'మారి'నటుడు రోబో శంకర్ కన్నుమూత
తమిళ చలన చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి
By : The Federal
Update: 2025-09-19 03:04 GMT
ప్రముఖ కోలీవుడ్ నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. జీర్ణాశయ వ్యాధులతో ఆయన మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన వయసు 46 ఏళ్లు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు.
రెండు రోజుల కిందట అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇవాళ మరణించారు. ఆయన మరణం పట్ల తమిళ చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
శంకర్ రోబో డ్యాన్సులకు ఫేమస్. దాంతో ఆయన పేరే రోబో శంకర్‌గా మారింది. స్టేజ్ షోలతో చలన చిత్ర రంగానికి, అటుపై సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం అయ్యారు. ఆయన తొలి చిత్రం ధర్మ చక్రం(1997). విజయ్ సేతుపతి ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమారా" (2013) చిత్రంతో చలనచిత్ర రంగంలో ఆయన పేరు మార్మోగింది. ధనుష్ మారితో ఆయనకు పాపులారిటీ దక్కింది. విశాల్ ఇరుంబు తిరై (2018), అజిత్ విశ్వాసం (2019), విశాల్ చక్ర (2021), విక్రమ్ కోబ్రా (2022), కలకలప్పు 2, పులి, యముడు 3, మిస్టర్ లోకల్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించారు.
కొద్దికాలం కిందట ఆయన కామెర్ల వ్యాధితో బాధ పడ్డారు. దానికి తగ్గట్టు ఆయన ఉన్నట్టుండి బరువు తగ్గడం మొదలు పెట్టారు. సినిమాలు కూడా తగ్గించారు. ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రోబో శంకర్ సడెన్‌గా స్పృహతప్పి పడిపోయారు. దీంతో చిత్ర యూనిట్ వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. వైద్యులు రెండురోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తుండగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన మరణించారు. జీర్ణాశయంలో రక్తస్రావం, అంతర్గతంగా అవయవాలు చెడిపోవడంతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. గతేడాది తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించిన విషయం తెలిసిందే. విజయ్ బిగిల్ చిత్రంలో ‘గుండమ్మ’గా అలరించిన నటి ఇంద్రజ ఈయన కూతురే. రోబో శంకర్ భార్య సింగర్.
రోబో శంకర్ హఠాన్మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నటుడు ధనుష్ రోబో శంకర్ ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.
యావత్ తమిళ సినీ పరిశ్రమ తరలి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలుపుతోంది. రేపు అంత్యక్రియలు జరుగుతాయని సినీ వర్గాలు ప్రకటించాయి.