‘రాజధాని ఫైల్స్’ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్! ఇంతకీ కథ ఏమిటీ?
ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భానుప్రకాశ్ తెరకెక్కించగా.. కంఠంనేని రవిశంకర్ నిర్మించారు.
‘‘రాజధాని ఫైల్స్’’ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదల చేసుకోవచ్చని నిర్మాతలకు అనుమతులు ఇచ్చింది. వాస్తవానికి ఈ సినిమా నిన్న విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు చెప్పింది.
ఏమిటి వివాదం...
సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని.. గత ఏడాది డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్ లో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమాను నిర్మించారని, దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించారు. ఈ పిటిషన్ నిన్న (గురువారం) విచారణకు వచ్చినప్పుడు కోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తన ముందుంచాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ (శుక్రవారం) విచారణకు వచ్చింది. సీఎం, ప్రభుత్వం ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. స్టేను కొనసాగించాలని కోరారు. అయితే స్టే కొనసాగించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. నిరభ్యంతరంగా సినిమాను విడుదల చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజధాని ఫైల్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్వహకులు సన్నాహాలు చేపట్టారు.
నిన్ననే విడుదలై ఆగిన సినిమా...
కాగా.. ఈనెల 15న సినిమా విడుదల కావాల్సి ఉంది. హైకోర్టు స్టే తో విడుదల ఆగిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా నిర్వహకులు.. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లను కోర్టుకు సమర్పించారు. దీంతో అన్ని సక్రమంగానే ఉన్నాయని, సినిమా విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భానుప్రకాశ్ తెరకెక్కించగా.. కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు.
అమరావతి రాజధాని చుట్టూ తిరిగిన కథ
రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని అమరావతి నిర్మాణం కోసం మూడు పంటలు పండే తమ పంట పొలాల్ని నిస్వార్థంగా ఇస్తే ఆ రైతులకు కన్నీళ్లే ఎదురయ్యాయి. ఊళ్లు బాగుపడతాయని... భావి తరాల భవిష్యత్తు బాగుంటుందని... కళ్ల ముందు అమరావతి కలల సౌధాలు సాకారమవుతుంటే చూడాలనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. బిడ్డని పొదిగే గర్భంలో గొడ్డలి దించిన కర్కశత్వంలా ఒక్కరి అహం కోట్ల మంది కలల్ని... వేల మంది రైతుల జీవితాల్ని కాలరాసినట్లయింది. అమరావతి రైతులు ఉద్యమబాట పట్టారు. న్యాయస్థానాలు మొదలుకొని దేవస్థానాల వరకూ వెళ్లి వాళ్ల ఆక్రందనను బయట పెట్టారు. ఇప్పటికీ సాగుతున్న ఆ ఉద్యమ స్ఫూర్తితోనే రాజధాని ఫైల్స్ చిత్రం తెరకెక్కింది.
కత్తి గుర్తు అంటూ పేరు...
అరుణప్రదేశ్ రాష్ట్రంలో కత్తి గుర్తు కె.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచాక నిర్మాణ దశలో ఉన్న అయిరావతిపై కత్తి కడుతుంది. ఎవరో కన్నబిడ్డకి మీరు తండ్రిగా ఉండటమేంటి అంటూ తన రాజకీయ వ్యూహకర్త చెప్పిన మాట విని ముఖ్యమంత్రి అధికార వికేంద్రీకరణ అంటూ నాలుగు రాజధానుల పల్లవి అందుకుంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిరావతి నిర్మాణాన్ని సమ్మతించిన అదే వ్యక్తి, అధికారంలోకి రాగానే మాట మార్చడంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన బాట పడతారు. తన అధికార బలంతో ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతాడు. ముఖ్యమంత్రికి మరో ఇద్దరు ఎంపీలు తోడై రైతుల మానప్రాణాలతో చెలగాటమాడతారు. ఎంతోమంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతారు. అయినా ధైర్యం కోల్పోని రైతులు ఉద్యమాన్ని కొనసాగించినా ముఖ్యమంత్రి దిగిరాకపోవడంతో అరుణప్రదేశ్‌లోని తెలుగు ప్రజలు ఏం చేశారు? ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? రైతులకు ప్రతినిధులుగా ఉన్న ఓ కుటుంబం (వినోద్‌కుమార్, వాణీ విశ్వనాథ్, అఖిలన్) ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.