‘కాంతార చాప్టర్ -1’ పై కర్ణాటక ప్రభుత్వం నిషేధం?
అటవీ అనుమతుల ఉల్లంఘనలపై ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీ చేయాలని ఆదేశాలు;
By : The Federal
Update: 2025-01-21 04:41 GMT
శాండల్ వుడ్ లో సంచలన విజయం సాధించిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా వస్తున్న ‘ కాంతారా చాప్టర్ -1’ పై నిషేధం విధిస్తామని కర్ణాటక అటవీశాఖామంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సోమవారం తెలిపారు. కొన్ని రోజులగా రాష్ట్రంలోని హసన్ జిల్లాలో గల అటవీ ప్రాంతంలో ఈ చిత్రం నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే చిత్ర బృందం పలు నిబంధనలు ఉల్లఘించిందని, వన్య ప్రాణులు, వృక్ష, జంతుజాలలకు నష్టం కలిగించిందనే ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. దీనితో తనిఖీలు చేసి నిజం రుజువైతే చిత్రంపై నిషేధం విధిస్తామని సంబంధిత మంత్రి హెచ్చరించారు.
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షూటింగ్ సమయంలో పేలుడు పదార్థాలను ఉపయోగించి పరిసర ప్రాంతాలలో పర్యావరణానికి హానీ చేస్తున్నారని గవిబెట్ట, హేరుర్ గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేసినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. చిత్రీకరణకు కేవలం కొద్ది ప్రాంతమే అనుమతి ఇచ్చినప్పటికీ యూనిట్ మాత్రం డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లి షూట్ చేస్తున్నట్లు వినికిడి.
ఆ ప్రాంతం అడవి ఏనుగులకు పెట్టింది పేరు. తరుచుగా బాంబు పేలుళ్లు వినిపించడంతో అవి పంటపొలాలవైపు వస్తున్నాయి. దీనితో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అడవులను కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇకనైన తమకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీకి చెందిన వ్యక్తి ఓ సందేశంలో చెప్పాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
విధాన సౌధ లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఖండ్రే సమాధానం ఇచ్చారు. గవిబెట్ట చుట్టుపక్కల రక్షిత అటవీ అంచులలో 23 రోజుల పాటు షూటింగ్ చేసుకోవడానికి హోంబలే ఫిల్మ్ బృందం అనుమతి కోరినట్లు చెప్పారు. ఇందుకు గాను హసన్ డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చారని తెలిపారు.
అయితే షూటింగ్ సమయంలో కాంతారా చిత్ర బృందం పేలుడు పదార్థాలను ఉపయోగిస్తోందని, ఇది వన్య ప్రాణులను కలవరపెడుతోందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనితో మంత్రి షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. దీనిపై స్థానికులు యెసలూర్ పోలీస్ స్టేషన్ లో సైతం కేసు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.