‘కాంతార చాప్టర్ 1’ రివ్యూ

కథ కంటే కల్చర్ డామినేట్ అయ్యిందా?

Update: 2025-10-04 05:43 GMT

8వ శతాబ్దంలో జరిగే కథ ఇది. ‘కాంతార’ సినిమాలో హీరో.. అతని తండ్రి ఎక్కడైతే మాయమవుతారో సరిగ్గా అక్కడి నుంచే ‘కాంతార చాప్టర్‌ 1’ కథ ప్రారంభమవుతుంది. అప్పట్లో కదంబుల రాజ్య పాలన జరుగుతూంటుంది. ఆ బంగ్రా రాజ్యాన్ని ఆనుకొని ఉండే అటవీ ప్రాంతం ఓ మార్మిక ప్రదేశం. అక్కడ ఓ దైవిక భూమి కాంతార. ఆ భూమిలోని ఈశ్వరుడి పూదోటకు.. అక్కడున్న మార్మిక బావికి ఎంతో గొప్పతనం,ప్రాధాన్యత ఉంది.

ముఖ్యంగా ఈశ్వ‌రుడి పూదోట సుగంధ ద్ర‌వ్యాల‌కు ప్ర‌సిద్ధి. అలాగే ఆ ప్రాంతాన్ని కాపలా కాస్తూ.. బ్ర‌హ్మ రాక్ష‌సుడు ఉంటాడ‌ని అందరూ చెప్పుకుంటూంటారు. అది నిజమో కాదో, తేల్చ‌డానికి వెళ్లిన బంగ్రా రాజు.. దారుణ‌ంగా చనిపోతాడు. ఆ చావుని క‌ళ్లారా చూసిన యువ‌రాజు (జ‌య‌రామ్‌) పెరిగి పెద్ద‌వాడై రాజ‌వుతాడు. కానీ త‌న పిల్ల‌ల‌కు ‘కాంతార వైపు పోవ‌ద్దు.. అక్క‌డ ఓ బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు ఉన్నాడు’ అంటూ హెచ్చ‌రిస్తుంటాడు. ఇదంతా గతం.

ఇప్పుడా ఆ మహిమాన్వితమైన ప్రాంతంపై దుష్టశక్తుల కన్నుపడకుండా.. తమ రాజ్యంలోకి బయట వాళ్లెవరూ అడుగు పెట్టకుండా జాగ్రత్తగా కాపాడుతుంటుంది అక్కడి కాంతారా గిరిజన తెగ. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాల్ని పండిస్తూ జీవనం సాగించే ఆ తెగకు..ఆ మార్మిక బావిలో ఓ బిడ్డ దొరుకుతాడు. అతన్ని దైవ ప్రసాదంగా భావించి.. అతనికి బెర్మే (రిషబ్‌ శెట్టి) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు.

మరో ప్రక్క భాంగ్రా యువరాజు కుల‌శేఖ‌ర (గుల్ష‌న్ దేవ‌య్య‌) కు ప‌ట్టాభిషేకం జరుగుతుంది. అతనికి తన ఆ కాంతారా వైపు వెళ్ల వద్దని చెప్పటాన్ని మూర్ఖంతో కొట్టిపారేస్తాడు. తనే కాంతార‌పై అడుగుపెడతాడు. తమ రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించిన భాంగ్రా యువరాజు కులశేఖర (గుల్షన్‌ దేవయ్య).. అతని సైనిక మూకకు తగిన బుద్ధి చెప్తాడు బెర్మే.

ఆ సంఘటన జరిగిన తర్వాత బెర్మే... తాము పండించే సుగంధ ద్రవ్యాలతో ఎలా రాజు విదేశీ వర్తకం చేస్తున్నారో.. గిరిజనుల్ని వెట్టి పేరుతో ఎలా హింస పెడుతున్నారో తెలుసుకుంటాడు. దీంతో తమ తెగను బాగు కోసం.. వెట్టి నుంచి వాళ్లను విముక్తి చేయడం కోసం ఓ నిర్ణయం తీసుకుంటాడు. భాంగ్రా రాజును ఎదిరించి సొంతంగా వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతాడు.

అప్పుడు ఏమైంది? బెర్మే తీసుకున్న నిర్ణయం కాంతార గిరిజన తెగకు సమస్యగా ఎందుకు మారింది?భాంగ్రా రాజు రాజశేఖర్‌ (జయరామ్‌) ఆయన కుమార్తె కనకావతికి (రుక్మిణి వసంత్‌) ఈ కథలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? అలాగే ఈశ్వరుడి పూదోటలో ఉన్న రహస్యం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ ...

“కాంతార చాప్టర్ 1” – రిషబ్ శెట్టి రాసి, దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ చిత్రం, 2022 బ్లాక్‌బస్టర్ “కాంతార” కు ప్రీక్వెల్. మొదటి భాగం భూతకోలా సంప్రదాయం, తీర ప్రాంత కర్ణాటక ఫోక్ బిలీఫ్స్ ఆధారంగా సాగి, మిస్టిసిజం కలిపిన కథతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసారి మాత్రం, రిషబ్ శెట్టి ఆ మూలాలకే వెళ్లి, ప్రాంత చరిత్ర, పూర్వీకుల వారసత్వాన్ని తవ్వకంలా చూపించే ప్రయత్నం చేశాడు.

వాస్తవానికి ఈ సినిమాలో కథ చాలా తక్కువ. అలాగే కథనం కంటే ఎక్కువగా భూతకోలా మూలాలు, గిరిజన ఆచారాలు, ప్రాంతీయ జీవన విలువలు ముందుకు వస్తాయి. మొదటి భాగం కొత్తగా అనిపించిందనడానికి కారణం – మనకు తెలియని ఒక ఫోక్ వరల్డ్‌ను, మిస్టిసిజం తో మిక్స్ చేసి చూపించడమే. కానీ ఈసారి ఆ లోతుల్లోకి వెళ్లే క్రమంలో, సినిమా కొన్ని సార్లు ఇన్స్పైర్ అవ్వడం కన్నా ఇమిటేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. భారీ యుద్ధ సన్నివేశాలు చూస్తే బాహుబలి గుర్తు వస్తుంది, టైగర్ ఎపిసోడ్ మాత్రం RRR ని తలపిస్తుంది – కానీ రెండూ అంత బలమైన ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.

ఫస్టాఫ్ సోసోగా..స్లోగా ..

ఫస్ట్ హాఫ్ సినిమా సోసో అనిపించటానికి ప్రధాన కారణం – హాస్యం. స్థానికంగా కనెక్ట్ అయ్యేలా వదిలిన జోక్స్, నాన్-కన్నడ ఆడియన్స్ కు వర్కవుట్ కాలేదు. అవి కథని ముందుకు తీసుకెళ్లడంలేదు, అనవసర ఫిల్లర్‌లా అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్ బ్లాక్‌లో రిషబ్ శెట్టి మాస్టర్ టచ్ చూపించాడు. ఒక్కసారిగా సీక్వెన్స్ సినిమాను మళ్లీ రివైవ్ చేసి, టెన్షన్ పెంచుతుంది.

సెకండాఫ్ – స్ట్రాంగ్

రిషబ్ శెట్టి స్ట్రాంగ్ పాయింట్ – ఫైనల్ యాక్ట్ టెంపో. మొదటి సినిమాలో లాగే, ఇక్కడ కూడా తన బలమైన కార్డ్స్‌ను చివరికి వదిలాడు. సెకండాఫ్ ...మొదటిదానికంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ గానే ఉంటుంది. అయినా మధ్యలో కొన్ని సీన్లు స్లోగా, కామెడీ బలహీనతతో లాగి వెళ్తాయి. కానీ క్లెవర్ ట్విస్ట్ ఒక కీలక సమయంలో వచ్చి, ఆడియన్స్‌ను మళ్లీ ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్ వరకు ఆసక్తి కొనసాగుతుంది.

నటీనటుల్లో ...

రిషబ్ శెట్టి ఈసారి మొదటి సినిమాలోలా పూర్తి స్థాయి భూతకోలా వేషం ధరించడు, ఆ హిప్నాటిక్ డ్యాన్స్‌ని కూడా ప్రదర్శించడు. దాని బదులు, ఆయన పలు దైవ అవతారాలు చూపిస్తూ వస్తాడు – ఎక్కడో శివుడి గణం, ఎక్కడో అమ్మవారిలా కనిపించే రూపం, ఎక్కువ భాగం మాత్రం గిరిజన యోధుడిగానే కనిపిస్తాడు. ఈ లుక్స్ వైవిధ్యం చూపించినా, నటనలో మాత్రం మొదటి సినిమా ఇచ్చిన మ్యాజిక్ మిస్సయ్యింది. జాతీయ అవార్డు తెచ్చిన ఆ లెవెల్ ఈసారి రాకపోయింది.

రుక్మిణి వసంత్ మొదట్లో ప్రిన్సెస్ ఒక కామనర్‌కి ప్రేమలో పడే రొటీన్ క్యారెక్టర్‌లా కనిపించినా, కథనం లోతుపోతే ఆమె రోల్ బలంగా మారుతుంది. ఫైనల్ యాక్ట్‌లో ఆమె అద్భుతంగా మెరిసి, సినిమా యొక్క బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అవుతుంది.

టెక్నికల్ గా చూస్తే...

“కాంతార” విజయం తర్వాత, రిషబ్ శెట్టి దర్శకుడిగా పెద్ద కాన్వాస్ మీద సినిమా తీశాడు. రిచ్ ఫ్రేమ్స్, ఎలివేటెడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో స్కేల్ పెంచాడు. విజువల్స్ చాలా లావిష్ గా ఉన్నాయి. టైగర్ ఎపిసోడ్ పూర్తిగా కన్విన్స్ చేయకపోయినా, ఇతర సన్నివేశాలు బాగా వర్క్ అయ్యాయి.

అర్వింద్ ఎస్. కాశ్యప్ సినిమాటోగ్రఫీ – ముఖ్యంగా అరణ్య సన్నివేశాలు, యాక్షన్ బ్లాక్స్ లో అద్భుతంగా కనిపిస్తుంది.

అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ – “వరాహ రూపం” ఐకానిక్ ట్రాక్ ఎక్కువగా వాడలేకపోయినా, BGM మాత్రం రక్తికట్టించేలా ఉంటుంది. అనేక సన్నివేశాలను లిఫ్ట్ చేసింది.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ – ప్రాంతీయ జీవనాన్ని నిజమైన టెక్స్చర్‌తో చూపించాయి.

అయితే, ఎడిటింగ్ లోపం సినిమాకి పెద్ద మైనస్. అలాగే స్లోనెస్, పునరావృత సన్నివేశాలు కనిపిస్తాయి. ముఖ్యమైన సీన్లలో వచ్చే కామెడీ పేషెన్స్‌ని టెస్ట్ చేస్తుంది. కనీసం 20 నిమిషాల ట్రిమ్మింగ్ అవసరమని స్పష్టంగా తెలుస్తుంది.

ఫైనల్ థాట్

ఫస్టాప్ బలహీనంగా ఉన్నా, సెకండాఫ్ లో గ్రిప్పింగ్ గా ఉండే ఫైనల్ మోమెంట్స్ సినిమాను రీడీమ్ చేస్తాయి. మొత్తానికి, ఇది డీసెంట్ వాచ్ అయినా, మొదటి సినిమా ఇచ్చిన మిస్టిక్ మ్యాజిక్ మాత్రం ఇక్కడ మిస్ అవుతుంది.

Tags:    

Similar News