నిహారిక 'మద్రాస్ కారణ్' ఓటీటీ మూవీ రివ్యూ!
ఈ చిత్రం కథేంటి, ఇక్కడ మనవాళ్లు నచ్చే సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;
తెలుగు మార్కెట్ కోసం ఇతర భాషల సినిమా వాళ్లు మన ఆర్టిస్ట్ లను తీసుకెళ్తున్నారు. అయితే అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు కాదు కదా. తమిళంలో వచ్చిన చిన్న సినిమా కోసం నిహారిక ని తీసుకున్నారు. జనవరి 10 న తమిళంలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ ఓటీటీకి వచ్చింది. ఈ సినిమా కథేంటి, నిహారిక కెరీర్ కు ఏమైనా ప్లస్ అవుతుందా, ఈ చిత్రం కథేంటి, ఇక్కడ మనవాళ్లు నచ్చే సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
సత్య (షేన్ నిగమ్) తను ఇష్టపడిన మీరా (నిహారిక)తో పెళ్లికి తన ఫ్యామిలీని ఒప్పిస్తాడు. తను ఉంటున్న చెన్నై నుంచి తన అసలు ఊరు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. మీరా కుటుంబం కూడా సరే అని అక్కడికి చేరుకుంటారు. అయితే పెళ్లి కు ముందు రోజు హోటల్లో దిగిన మీరా కాల్ చేయడంతో, ఆమె దగ్గరికి బయలుదేరతాడు సత్య.
ఆ ప్రయాణంలో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. ఒక గర్భవతిని సత్య కారు ఢీ కొడుతుంది. దాంతో అక్కడివారంతా సత్యపై చేయి చేసుకుంటారు. సత్య ఆ గర్భవతిని హాస్పిటల్లో చేరుస్తాడు. ఈ లోగా పోలీసులు వస్తారు. అంతేకాదు ఆ ఊళ్లోని వాళ్లంతా చాలా ఆవేశంగా ఎటాక్ చేస్తుండటంతో తన ఫ్రెండ్స్ కు కాల్ చేస్తాడు. మరో ప్రక్క హాస్పిటల్ లో టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆ గర్భవతి, ఆమె కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏమవుతుంది. ఏమి జరుగుతుందనే భయం సత్యలో మొదలవుతుంది. ఏదైనా జరిగితే అక్కడ వారు ఊరుకునేలా లేరు.
అక్కడ ఆ ఊరి జనం ఆవేశపరులు గా ఉండటంతో, తన స్నేహితులకు సత్య కాల్ చేస్తాడు. మరో ప్రక్క ఆ గర్భవతి భర్త సింగం ( కలైయరసన్) అంటే ఆ ఏరియాలో అందరికీ భయమే. అలాగే కల్యాణి అన్నయ్య మణిమారన్ కూడా ఓ రౌడీ. వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్ కు చేరుకుంటారు.ఇక ఎంతసేపైనా పెళ్లి మంటపానికి సత్య రాకపోవడంతో అంతా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి సిట్యువేషన్ లో ఆ గర్బవతికి గానీ .. ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఏం జరుతుంది. ఆ క్రమంలో జరిగే సంఘటనలు ఏమిటి ? ఆ సంఘటన చివరకు ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? ఫైనల్ గా మీరా - సత్య పెళ్లి జరుగుతుందా .. లేదా ? అనేది కథ.
ఎలా ఉంది
ఈ సినిమా అప్పుడెప్పుడో వచ్చిన సూపర్ హిట్ కిరీటం (తెలుగులో రౌడీయిజం నశించాలి) లాంటిది. ఆనందంగా జీవితం జరుగుతున్న సమయంలో చిన్న అనుకోని ప్రమాదం ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటనలు ప్లే చేస్తుంది అనేది అసలు కథాంశం. అయితే ఈ సినిమాలో సీన్స్, ట్విస్ట్ మారింది. అయితే ఆ ట్విస్ట్ ని ఇవ్వడానికి కూడా చాలా టైమ్ తీసుకోవడం,అక్కడికి చేరే విధానం విసుగెత్తిస్తుంది. పోనీ ఆ ట్విస్ట్, కథకు ఇచ్చే కొత్త రిజల్యూషన్ కంటెంట్‌కి మమ్మల్ని కట్టిపడేసేలా లేదు. క్యారక్టర్స్ ఎక్కువై, హీరో, హీరోయిన్స్ కథ చిన్నదైన ఫీలింగ్ వస్తుంది. ఓ టీవీ సీరియల్ తరహాలో తమిళ అతి కొంత విసుగిస్తుంది. డైరెక్టర్ ఇంటెక్షన్ ఒకటే..అయ్యో సత్య అనిపించాలి. అందుకోసం చాలా ఎమోషనల్ సీన్స్ రాసుకున్నారు. కానీ అక్కడదాకా అలా కథ మెల్లిగా సాగుతున్నట్లు తెలుసుకోలేకపోయారు. అయితే సత్యకు జరిగే సిట్యువేషన్స్ నిజంగా బాధ కలిగించేవే.
అయితే వాటిని అలా సాగదీస్తూ పోతుంటే మనకు సినిమా చూస్తున్నప్పుడు కూడా కథ కన్నా కూడా చూస్తున్నందుకు బాధ కలుగుతుంది. చాలా వరకు నెక్స్ట్ వచ్చే సీన్స్ తెలిసిపోతుంటాయి. కొన్ని క్యారెక్టర్ ఓవర్ యాక్షన్ కూడా మనని కుదురుగా కూర్చో నివ్వదు. స్క్రిప్టు సమస్యే ఈ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. ఏదైమైనా మితి మీరిన స్పూడ్ ఫీడింగ్ ఈ కాలం ప్రేక్షకులకు నచ్చదనే విషయం రాస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ డైరెక్టర్ గుర్తించలేదు. మన చుట్టూ ఉన్న సొసైటీ, అలాగే మన జీవితం చాలా విషాదమైన. చాలా జాగ్రత్తగా దానితో డీల్ చేయాలి. ఏ మాత్రం అదుపు తప్పినా తిరగబడుతుందనే సందేశం సందేహం లేకుండా ఈ డైరెక్టర్ మనకు ఇస్తాడు.
ఎవరెలా చేశారు
ఈ సినిమాలో నిహారిక పాత్ర చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇక్కడ డబ్బింగ్ చేసి థియేటర్ లో రిలీజ్ చేసినట్లు లేరు. అలాగే కీలక పాత్రలైన షేన్ నిగమ్ .. కలైయరసన్ .. ఐశ్వర్య దత్త తమ పాత్రలకు న్యాయం చేసారు. మిగతావాళ్లలో అంత గుర్తించుకునేంటంత ఏమీ లేదు.
ఇక టెక్నికల్ గా ప్రసన్న కుమార్ ఫొటోగ్రఫీ బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం నడిచిపోతుంది. 'థీమ్ మ్యూజిక్' బాగుంది. వసంత్ కుమార్ ఎడిటింగ్ సెకండాఫ్ ని షార్ప్ చేయాలనిపిస్తుంది. కథే మెల్లిగా నత్త నడక నడుస్తుంది. సినిమాలో పెద్దగా ఏమి జరిగినట్లు ఉండదు. అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
చూడచ్చా
నిహారిక కోసం అయితే ఈ సినిమా మొహమాటం లేకుండా పక్కన పెట్టేయచ్చు. ఇక మీరు ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది.
ఎక్కడ చూడచ్చు
ఆహా ఓటీటీ లో తెలుగులో ఉంది