'హరి హర వీర మల్లు' బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌కు అసలు కారణం ఎవరు?

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం 'హరి హర వీర మల్లు:;

Update: 2025-07-28 10:53 GMT

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' . దాదాపు అయిదేళ్ల చిత్రీకరణ తర్వాత.. భారీ అంచనాల మధ్య జులై 24న థియేటర్లలో విడుదలైంది. ఓపినింగ్స్ బాగా వచ్చాయి. అయితే మార్నింగ్ షో కే దారుణమైన టాక్ వచ్చేసింది. దాంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఓ పెద్ద డిజాస్టర్ వైపు వెళ్తోంది. సినిమా పరాజయానికి పలు కారణాలు ఉన్నా... ఈ సినిమా పరాజయానికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది.

* పవన్ కల్యాణ్ కారణంగానే హరి హర వీర మల్లు పరిస్థితి ఇలా అయ్యిందా?

ముందుగా ఓ విషయం చెప్పు కోవాలి… ఈ సినిమా పూర్తిగా మొదట అనుకున్న క్రిష్ దర్శకత్వంలో, మొదట ఉన్న ప్లాన్‌ప్రకారం జరిగినా ఉంటే, ఈ రోజు ఈ స్థాయిలో ఇంత దారుణంగా డిజాస్టర్ అనే వినిపించి ఉండేది కాదనేది కొందరి మాట. కానీ అది జరగలేదు.

పవన్ కల్యాణ్‌, దర్శకుడు జ్యోతి కృష్ణ మొదటి రాసిన స్క్రిప్ట్‌లో జోక్యం చేసుకుని మార్పులు చేయడం జరిగింది. అలాగే దర్శకత్వం మార్పులు జరగటం, విఎఫ్ ఎక్స్ బాగోలేకపోవటం, … ఇవన్నీ కలసి సినిమా దారితప్పేలా చేశాయనేది ఓ వర్గం చెప్తున్న మాట . ఫ్యాన్స్‌లో కొంతమంది కూడా ఒప్పుకుంటున్నారు – సెకండాప్ లో కనిపించే 'సనాతన ధర్మ' థీమ్ మొత్తం పవన్ సూచనల ప్రభావమే అని ఇండస్ట్రీ అంటోంది.

మరో ప్రక్క ఈ మూవీ విడుద‌లైన త‌ర్వాత కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ల విష‌యంలో సోషల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ దీని గురించి కొన్ని విష‌యాలు పంచుకున్నారు. అలాగే ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ ప్రాజెక్టు నుంచి వైదొల‌గ‌డానికి గ‌త కార‌ణాన్ని కూడా ఆయ‌న తెలియ‌జేశారు. అంతేగాక వీర‌మ‌ల్లును మొద‌ట కామెడీ సినిమాగా తీయాల‌నుకున్న‌ట్లు జ్యోతికృష్ణ చెప్పారు.

* దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ...

"నేను ఈ సినిమా ప్రారంభం నుంచి ఉన్నాను. కోహినూర్ ప్ర‌ధానాంశంగా సాగే ఈ క‌థ‌ను కామెడీ సినిమాగా రూపొందించాల‌ని భావించారు. మాయా బ‌జార్ స్టైల్‌లో తెర‌కెక్కించాల‌ని క్రిష్ అనుకున్నారు. అలాగే దీన్ని ప్రారంభించాం. మొద‌ట ఓ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను తీశాం. త‌ర్వాత క‌రోనా వచ్చింది. మ‌ళ్లీ మ‌రో యాక్ష‌న్ సీక్వెన్స్ తీశాక సెకండ్‌వేవ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల‌తో వ‌రుస విరామాలు వ‌చ్చాయి.

క్రిష్ కోసం ఏడాది వేచి చూశారు. ఆయ‌న‌కు అంత‌కుముందే అంగీక‌రించిన ప్రాజెక్టులు ఉండ‌డంతో వైదొలిగారు. ఆ త‌ర్వాత క‌థ‌ను నేను రెండు పార్ట్‌లుగా తీస్తాన‌ని ప‌వ‌న్‌కు వివ‌రించా. బాగుంది.. నువ్వే ద‌ర్శ‌క‌త్వం వ‌హించు అని ప‌వ‌న్ అన్నారు. అక్క‌డి నుంచి నా జ‌ర్నీ ప్రారంభ‌మైంది. నేను మొద‌టి భాగం క‌థ‌లో మార్పులు చేశాను.

క్రిష్ అనుకున్న కోహినూర్ క‌థ పార్ట్‌-2లో వ‌స్తుంది. కోహినూర్ కోసం అస‌లేం జ‌రిగింది అనేది చూపించ‌నున్నాం. ఇక‌, వీఎఫ్ఎక్స్ వియానికి వ‌స్తే.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కోసం 4399 సీజీ షాట్స్ వాడాం. వాటిలో 4, 5 షాట్స్ బాగా రాలేదు. వాటిని కూడా మార్చాం" అని చెప్పుకొచ్చారు.

* జ్యోతి కృష్ణను తీసుకురావడమే పెద్ద పొరపాటు?

అంత పెద్ద హిస్టారికల్ సినిమాకి జ్యోతి కృష్ణను డైరెక్టర్‌గా ఎంపిక చేయడమే మొదటి దశలో చేసిన అతి పెద్ద తప్పు. AM రత్నం స్వయంగా చెప్పినట్లు, జ్యోతి కృష్ణను onboard చేసేందుకు పవన్‌కల్యాణ్‌నే వెనుక ఉన్నారు.

జ్యోతి కృష్ణ గత చిత్రాలు చూస్తేనే అర్థమవుతుంది – ఆయన పెద్ద టెక్నికల్ వ్యాల్యూస్‌ ఉన్న సినిమాలను నడిపించగల సామర్థ్యం గల డైరెక్టర్ కాదని.

* స్క్రిప్ట్‌కి అనవసర మార్పులు… డైరెక్టర్ల మార్పుల వల్లే కంటెంట్ కి దెబ్బ

క్రిష్ ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టారు. టెక్నికల్‌గా సినిమాను అద్బుతంగా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకెళ్లారు. కానీ ఆ స్క్రిప్ట్‌లో అనవసర మార్పులు చేసి, కథను గందరగోళం చేశారు.

జ్యోతి కృష్ణ వచ్చాక స్క్రిప్ట్‌లో మార్పులు, ప్యాచులా వచ్చిన ట్రీట్‌మెంట్, టోన్ మార్పులు… ఇవన్నీ సినిమా ఎమోషన్‌ను దెబ్బతీశాయి.

*కొన్ని సన్నివేశాలు సినిమా నుంచి తొలగింపు

సినిమా రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ రావటంతో హీరో, అతడి అనుచరులు కొండ అంచున గుర్రాలపై స్వారీ చేసే సీన్‌ను కుదించారు. అలాగే జెండా సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారు. పవన్‌ బాణాలు సంధించే యాక్షన్‌ సీన్‌లో చిన్నచిన్న మార్పులు చేశారు. క్లైమాక్స్‌ లెంగ్త్ కూడా బాగా తగ్గింది. ఇలా మొత్తంగా 10 నుంచి 15 నిమిషాల ఫుటేజీని సినిమా నుంచి తొలగించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సవరించిన వెర్షనే ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సన్నివేశాల తొలగింపు గురించి చిత్ర టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

* తీరా ఫలితం చూస్తే – ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు

ఇప్పుడు సినిమా విడుదలై మూడు రోజులైనా… ఫ్యాన్స్‌ మౌనంగా ఉన్నారు. సోషల్ మీడియాల్లో రివ్యూలు పోస్టులు తగ్గిపోయాయి. ఇది ఓ నెగెటివ్ సిగ్నల్.

ఇది కేవలం బడ్జెట్ పైనో, ప్రచార లోపమో కాదు. సినిమా ఆత్మ (స్పిరిట్) కోల్పోయింది. దానికి కారణం – అసలు విజన్ నుంచి పక్కదారి పట్టిన ప్రొడక్షన్ ప్రాసెస్.

Tags:    

Similar News