జీతూ జోసెఫ్ 'మిరాజ్' మూవీ రివ్యూ!
ట్విస్టులు ఎక్కువ, టెన్షన్ తక్కువ
అభిరామి (అపర్ణ బాలమురళి) — రాజశేఖర్ అనే బిజినెస్ టైకూన్‌కి చెందిన కార్పొరేట్ సంస్దలో ఒక సాధారణ ఉద్యోగి. ఆ గ్లాస్ గోడల మధ్య, మృదువైన లైట్ల కింద ఆమె జీవితం స్తబ్ధంగా సాగుతుంది… ఆ స్తబ్ధతని భంగం చేసే వ్యక్తి — కిరణ్ (హకీమ్ షాజహాన్). ఆఫీస్ చాటింగ్‌ల మధ్య మొదలైన పరిచయం, కొద్దికొద్దిగా ప్రేమగా మారుతుంది.
కానీ ఆ ప్రేమలో కూడా ఒక నీడ ఉంది. ఆమె స్నేహితురాలు రీతూ ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది — “కిరణ్ నమ్మదగిన వాడికాడు, అబ్బే అతనికి ఏదో ఉంది…” కానీ ప్రేమకి లాజిక్ తెలియదు కదా — అభిరామి ఆ మాట పట్టించుకోదు.
ఒక రోజు... పాలక్కాడ్ రైల్వే ప్రమాదం. స్క్రీన్‌పై పొగమంచులో కరిగిపోయిన దేహాలు… అందులో కిరణ్ కూడా. చూడలేని స్థితిలో ఉన్న డెడ్ బాడీ, కానీ అతని వస్తువులు మాత్రం ఆపాదమస్తకం “అతనే” అని చెప్పేస్తాయి. అభిరామి నిశ్శబ్దమవుతుంది — “మిరేజ్” మొదలవుతుంది.
కొన్ని రోజుల తర్వాత, ఆమె తలుపు తట్టే మొదటి వ్యక్తి — ఎస్.పి. ఆర్ముగం (సంపత్ రాజ్). “కిరణ్ దగ్గర ఒక హార్డ్‌డిస్క్ ఉంది… అది ఇప్పుడు నీ దగ్గర ఉందా?” ఆ స్వరంలో ఉన్న కఠినత… ఆ ప్రశ్నలో ఉన్న రహస్యం… తర్వాత మరొకరు ఆమె తలుపు తడతారు — అశ్విన్ (అసిఫ్ అలీ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్.అతని డైలాగ్ నిశ్శబ్దాన్ని చీలుస్తుంది — “పోలీసులను నమ్మొద్దు… ఆ హార్డ్‌డిస్క్ నాకే ఇవ్వు. లేకపోతే నువ్వు కూడా కనిపించవు.”
స్క్రీన్ మళ్లీ డార్క్ అవుతుంది. మూడో ప్రవేశం — రియాజ్ (శరవణన్). రాజశేఖర్ ప్రధాన అనుచరుడు. సిగరెట్ పొగలోంచి కనిపించే అతని కళ్లలో ఒక హెచ్చరిక ఉంది — “ఆ హార్డ్‌డిస్క్‌ను మీడియాకు ఇస్తే చాలు… నీ కథ ముగుస్తుంది.” ఆ క్షణం నుంచి సినిమా ఒక సైలెంట్ ఛేజ్‌గా మారుతుంది. అభిరామి కళ్ళల్లో నమ్మకం, భయం, అనుమానం — అన్నీ కలిసి నడుస్తాయి. అది కాంతి, నీడ మధ్య ఆడే నిగూఢమైన మానసిక ఆట గా మారుతుంది.
ఇంతకీ “ఆ హార్డ్‌డిస్క్‌లో ఏముంది?” కిరణ్ నిజంగానే చనిపోయాడా… లేక అతను ఇంకా ఈ మిరేజ్‌లోనే ఉన్నాడా? అభిరామి ఎవరిని నమ్ముతుంది?నమ్మాలి...చివరకి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
ఈ సినిమా వాస్తవానికి ఒక మిస్టీరియస్ డెత్ ఇన్వెస్టిగేషన్. అశ్విన్ అనే జర్నలిస్టు ఒక యువతి అభిరామికి సహాయం చేస్తూ ఆమె ఫియాన్సే మరణం వెనుక ఉన్న కుట్రని వెలికితీసే ప్రయత్నం చేస్తాడు. కథ కాగితంపై చూస్తే ఇది ఒక సైక్లాజికికల్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది, కానీ జీతూ జోసెఫ్ రైటింగ్ దానిని క్రమంగా డైలాగ్ డ్రైవెన్ ఎమోషనల్ డ్రామాగా మార్చేస్తుంది.
ముఖ్యంగా విజువల్ స్టోరీ టెల్లింగ్ కన్నా verbal exposition మీద ఆధారపడటమే ఇబ్బంది పెడుతుంది. సంభాషణల ద్వారానే ప్రతి మిస్టరీ వివరిస్తూంటారు. దాంతో చూసేవారికి పెద్దగా థ్రిల్లింగ్ గా ఏమీ అనిపించదు. అలాగే ఏదీ కొత్తగా అనిపించదు. ఈక్రమంలో ఫస్టాప్ సస్పెన్స్ కంటే “వివరణ”గా తయారైంది.
ఇంటర్వెల్ తర్వాత కొత్త ట్విస్టులు వస్తాయి — కానీ వాటికి ఫోర్‌షాడోయింగ్ లేదు. కథ ఎటు వెళ్తుందో ప్రేక్షకుడికి క్లారిటీ లేకుండా, ట్విస్టులు కేవలం “షాక్ వాల్యూ” కోసం ఉన్నట్టు కనిపిస్తాయి.ఇక్కడ జీతూ జోసెఫ్ తన దృశ్యం-లాగే లాజికల్ లేయరింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఫౌండేషన్ బలహీనంగా ఉండడంతో అది ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తుంది.
క్లైమాక్స్ సమయంలో అన్ని లూజ్ ఎండ్స్‌ని క్లోజ్ చేసే ప్రయత్నం ఉంటుంది, కానీ అవన్నీ ముందే ఊహించగలిగేలా రాసినవి. ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ చేసి సస్పెన్స్ “డీకోడ్ చేయించడంలో” కాకుండా, కథకుడే “స్వయంగా చెప్పేయడంలో” సినిమా స్దబ్దంగా అనిపిస్తుంది. సినిమా యొక్క అతిపెద్ద లోపం — over-explanation. సినిమాని చూపించడం మానేసి, చెప్పే స్థాయికి వెళ్లిపోతుంది. “Show, don’t tell” అనే బేసిక్ స్క్రీన్‌రైటింగ్ రూల్ పూర్తిగా విస్మరించబడింది.
టెక్నికల్ గా..
జీతూ జోసెఫ్‌కి ఇష్టమైన long fake single shots ఇక్కడ కూడా కనిపిస్తాయి. టెక్నికల్‌గా మెరుగ్గా ఉన్నా, అవి కథలోకి అనుకున్న స్దాయిలో కలవలేకపోతాయి. విజువల్ సింబాలిజం లేని ఈ సినిమాటోగ్రఫీ కేవలం “ఎనర్జీ”ని చూపించడానికి మాత్రమే ఉపయోగించబడింది — చూసే వారికి క్లూలు లేదా ఆలోచన ఇవ్వడానికి కాదు.
ఫైనల్ థాట్
సినిమా పేరు Mirage — అంటే “భ్రమ” — దానికే సరిపోయేలా సినిమా కూడా కనిపిస్తుంది.Mirage చూడటానికి ప్రయత్నించే ప్రతి ప్రేక్షకుడికి ఒక దృశ్య భ్రమలా అనిపిస్తుంది — మొదట దూరం నుంచీ ఆసక్తికరంగా, మిస్టీరియస్‌గా కనిపిస్తుంది, కానీ దగ్గరగా వెళ్లిన కొద్దీ ఆ మాయ మాయమైపోతుంది. మొత్తానికి, Mirage అనేది “truth behind illusion” చెప్పాలనుకున్న సినిమా — కానీ చివరికి ఆ భ్రమలోనే చిక్కుకుపోయింది.
చూడచ్చా
దృశ్యం సినిమా డైరక్టర్ తీసిన సినిమా అని ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తే నిరాశ పడతారు. అలా కాకుండా ఓ సాదా సీదా థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే బాగానే ఉందనిపిస్తుంది.
ఎక్కడ ఉంది
సోనీ లివ్ ఓటిటిలో తెలుగులో ఉంది.