పైలెట్ల మధ్య ఫైట్లు జనవరి 26 తారీకు రోజున జరిగే విన్యాసాల మాదిరి ఉండడం. అదేవిధంగా పాకిస్తాన్లో నెంబర్ వన్ ఫైటర్ పైలెట్ రెడ్ రోజ్ అనబడే ఇస్మాయిల్ తో ప్యాటి జరిపే సంభాషణలు, సీరియస్ నెస్ ను లేకుండా చేశాయి
ఇలాంటి సినిమాల్లో డైలాగు లకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అయితే హుస్సేన్, అబ్బాస్ దలాల్ ద్వయం రాసిన డైలాగులు అంతగా పేల లేదు. "జో అకేలా ఖేల్తా హై.. వో టీం కే ఖిలాఫ్ ఖేల్తా హయ్" (ఎవరైనా ఒక్కడే ఆడుతున్నాడు అంటే, అది జట్టుకు వ్యతిరేకంగా ఆడుతున్నట్టే), కుచ్ సఫర్ ఇతనే ఖూబ్సూరత్ హోతే హై కి మంజిల్ పౌంచ్ నేకా మన్ నహీ కర్తా" ( కొన్ని ప్రయాణాలు ఎంత అందంగా ఉంటాయంటే, గమ్యం చేరటానికి మనసు ఒప్పుకోదు) లాంటి ఒకటి రెండు థియేటర్లో కొంతమంది ప్రేక్షకుల స్పందనకి నోచుకోవచ్చు.
సాధారణంగా తెలుగు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది. ఆ విధంగానే సిద్ధార్థ " పఠాన్" సినిమా గత సంవత్సరం జనవరి 25న రిలీజ్ అయింది. అందుకేనేమో ఈ ఏడాది కూడా ఫైటర్ సినిమాను అదే రోజు రిలీజ్ చేయడం సెంటిమెంట్ ఏమో.
చివరగా సిద్ధార్థ గతంలో తీసిన సూపర్ యాక్షన్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అంత గొప్పగా లేకపోయినా, విజువల్ ఎఫెక్ట్స్ తో మిళితమైన కథను చెప్పిన పద్ధతి కూడా అంత బాలేకపోయినా, ఫ్యాన్స్ అయినా కాకపోయినా, చూడవచ్చు.
తారాగణం:
నటీనటులు :హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్, రిషబ్ జాని
కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు
సంగీతం: విశాల్,శేఖర్
ఫోటోగ్రఫీ: సచిత్ పాలోస్
మాటలు;హుస్సేన్ దలాల్,అబ్బాస్ దలాల్
పాటలు : కుమార్
ఎడిటింగ్:ఆరిఫ్ షేక్
నిర్మాత దర్శకుడు: సిద్ధార్థ ఆనంద్
విడుదల తేదీ:25.01.2024