కమల్ హాసన్ ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) రివ్యూ

కమల్ అద్బుతమైన నటన కలిసి ఈ కాలం ప్రేక్షకుడి అభిరుచిని పట్టుకోగలిగాయా...అంచనాలను అందుకోగలిగిందా? చూద్దాం?;

Update: 2025-06-05 12:08 GMT

భారత సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ అధ్యాయాన్ని రచించిన దిగ్గజాలు కమల్,మణిరత్నం. వీళ్లిద్దరూ ఎప్పుడో 37 ఏళ్ల క్రితం కలిసి చేసిన చిత్రం నాయకుడు. ఇంతకాలం గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘Thug Life’ . ట్రైలర్ తోనే భారీ అంచనాలు ఏర్పడిన Thug Life ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మణిరత్నం స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌ ,కమల్ అద్బుతమైన నటన కలిసి ఈ కాలం ప్రేక్షకుడి అభిరుచిని పట్టుకోగలిగాయా...అంచనాలను అందుకోగలిగిందా?

స్టోరీ లైన్

రంగ‌రాయ శ‌క్తిరాజు (క‌మ‌ల్‌ హాస‌న్) డిల్లీలో ఓ పవర్ ఫుల్ గ్యాంగస్టర్ . ఓ సారి పోలీస్ లతో జరిగిన ఎటాక్ లో తన వలన చిన్న వయసులోనే తండ్రిని,చెల్లిని కోల్పోతాడు. అది గమనించిన శక్తిరాజు అమర్ (శింబు)ని చేరతీసి పెంచుతాడు. ఆ తర్వాత ముఠాకు నాయకుడుని చేస్తాడు. అలాగే అప్పటి దాడిలో కోల్పోయిన అమర్ చెల్లిని వెతికి తీరుతానని హామీ కూడా ఇస్తాడు.

కానీ అమర్ ని వారసుడుగా ప్రకటించటం... ముఠాలోని మిగతా కీలక సభ్యులు మాణిక్యం (నాజర్), పత్రోస్ (జోజు జార్జ్) ,అన్బు రాజ్ (భగవతి పెరుమాళ్) జీర్ణించుకోలేరు. గ్యాంగ్ లో ఆధిపత్య పోరు మొదలవుతుంది. ఈ గ్యాంగ్ కి ప్రధానమైన శత్రువు సదానంద్ (మహేశ్ మంజ్రేకర్) ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. ఇక శక్తి రాజు మానస సరోవరం యాత్రకు వెళ్లిన సమయంలో ఆయనపై హత్యాప్రయత్నం జరుగుతుంది. కానీ దాన్నుంచి తప్పించుకున్న శక్తి రాజు రెండేళ్ల తర్వాత ఢిల్లీకి తిరిగి వస్తాడు. శ‌క్తిరాజుని తొలిగించాలనే పావులు కదపటం మొదలవుతుంది. అప్పుడు ఏమౌతుంది.

ఇంతకీ శక్తి రాజుపై దాడికి ప్రధాన కారణం ఎవరు? తండ్రిలా చూసుకున్న శక్తిరాజు, అమర్ మధ్య విభేదాలు నిజంగానే మొదలయ్యయా?ఈ కథలో ఇంద్రాణి (త్రిష), లక్ష్మి (అభిరామి) పాత్రలు ఏమిటి?చివరకు ఏమైంది, గ్యాంగ్ లో ఎవరు మిగిలారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే... మణిరత్నం తనదైన శైలిలో మలచిన 'థగ్ లైఫ్'.

విశ్లేషణ

సాధారణంగా మణిరత్నం సినిమాల్లో కథ చూడాలని ఎవరూ పనిగట్టుకుని వెళ్లరు. ఆయన ఆ కథను చెప్పే తీరును ఆసక్తిగా చూడాలనుకుంటారు. ఆయన చిత్రాల్లో మాటలకన్నా మౌనం బలంగా వుంటుంది. సంగీతానికి ఊపిరి లాంటి సినిమాటోగ్రఫీ తో భావోద్వేగాలను ఆవిష్కరించడం జరుగుతూంటుంది. అయితే ఈ సారి ఇక్కడే దెబ్బ పడుతుంది. ఎంతో ఊహించుకుని ఆ స్థాయి సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులకు మాత్రం ‘థగ్ లైఫ్’ పెద్ద దెబ్బ కొడుతుంది. పూర్తి స్దాయి అసంతృప్తిని మిగుల్చుతుంది.

ఈ చిత్రాన్ని యాక్షన్, ఎమోషన్‌ల మిశ్రమంగా తీర్చిదిద్దినా, కథ పరంగా అది కొత్తగా అనిపించదు. పాత సినిమాలు గుర్తు వస్తూంటాయి. అలాగే శక్తిరాజు–అమర్ మధ్య బంధం, ఆ తర్వాత వచ్చే మలుపు అన్నీ మణిరత్నం శైలిలో చక్కగా రాసినట్లే ఉన్నా, వాటికి తగినంత ఎమోషన్ అయితే బిల్డ్ చేయలేకపోయారు.

కథ పరంగా చూస్తే... క్యారక్టరైజేషన్స్,వాటి ఆర్క్ డిజైన్ లోనూ అసంపూర్తి కనపడుతూంటుంది. అదే తెలియకుండా అసంతృప్తి కలిగిస్తుంది. శక్తిరాజు అమర్‌కు ఇచ్చిన మాట — చెల్లిని వెతికి తీసుకురావడం — కథలో కీలకమైన అంశమే అయినా, దాన్ని మధ్య మధ్యలో గుర్తుచేసే ప్రయత్నం లేకపోవడం వల్ల ఎమోషన్ మిస్ అవుతుంది. కథ ఎటో వెళ్తున్నట్లు అనిపిస్తుంది.

ఇక ఇంద్రాణి (త్రిష) పాత్ర విషయానికొస్తే, ఆ పాత్ర కథలో ఎందుకు ఉందో క్లారిటీ లేదు. ఆమెను సినిమాకు ఓ ఎట్రాక్షన్ కోసం తీసుకున్నట్లు అనిపిస్తుంది కానీ, కథను ముందుకు తీసుకెళ్లేలా కాదు. సినిమాలో ఎక్కడా హై ఇచ్చే ఎలిమెంట్స్ లేవు, ఓ పాతకాలం పగ,ప్రతీకారం సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది.

టెక్నికల్ గా ...

మణిరత్నం తనదైన శైలిని కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఇవ్వగలిగారు. ముఖ్యంగా లాంగ్ షాట్స్, సైలెన్స్‌తో మలిచిన ఎమోషనల్ మోమెంట్స్ – ఇవి ఆయన స్టైల్‌ను గుర్తు చేస్తాయి. కానీ ఈసారి స్క్రీన్‌ప్లే పట్టు కొంచెం తగ్గిపోవటంతో మనకు తెరపై జరిగే వాటిపై ఇంట్రస్ట్ తగ్గిపోతుంది. కొన్ని మాస్ మాస్టర్‌షాట్స్ మణిరత్నం క్లాస్‌ను గుర్తు చేస్తాయి. అయితే అదే సమయంలో కథ చెప్పే ధోరణిలో పాతదనం, డైలాగ్ లలో డెప్త్ లేకపోవటం ఇబ్బంది పెడతాయి.

సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే... విజువల్స్ వైపు చూస్తే, కొన్ని షాట్లు పోస్టర్‌లా బాగుంటాయి. కలర్స్ వాడకంలో రవి చంద్రన్ క్లాసు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బ్లాక్ అండ్ గోల్డ్ టోన్ ఎక్కువగా వాడటం వలన కాస్త మోనోటోనీ ఏర్పడింది. ఫ్రేమ్ కంపోజిషన్, లైటింగ్ – హై స్టాండర్డ్ లో ఉన్నాయి.

శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సాధారణంగా గుండె లయలా క్రమబద్దంగా వుంటుంది. కానీ ఈ చిత్రంలో కొన్ని ట్రాన్సిషన్లు అస్తవ్యస్తంగా అనిపిస్తాయి. ముఖ్యంగా తండ్రీ-కొడుకుల మధ్య ఎమోషనల్ కన్‌ఫ్లిక్ట్ సీన్‌లలో ఎడిటింగ్ పేస్ అసలు బాగోదు.

సంగీతం విషయంలో రెహ్మాన్ సాధారణంగా మణిరత్నం అనగానే మ్యాజిక్ చేస్తాడు. కానీ ఈసారి ఆ మ్యాజిక్ చాలామందికి ఎక్కదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్యాషన్‌తో ఉందిగానీ, థీమ్ మ్యూజిక్ మాత్రం గుర్తుండిపోయేలా లేదు. కాస్ట్యూమ్ & స్టైలింగ్ బాగున్నాయి. ఆర్ట్ డైరెక్షన్ & ప్రొడక్షన్ డిజైన్ ఫెరఫెక్ట్ గా ఉన్నాయి.

ఫైనల్ థాట్:

Thug Life అనేది మణిరత్నం శైలికి ఓ గౌరవ వందనం లాంటి సినిమా కావాలి అనుకున్నవారికి — ఇది పూర్తి స్దాయి నిరాశ కలిగిస్తుంది. కమల్ హాసన్ స్థాయికి తగిన బలం ఉన్న పాత్ర దొరికినా, డెప్త్ లేక తేలిపోయింది. ఏదైమైనా మణిరత్నం సినిమాల్లో ఉండే అంతర్లీన నిశ్శబ్దం మిస్సైంది. ఇంకెందుకు ఈ సినిమా చూడాలి?

Tags:    

Similar News