‘జూనియర్’ సినిమా రివ్యూ
'వైరల్ వయ్యారి' కోసమే...;
ఒక కొత్త హీరోని తెరపైకి పరిచయం చేయడం అనేది చిన్న విషయం కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని నమ్ముతారు దర్శక,నిర్మాతలు. అలా చేసినప్పుడు అది ఒక సినిమా కాదు... ఒక వ్యూహం. ఒక పరిచయం కాదు... ఒక పరీక్ష లా తయారవుతుంది. అయితే ఆ పరీక్ష దర్శకుడుగా, హీరోగా, చూసేవారికా అనేది ఎప్పుడూ పెద్ద క్వచ్చినే. ఇలాంటి పరీక్షా వేదికగా తెరపైకి వచ్చిన సినిమా ‘జూనియర్’. ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా, స్పష్టంగా ఒక ప్రామిసింగ్ లాంచ్‌గా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఫలించిందా, లేక రివర్స్ అయ్యి మనని ఆ ప్లాన్ లో ఇరుక్కుపోయేలా చేసిందా చూద్దాం.
స్టోరీ లైన్
అభి (కిరీటి) తన తల్లి తండ్రులకు లేటుగా పుట్టిన బిడ్డ. అతను పుట్టగానే తల్లి మరణిస్తుంది. దాంతో తండ్రే(రవిచంద్రన్) అన్ని తానై పెంచుతాడు. అయితే లేటుగా పుట్టిన కొడుకు అవటంతో తండ్రి-కొడుకుల మధ్య అరవై ఏళ్ల వయస్సు గ్యాప్ ఉంటుంది. ఆ జనరేషన్ గ్యాప్ ఇబ్బందిగా మారుతుంది. ఆయన పాత కాలం ఆలోచనలు,అభి మేడ్రన్ లైఫ్ స్టైల్ సింక్ అవ్వవు. దాంతో సాధ్యమైనంత తండ్రికి దూరంగా ఉంటూ లైఫ్ ని లీడ్ చేస్తూంటాడు.
ఇదిలా ఉంటే అభికి ఓ రోజు బస్ లో స్ఫూర్తి (శ్రీలీల) పరిచయం అవుతుంది. మొదట ఇద్దరి మధ్యా సఖ్యత లేకున్నా తర్వాత ఆమె ప్రేమలో పడి ఆమె పనిచేసే కార్పోరేట్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ కంపెనీ ఛైర్మెన్ (రావు రమేష్) కూతురు విజయ సౌజన్య(జెనీలియా)తో మొదటి రోజే క్లాష్ వస్తుంది. దీంతో ఆమె అతనిపై పగబడుతుంది. ‘‘నెను ఛైర్మన్ అయితే… నిన్ను తీసేస్తా!’’ అని వార్నింగ్ ఇస్తుంది.
ఓ రోజు...ఆ రోజు వస్తుంది. తండ్రి రిటైరై ఆ ప్లేస్ లో కి సౌజన్య ఛైర్మన్ గా వస్తుంది. ఇప్పుడు అలాంటేదేమో జరుగుతుందేమో...ఇద్దరి మధ్యా జరుగుతుందేమో చూస్తూంటే...ఓ కొత్త ట్విస్ట్ వస్తుంది. అదే రోజు అక్కడికి వచ్చిన అభి తండ్రిని చూసి ఛైర్మన్ షాక్ అవుతాడు. ఆయన ద్వారా కథలో ఓ కొత్త విషయం రివీల్ అవుతుంది. అభి ఎవరో తెలుస్తుంది. అప్పుడు ఏమైంది, అసలు అభి ఎవరు..అతని తండ్రిని చూసి ఛైర్మన్ ఎందుకు షాక్ అయ్యారు. ఆ తర్వాత విజయ, అభి కలిసి విజయనగరం ఎందుకు వెళ్లాల్సి వస్తుంది , చివరకు విజయ-అభిల మధ్య వార్నింగ్ ల వార్ ఎలాంటి మలుపు తీసుకుంది. అలాగే అభి ప్రేమ కథ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
పై కథ చదివాక.. ఇదేంటి ఇలా ఉంది, ఇందులో హీరో ఏం చేస్తాడు..చేయటానికి, చెప్పుకోవటానికి ఏముంది అనిపిస్తుంది. దాదాపు సినిమా అంతా అదే పరిస్దితి. కథ మొదలవుతుంది అనుకున్న ప్రతీ చోటా ఏదో బ్రేక్ పడి ఆగిపోయి వేరే ట్రాక్ మొదలవుతుంది. అందుకు కారణం కొత్త హీరో లాంచింగ్ అవసరమైన దినుసులు (పాటలు,ఫైట్స్,కామెడీ,ఎమోషన్స్)అన్ని సీన్స్ లో రావాలనే తాపత్రయం కావచ్చు. హీరో ఇంట్రడక్షన్ అ్యయాక కథ ఎటునుంచి ఎటు వెళ్తుందో మనకు ఇంటర్వెల్ దాకా అర్దం కాదు. సీన్స్ వస్తూంటాయి. వెళ్తూంటాయి. హీరోకు ఇవి వచ్చు, ఇవి చేయగలడు అని చూపించటానికి సరపడ సన్నివేశాలనే చూపించుకుంటూ ఇంటర్వెల్ లో ఓ ట్విస్ట్ ఇచ్చి ముందుకు వెళ్ళారు.
దాంతో మనం కథను ఫాలో అవ్వటం కన్నా కొత్త హీరో ప్రతిభనే ఫాలో అవ్వటం మేలు అని డిసైడ్ అయ్యి చూస్తూంటాం. ఏ సీన్ కా ఆ సీన్ బాగున్నట్లే అనిపించినా, ఎక్కడా పెద్దగా మనకేమీ పెద్దగా కనెక్ట్ అయ్యినట్లు అనిపించదు. ఎందుకంటే మనం ఆ హీరోతో సినిమా చెయ్యాలని చూస్తూ,అతని ప్రతిభను పరీక్షిస్తూ కూర్చున్న నిర్మాతలం, దర్శకులం కాదు కదా. ముఖ్యంగా హీరోకు ప్రత్యేకమైన లక్ష్యం,కాంప్లిక్ట్స్ అనేవి ఏమీ కనపడవు.
ఉన్నంతలో కథలోనే కొన్ని ట్విస్ట్ లు పెట్టుకుని లాగించేసారు. దానికి తగినట్లు ట్రీట్మెంట్ ఓ పదేళ్ల క్రితం సినిమాలను గుర్తు చేస్తూంటుంది. విలన్ ఉన్నా లేనట్లే. క్లైమాక్స్ లోనూ పెద్దగా హై ఇచ్చే ఎలిమెంట్స్ లేవు. పోనీ శ్రీలీల అయినా సినిమా మొత్తం ఉంటుందా అంటే ఫస్టాఫ్ అయ్యేసరికి ఆమె మాయమై పాటల్లో వస్తూంటుంది. ఇవేమీ కాదు జెనీలియాకు హీరోకు మధ్య విఐపీ 2 (ధనుష్) సినిమాలాగ ఏదన్నా పెద్ద వార్ జరుగుతుందా అదీ ఉండదు. ఇవి చాదలన్నట్లు హీరో కు జ్ఞాపకాలు పోగుచేసుకోవాలనే కాన్సెప్టు ఒకటి.
టెక్నికల్ గా ..
స్క్రిప్టు ఈ సినిమాని చావు దెబ్బ కొట్టిందని చెప్పాలి. దర్శకుడు సినిమాని హిట్ చేయటం కన్నా హీరోని హిట్ చేయాలని కష్టపడినట్లు అర్దమవుతుంది. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ దేవిశ్రీప్రసాద్, అలాగే కెమెరా వర్క్ సెంథిల్ చేసారు. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ తన వంతు భాధ్యతగా ‘వైరల్ వయ్యారి’ వంటి హిట్ పాటను ఇచ్చారు. అయితే మిగతా పాటలూ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సాధారణంగానే అనిపిస్తాయి. సాధారణంగా డీఎస్పీ నుండి ఆశించే స్టాండర్డ్‌కి ఇది తగ్గదని చెప్పాలి. డైలాగులు బాగున్నాయి.
సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమార్ ది సేమ్ సిట్యువేషన్.ఆయన గత వర్క్ లతో పోలిస్తే ఓ మాదిరిగా అనిపిస్తుంది. అయితే కథనంగా సినిమా పాతదైపోయినా, విజువల్‌గా మాత్రం సినిమా ఆకర్షణీయంగా కనిపించడంతో క్యామెరామెన్ వర్క్ ఫెయిర్‌గా చెప్పవచ్చు. వారాహి చలనచిత్రం నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు బడ్జెట్ గట్టిగా పెట్టారని అర్దమవుతూ ఉంటుంది. అందులో వింత కూడా ఏమీ లేదు. అక్కడ ఉన్నది గాలి జనార్దన రెడ్డి కుమారుడు.
ఇక హీరోగా కిరీట్ రెడ్డి ..సినిమా హీరోకు కావాల్సిన డాన్స్ లు, పైట్స్ , కొద్దిగా నటన అన్ని నేర్చుకున్నాడని అర్దమైంది. అదే టార్గెట్ అయితే వంద శాతం సక్సెస్ అయ్యినట్లే.
చూడచ్చా
'వైరల్ వయ్యారి' పాట తప్పించి ఈ సినిమాలో చెప్పుకోదగిన హైలెట్స్ ఏమీ లేవు.
యాక్షన్, ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడిచే ఫక్తు కమర్షియల్ సినిమాలు పది పదేహేనేళ్ల క్రితం వచ్చేవి ఇప్పుడు రావటం లేదు అని బాధపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
ఫైనల్ థాట్
హీరోని లాంచ్ చేయాలంటే అతనికి అన్నీ వచ్చు అనే ఓ డెమో ఫిల్మ్ (షో రీల్) లా తీసినట్లు తీయాలనే రూల్ పెట్టుకుంటే ఇలాంటి సినిమాలే వస్తాయి. ముఖ్యంగా స్టార్ హీరోల వారసుడు కానప్పుడు కథ,కథనం మీదే డిపెండ్ అవ్వటం మేలు. హీరోల వారసులు అయితే తండ్రి ఇమేజ్ యాడ్ అయ్యి..చూస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపించదు.