'కన్యాకుమారి' ఓటిటి మూవీ రివ్యూ!
రొటీన్ లవ్ స్టోరీనా? లేక హృదయం తాకే అనుభవమా
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకాలోని పెంటపాడు. పొలాల మధ్య మట్టి వాసనతో పెరిగిన తిరుపతి (శ్రీచరణ్ రాచకొండ) చిన్నప్పటి నుంచే గుండెల్లో ఒకే కల – రైతు అవ్వాలి, ఈ నేలపైనే బతకాలి. అతనికి పంట మొలక ఒక ఆనందం, ధాన్యం శబ్దం ఒక థ్యానం.
కానీ అదే సమయంలో పక్క ఊర్లో చదివిన కన్యాకుమారి (గీత్ సైని) గుండెల్లో మరో కల – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వాలి, నగరంలో లైట్ల మధ్య జీవించాలి. ఆ కలను చేరుకోవడానికి ఆమె రాత్రిళ్లు పుస్తకాల మధ్య మునిగిపోయేది. అయితే వాస్తవం ఆమెను ముందుకు కదలనివ్వలేదు. ఇంటి ఆర్థిక పరిస్థితులు ఆమెను డిగ్రీ వద్దే ఆపేశాయి. ఆమె కలను ప్రక్కన పెట్టి, శ్రీకాకుళం లో ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా నిలబడింది.
మరో ప్రక్క తిరుపతికి ఏమో రైతు అని చెప్పి ఎవరూ పిల్లను ఇవ్వరు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంటపడతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి.. రైతు అని లైట్ తీసుకుంటుంది. ఎలాగోలా కష్టపడి తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్పేస్తుంది.
ఇదేంటని అడిగిన తిరుపతిని నీకు ఉద్యోగం కూడా లేదు అని అడుగుతుంది. దీంతో తిరుపతి చివరకు తన ప్రేమ కోసం, తన కలను వదిలాడు. పొలాల్లో చెమటోడ్చిన చేతులు, ఇప్పుడు నగరంలో ఉద్యోగం కోసం ఫార్మల్ షర్ట్ వేసుకున్నాయి. అప్పుడు ఏమైంది, కన్యాకుమారిని తిరుపతి పెళ్లి చేసుకోగలిగాడా? తిరుపతి వ్యవసాయం పూర్తిగా వదిలేసాడా? కన్యాకుమారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిందా.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
కన్యాకుమారి స్క్రిప్ట్‌లో దర్శకుడు ఎంచుకున్న మెయిన్ పాయింట్ సింపుల్ కానీ యూనివర్సల్ — ప్రేమా? లేక కలలా? ఒకవైపు మట్టితో మమేకమైన రైతు , మరోవైపు సాఫ్ట్‌వేర్ కలలతో మునిగిన కన్యాకుమారి. “వేర్లు vs. రెక్కలు” అనే రెండు జీవన తత్త్వాలు ఢీకొనే చోటే కథ పుట్టింది.
స్క్రీన్‌ప్లేలో మూడు దశలు క్లారిటీగానే ఉన్నాయి. దాంతో సినిమాటిక్‌గా సేఫ్ కానీ కథనపరంగా ప్రిడిక్టబుల్ అయ్యిపోయింది. కథలో మంచి థీమ్ ఉంది కానీ, స్క్రీన్‌ప్లే ట్రీట్‌మెంట్ రొటీన్ కావడం వల్ల కొత్తదనం తగ్గింది. ఎమోషనల్ హైస్ సరైన స్థాయిలో రాలేదు. ముఖ్యంగా కథలో రిస్క్ ఎలిమెంట్ లేదు. రిస్క్ లేకపోవటం వలన , ఇది ఒక మంచి ఫీల్ గుడ్ అనుభవంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఖచ్చితంగా చూడాలనిపించే సినిమాగా గానీ ఎదగలేదు.
ఓవరాల్ గా కన్యాకుమారి స్క్రిప్ట్‌లో ప్రధాన లోపం కొత్తదనం లోపించటం . రొటీన్ ప్రేమ–కలల కథను పల్లెటూరి వాసనతో కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేశారు, కానీ రెండో భాగంలో రిపీట్ నెస్ ఎక్కువైంది. అయినా, ఫీల్-గుడ్ టోన్, మట్టివాసన, కలలు–ప్రేమ అంటూ కొంతవరకూ లాక్కొచ్చేసారు కానీ కొంతదూరం వెళ్ళాక చేతులు ఎత్తేసారు. కామెడీ కూడా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.
టెక్నికల్ వ్యూ
గీత్ సైని (కన్యాకుమారి): టైటిల్ పాత్రకు పర్ఫెక్ట్ కాస్టింగ్. గ్రామీణ నేపథ్యానికి దగ్గరగా, “లైఫ్‌లో ఎదగాలి” అనే గోల్ ఉన్న అమ్మాయి లా కన్విన్సింగ్‌గా కనిపించింది. బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్‌గా చిన్న చిన్న హావభావాలతో, లవ్ స్టోరీలోని క్యూట్ మూమెంట్స్‌తో సహజంగా ఆకట్టుకుంది.
శ్రీచరణ్ (తిరుపతి): రైతు పాత్రలో న్యాయంగా నిలిచాడు. “వ్యవసాయం కూడా గౌరవమే” అన్న మెసేజ్‌ని, ప్రేమలో త్యాగం చేయగల మనసుని చూపించడంలో అతని పెర్ఫార్మెన్స్ సరైన స్థాయిలో ఉంది. అయితే కొన్నిచోట్ల ఎమోషనల్ డెప్త్ ఇంకా పెంచితే బెటర్ అయ్యేది.
భద్రం: ఫన్ తో స్క్రిప్ట్‌కు లైట్ మూమెంట్స్ జోడించాడు. కాని లవ్-డ్రామా మధ్య అతని ట్రాక్ అంతగా మిళితం కాలేదు.
సపోర్టింగ్ నటీనటులు: కొత్తవాళ్లే అయినా, వారి పాత్రలలో సహజత్వం కనబరిచారు.
సాంకేతిక అంశాలు
సినిమాటోగ్రఫీ: గ్రామీణ వాతావరణం, పొలాల మధ్య పల్లెటూరి వాసన బాగా క్యాప్చర్ చేశారు.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: యావరేజ్. ఎమోషనల్ హైస్‌కి సరైన రేంజ్ ఇవ్వలేకపోయింది. కొన్ని సీక్వెన్సులు మ్యూజిక్ బలం వలన మాత్రమే నిలబడినట్టు కాకుండా, మ్యూజిక్ బలహీనత వలన ఇంపాక్ట్ తగ్గినట్టుంది.
సాంగ్స్: ఒక్కసారి వినగలిగే స్థాయి. స్టోరీ ఫ్లోని బ్రేక్ చేయకుండా, సగం వరకు ఫిట్ అయ్యాయి.
డైలాగ్స్: క్లిష్టత లేకుండా, సహజంగా, పల్లెటూరి యాసతో బాగా రాశారు.
ఎడిటింగ్: మొదటి భాగం ఫ్రెష్‌గా, క్రిస్ప్‌గా ఉంది. కానీ సెకండాఫ్‌లో లాగింగ్ స్పష్టంగా కనిపించింది. కనీసం 10–15 నిమిషాలు కట్ చేస్తే స్క్రీన్‌ప్లే పేస్ బలంగా ఉండేది.
ప్రొడక్షన్ వాల్యూ: కథకు కావాల్సిన స్థాయిలో ఖర్చు పెట్టారు. లోకేషన్లలో సహజత్వం నిలబెట్టారు.
చూడచ్చా
అద్బుతం అని చెప్పలేం కానీ ఖాళీ ఉన్నప్పుడు ఓ లుక్కేయచ్చు.
ఏ ఓటిటిలో ఉంది?
'ఆహా' లో తెలుగులో ఉంది
ఫైనల్ థాట్
కన్యాకుమారి ఒక రొటీన్ లవ్ స్టోరీ అయినా, దాన్ని చెప్పిన తీరు, గ్రామీణ వాసన, సహజమైన నటన, డైలాగ్స్ వల్ల కొంతవరకు ఫ్రెష్‌గా అనిపిస్తుంది. రెండో భాగం లాగింగ్ తగ్గించి, ఎమోషనల్ డెప్త్ పెంచితే మరింత ఇంపాక్ట్ ఉండేది. మొత్తానికి, ఇది ఒక పట్టణ కలలూ–పల్లెటూరి నిజాలూ ఢీకొనే ఫీల్ గుడ్ మెలోడ్రామా, పెద్ద సర్ప్రైజ్‌లు లేనప్పటికీ, ఒకసారి చూడటానికి ఏ ఇబ్బంది పెట్టదు.