'ఫతే' లాభాలు ప్రజలతో పంచుకుంటా: మరో చరిత్ర సృష్టించిన సోను సూద్
ఫతే సినిమాతో మొదటిసారి దర్శత్వం వహిస్తున్న సోనూ సూద్ ఆ సినిమా లాభాలు వృద్దాశ్రమాలు,అనాథాశ్రమాలకు ఇస్తానని ప్రకటించారు;
By : Srungavarapu Rachana
Update: 2025-01-08 07:29 GMT
'వదలా బొమ్మాలి ...నిన్ను వదలా ' అంటూ తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఒక రియల్ విలన్ పాత్రగా నిలిచిపోయేలా నటించారు సోనూసూద్. పంజాబ్ లో పుట్టి, నాగ్ పూర్ లో పెరిగిన ఈ నటుడు, తెలుగులో 'సూపర్', 'అతడు' సినిమాలతో హీరోలకు ధీటైన విలన్ అంటే ఇతడే అనే ఒక ప్రత్యేక ముద్రను సృష్టించుకోగలిగాడు. అరుంధతిలో పశుపతిగా నటించి విలనిజానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. అటూ తెలుగు, ఇటు తమిళ్ ,ఇంకో పక్క హిందీ మొత్తం మీద దక్షిణాది సినిమాల్లోనూ , బాలీవుడ్ లోనూ కూడా నటిస్తూ నటనా వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు. ఆయన కృషికి గుర్తింపుగా నంది, ఫిలిం ఫేర్ లాంటి ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి. ఇది ఆయన సినిమాటిక్ జర్నీ. సోనూ సూద్ తెరపై విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా ప్రజల మనస్సులో నిలిచిపోయే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు.
కోవిడ్ సమయం నుండి ఆయన పేరు దేశమంతటా మారుమ్రోగిపోయింది.లాక్ డౌన్ సమయంలో సొంత ఊళ్లకు వెళ్ళడానికి ఇబ్బంది పడిన వేల మంది వలస కార్మికులకు సోనూసూద్ ఆసరా అందించారు. తన సొంత ఖర్చుతో ఎంతోమందిని వారి వారి ఊళ్ళకి చేర్చారు. ఇంకా చెప్పాలంటే కొందరికి స్వయం ఉపాధి కూడా కల్పించారు. తర్వాత కరోనా రెండవ దశలో ఎంతో మందికి అవసరమైన ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, రెమ్‌డెసివర్ ఇంజిక్షన్లు తదితర వైద్య సదుపాయాలు అందించారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. పోయిన సంవత్సరం వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంటే ఆంధ్రాకి ,తెలంగాణకి కలిపి 5 కోట్లు విరాళం ప్రకటించారు.
ఈ జనవరి 10నుండి పెద్ద సినిమాల విడుదల సందర్భంలోనే సోనూ సూద్ మొదటి సారి దర్శకత్వం వహించిన 'ఫతే' సినిమా విడుదల కాబోతుంది. సోనూ సూద్ భార్య ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఎంతోమంది మోసపోవడానికి కారణమవుతున్న సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఈ సినిమాలో ప్రముఖ నటులైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా ,సోను సూద్ తో కలిసి నటించారు. సోనూ సూద్ తన మొదటి సినిమానే ప్రజలకు అవగాహన కల్పించే సామాజిక ప్రయోజనం ఉండేలా జాగ్రత్త తీసుకుని కథ ఎన్నుకున్నారు. అంతటితో ఆగిపోకుండా ఈ సినిమా నుండి వచ్చే లాభాలను కూడా వృద్ధాశ్రమాలకు,అనాథాశ్రమాలకు ఇస్తామని సోనూ సూద్ ప్రకటించారు.
సినిమాల్లో ఏ పాత్రలు పోషించినా రియల్ లైఫ్ లో మాత్రం దేశంలో ఏ ఆపద సంభవించినా ముందడుగు తానే వేస్తూ, రియల్ స్టార్ గా నిలుస్తున్న సోను సూద్ గురించి మీ అభిప్రాయం ఏంటి మరి?
* * *