ది కాన్వర్జేషన్ – లోతైన మానసిక కలవరాన్ని వ్యక్తీకరించే అనుభూతి

నన్ను వెంటాడిన సినిమాలు-8 (ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్);

By :  RamC
Update: 2025-04-09 11:55 GMT

నేను జీవితంలో చాలామందిని చూసాను, ఉన్న నైపుణ్యాన్ని బలంగా మార్చుకొని ఎదిగి, అన్ని సంపాదించుకొని, అదే దాంతో సర్వ నాశనమవ్వడం చూసాను. ఇందులో చదువు, క్రీడలు, వ్యాపారం, కళలు, వాక్చాతుర్యంతో, చేతివ్రాత, అందం, డబ్బు, వంట ,శృంగారం ఇలా బలాల భారం కింద పడి బలహీనులైపోయిన సంఘటనలు నన్ను బాగా ఆకట్టుకొనే కథలు. ఇందుకు కారణాలు అన్వేషిస్తే ప్రతి ఒక్కరిది గొప్పగా మొదలై ముగిసే దుగ్ద జీవితాలే.

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా (Francis Ford Coppola) దర్శకత్వంలో వచ్చిన ది కాన్వర్జేషన్ (The Conversation) ఒక సాధారణ థ్రిల్లర్ కాదు, ఇది మౌనం, గోప్యత, guilt , పశ్చాత్తాపం మధ్య నడిచే ఒక మనిషి అంతర్ముఖ ప్రయాణం. ఇది అమెరికాలోని వాటర్ గేట్ కుంభకోణం (Watergate Scandal) కాలంలో రూపొందిన చిత్రమైనప్పటికి, నేటి డిజిటల్ ( digital era)లో సామీప్యత ఉన్న చిత్రంగానే ఉంటుంది. సాంకేతిక నైపుణ్యంలో అత్యుత్తముడైన వ్యక్తి, అదే నైపుణ్యం అతనిని లోపల్నుండి ఎలా కుదిపేస్తుందో, తననే తాను శత్రువుగా మార్చుకుంటే ఎలా ఉంటుందో ఈ చిత్రం సున్నితంగాను , శక్తివంతంగాను చూపిస్తుంది. ఈ సినిమా లోతైన మానసిక కలవరాన్ని వ్యక్తీకరించే అసాధారణ అనుభూతి.

హ్యారీ (Gene Hackman) ఓ సర్వేలెన్స్ ( surveillance) రంగంలో అత్యున్నత నిపుణుడిగా గుర్తింపు పొందినవాడు.పైకి ఇది నైపుణ్యం అయినా, నమ్మకం ,నిబ్బద్దత అతని పనికి కేంద్రం, గౌరవం కూడాను.అతని జీవితం స్పష్టమైన నియమాలపై ఆధారపడి ఉంటుంది; వినాలి, రికార్డ్ చేయాలి, కానీ ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు, ఇంకో కాపీ తయారుచేయకూడదు, విన్న వాటి గురించి ఆలోచించకూడదు, ఎవరితోనూ పంచుకోకూడదు. అతను తన ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్య దాచుకుంటాడు, ఎవరిని నమ్మడు. కానీ ఒకసారి ఓ పనిలో భాగంగా, ఓ జంట మధ్య జరిగిన సాధారణ సంభాషణను రికార్డ్ చేసిన వెంటనే అతని లోపల ఓ వింత కదలిక మొదలవుతుంది. అదే మాటలు, అదే శబ్దం, కానీ విన్న ప్రతి సారి అర్థం మారుతుంటుంది. ఆ శబ్దాలు అతని అంతరాత్మను కుదిపేస్తాయి. కల్లోలానికి గురిచేస్తాయి.

ఈ సినిమాలో అసలైన కథానాయకుడు ధృఢం . “He’d kill us if he got the chance” అనే ఓ వాక్యం, మొదట సాధారణంగా వినిపించినా, క్రమంగా అది ప్రమాద సూచనగా మారుతుంది. మాటలకు సంధర్భం ఆధారంగా అర్థం ఏర్పడుతుందన్న అంశాన్ని కపోలా అద్భుతంగా హైలైట్ చేశాడు. శబ్దం ఎడిటింగ్ ద్వారా ప్రేక్షకుడికి కథను వినిపించేటట్లు కాకుండా, అనుభూతి చెందేలా చేస్తాడు. టెక్నాలజీ మానవతతో కలిసినప్పుడు ఎంత బలమైన ప్రభావాన్ని కలిగించగలదో ఈ చిత్రం నిరూపిస్తుంది.

హ్యారీ గతంలో చేసిన ఒక పొరపాటుతో కొందరి ప్రాణాలు పోయిన బాధ అతని మనసు నిండా ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ ఎదురవుతుందన్న భావన అతన్ని మానసికంగా ముక్కలు చేస్తుంది. surveillanceలో తాను రకరకాల పరికరాలను ఉపయోగించి ఎలా అనుమానం రాకుండా మాటలను వింటాడో, ఇప్పుడతనికి నాపుణ్యం తనను ఎవరో గమనిస్తున్నారని, తాను మాట్లాడుతున్నది ఎవరో రహస్యంగా వింటున్నారని అనుమానంతో, తన ఇంటినే తానే ధ్వంసం చేస్తాడు. గోడలు, ఫర్నిచర్, పరుపులు, వస్తువులన్నీవిరిచి, పగలగొట్టి, చించి చూస్తూ ఆ రహస్య వస్తువుల కోసం వెదకసాగుతాడు. చివరకు తాను వెదుకుతున్న మైక్ అతని లోపలే ఉందని తెలుస్తుంది. అలా గ్రహించడంతో, ఆ మౌనం అతను రికార్డ్ చేసిన శబ్దం కన్నా గట్టిగా అరుపుగా గొగ్గోలు పెడుతుంది. అతన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది.

ది కాన్వర్జేషన్ ఒక హెచ్చరిక. నైపుణ్యం అర్థం చేసుకోవడం ఓ బాధ్యతని, ఈ సినిమా మనకు గుర్తు చేస్తుంది. హ్యారీ కావుల్ లాంటి పాత్రలు నేటి టెక్నాలజీ ప్రపంచంలోనూ కనిపిస్తారు, వారు వ్యవస్థలు నిర్మించగలగుతారు, కానీ దాని ప్రభావాల గురించి ఆలోచించరు. ఈ సినిమా ఒక గూఢచారి కథ కాదు, ఇది మనోగూడు వ్యథ. మనం మనతో తలపడే అంతర్ముఖ క్షణం. రణం. హ్యారీ మనల్ని గమనించడు, కానీ మనల్ని మనమే గమనించుకునే అద్దంలా నిలుస్తాడు.

అది మనలోని భయం, ఒంటరితనం, లోతైన ఆత్మవిమర్శకు ప్రతీక. ఈ సినిమా చూసిన తర్వాత అది మన ఆలోచనల్లో నిలిచి, మనమంతట మనమే ఎదుర్కోవాల్సిన మౌనాన్ని గుర్తు చేస్తుంది. అందుకే ది కాన్వర్జేషన్ మనతో ఎప్పటికీ నిలిచిపోయే నిశబ్ద సంఘర్షణతో మలచిన సంభాషణ.

Tags:    

Similar News