మారుతి ‘బ్యూటీ’ మూవీ రివ్యూ

టీనేజ్ లవ్ & తండ్రి ఎమోషన్‌

Update: 2025-09-19 08:56 GMT

ఒక మధ్యతరగతి ఇంటి తలుపు తెరుచుకుంటే… లోపల కనిపించేది కష్టాల మధ్య నవ్వే మనుషులే. అలాంటి లో మిడిల్ క్లాస్ మనిషే నారాయణ (నరేశ్‌) కథే ఇది. అతనో సాధారణ క్యాబ్‌ డ్రైవర్‌. ఉదయం నుంచి రాత్రివరకు రోడ్డు మీదే బతికే వాడు. కానీ రాత్రి ఇంటికి చేరుకున్నాక, కూతురు అలేఖ్య (నీలఖి) నవ్వు చూసినప్పుడు – తన అలసట అంతా కరిగిపోతుంది.

అతనికి కూతురు అంటే పంచప్రాణాలు. ఆమె కోరిక అతనికి ఆజ్ఞ. ఆమె చిన్న ఆనందమే అతనికి జీవనార్థం. కానీ తండ్రి ప్రేమలో దాగిన సడలింపే… అలేఖ్యకి కొత్త తలుపులు తెరిచింది. కాలేజీ, స్కూటీ, ఫ్రెండ్స్… ఈ వయసులో కొత్త కలలు, కొత్త కోరికలు. అదే సమయంలో పరిచయమయ్యాడు అర్జున్‌ (అంకిత్‌) అనే కుర్రాడు. స్కూటీ మీద మొదలైన పరిచయం… బీచ్‌ వద్ద చెప్పుకున్న గుండె మాటలు… అలా అలేఖ్య మనసులో మొలిచింది మొదటి ప్రేమ.

ఆమె వైపు నుంచి అది వయస్సు ప్రతి స్పందన. కానీ అమ్మ–నాన్న కళ్లలో మాత్రం ఇది తప్పే. ఓ రోజు ఆ అమ్మ కళ్లకు కనిపించిన ఆ వీడియో కాల్‌…మొత్తం మార్చేసింది. “ఇదా నా కూతురా?” అని తల్లి వేదనలో జారిన కన్నీటి బిందువు… “నా కూతురిని నేనే కోల్పోతున్నానా?” అని తండ్రి గుండెల్లో పుట్టిన భయపు నిశ్శబ్దం… ఇవే అలేఖ్యను తన బోయ్ ప్రెండ్ తో ఇంటి గడప దాటించాయి.

“నాన్న కళ్లలో కూతురు… కూతురు కళ్లలో కొత్త ప్రపంచం”

ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిన అలేఖ్య కోసం ప్రాణం పెట్టి వెంబడిస్తాడు తండ్రి… అయితే అదే సమయంో ఆమెపై కన్నేసిన ఒక సైకో లాంటి క్రిమినల్ వెంబడిస్తూంటాడు. చివరకు ఏమైంది...

అలేఖ్య చేసిన తప్పు ఒక్కటే – తాను పెద్దదయ్యానని అనుకుంది. నారాయణ చేసిన తప్పు ఒక్కటే – తండ్రి ప్రేమలో కూతురిని అతిగా నమ్మాడు. కానీ తండ్రి తన ప్రాణం పెట్టి వెతికేది – తప్పు చేసిన కూతురిని కాదు… తన చిన్నప్పటి నవ్వే. కూతురు మళ్లీ తండ్రి కౌగిలిలో చేరిందా? లేక ఈ ప్రయాణం వారిద్దరి మధ్య కొత్త దూరం పెంచిందా?

అదే ఈ కథ చివరి ప్రశ్న. దానికి సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ :

హీరో అర్జున్‌ అరెస్టు తర్వాత జరిగే సన్నివేశాలతో ఓ క్యూరియీసిటీ క్రియట్ చేస్తూ ఒక ఇంటెన్స్‌ టోన్‌తో సినిమా ప్రారంభమవుతుంది, దాంతో వెంటనే కథలోకి వెళ్లిపోతాం. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ లో టీనేజ్ లవ్ స్టోరీ, రొమాంటిక్ వైబ్స్, బేబీ సినిమా స్టైల్‌లోనే చేశారు. మధ్యలో మిడిల్‌క్లాస్ తండ్రి (నరేశ్‌) – కూతురి (నీలఖి) అనుబంధం, స్కూటీ ట్రాక్‌ – లైట్ కామెడీతో సెటప్. “హగ్స్, కిస్సెస్, రొమాంటిక్ మోమెంట్స్” – నేటి యూత్ కల్చర్‌ని చూపించడం అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇక్కడి వరకూ యూత్ కనెక్ట్ + ఫ్యామిలీ ఎమోషన్ రెండూ కలిపారు. ఎమోషనల్ ఆర్క్‌ చాలా పక్కాగా ఉంది – నారాయణ కూతురికి స్కూటీ ఇచ్చే సన్నివేశం నిజంగా గుండెను తాకుతుంది.

“The most personal is the most creative.” – Martin Scorsese ఈ లైన్‌ని గుర్తు తెచ్చేలా, మధ్యతరగతి తండ్రి జీవితం అంత బాగా ఎస్టాబ్లిష్ చేశారు.

ప్రేమ వ్యవహారం బయట పడటం, పక్కింటి అంకుల్ రియాక్షన్, ఆ తర్వాత తల్లి కంటపడి ఇంట్లో గొడవ –“మిడ్ పాయింట్ కాటలిస్ట్” గా అసలు కథను ముందుకు నెడుతుంది.

అలేఖ్య ఇంటిని వదిలి పారిపోవడం – ఫస్ట్ హాఫ్‌ను బలంగా ముగించింది.

అయితే సెకండ్ హాఫ్ – బుట్టబొమ్మ షేడ్స్ మొదలయ్యాయి. అలాగే అప్పట్లో వచ్చిన ప్రేమిస్తే (భరత్) సినిమాని గుర్తు చేస్తూ కథనం మెల్లిగా కదలటం మొదలైంది. హైదరాబాద్‌లో నడిచే కొత్త లేయర్ కథకు బలాన్ని ఇవ్వాల్సింది పోయి, కొత్తదనాన్ని కూల్చేసింది. తండ్రి నారాయణ కూతురి కోసం వెతికే జర్నీ. పోలీసుల ఇన్వెస్టిగేషన్, గర్ల్స్‌ని మోసం చేసే గ్యాంగ్ ట్రాక్ ..ఇవన్ని ఇది థ్రిల్లర్ కలర్ ఇచ్చినా, ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం కొంచెంగా డ్రాప్ అవుతుంది. అది హీరో–హీరోయిన్ ఇల్లు వెతికే ట్రాక్ తో ఇంకా మందగిస్తుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే సీక్రెట్ లేయర్ కోసం ఇంతసాగ తీసారనిపిస్తుంది. అయితే మళయాళంలో కప్పేలా తెలుగులో బుట్టబొమ్మ చూసినవారికి అది గొప్పగా థ్రిల్ చేయలేకపోతుంది.

క్లైమాక్స్ ఊహించదగ్గదే అయినా – నరేశ్ ఎమోషన్ మాత్రం మళ్లీ కనెక్ట్ చేస్తుంది.

ఓవరాల్ గా ..“బ్యూటీ” స్క్రిప్ట్‌లో ప్రధాన సమస్య టోన్ కంసిస్టెన్సీ లేకపోవడమే. ఫస్ట్‌హాఫ్‌లో టీనేజ్ లవ్‌స్టోరీని ట్రెండీగా, లైట్ కామెడీతో చూపిస్తారు; కానీ ఇంటర్వెల్‌కి వచ్చేసరికి కథ ఒక్కసారిగా సీరియస్‌గా, మెలోడ్రామాటిక్‌గా మారిపోతుంది. ఈ షిఫ్ట్‌ను ఆడియన్స్ డైజెస్ట్ చేసుకునేంత ఆర్గానిక్ ట్రాన్సిషన్ లేదు. సెకండాఫ్‌లో నెగిటివ్ షేడ్స్ తో ఓ ట్రాక్‌ని జోడించినా కిక్ రాలేదు. అలాగే కథలోని తండ్రి–కూతురు ఎమోషనల్ ఆర్క్‌కి సరైన ఇంటిగ్రేషన్ కాలేదు. అంటే, సబ్ ప్లాట్లు థీమాటిక్‌గా మెయిన్‌ స్టోరీకి కలవకపోవడం వల్ల రెండో భాగం డైల్యూట్ అయ్యింది. ఫలితంగా, ఫస్ట్‌హాఫ్‌లో క్రియేట్ చేసిన ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ సెకండాఫ్‌లో స్లో పేస్‌, రొటీన్ యాంగిల్స్ వల్ల తగ్గిపోతూ వచ్చింది. క్లైమాక్స్‌లో కూడా ప్రిడిక్టబుల్ రిజల్యూషన్ ఇవ్వడం వల్ల ఆడియన్స్‌కి “ఇప్పటికే తెలిసిన కథ” అనే ఫీల్ కలుగింది.

ఎవరెలా చేసారు..

అర్జున్‌గా అంకిత్‌ ఈ సినిమాలో రెండు వేర్వేరు షేడ్స్‌ కలిగిన పాత్రలో మెప్పించాడు. అతని పర్ఫార్మెన్స్‌కి నీలఖి ఇచ్చిన సపోర్ట్‌ వల్ల, అర్జున్–అలేఖ్య జంటగా తెరమీద కెమిస్ట్రీ బాగా పని చేసింది. మొదట అల్లరి, అమాయకంగా కనిపించే కాలేజీ అమ్మాయిగా నీలఖి ఆకట్టుకోగా, సెకండాఫ్‌లో సీరియస్ సన్నివేశాల్లో ఆమె చూపించిన భావోద్వేగం నిజంగా కనెక్ట్ అయ్యింది. ఇక మధ్యతరగతి తండ్రి నారాయణ పాత్రలో నరేశ్‌ తన సహజ నటనతో ఆడియన్స్ హృదయాన్ని తాకాడు. అసలు ఈ కథలో ‘హీరో’గా నిలిచేది ఆయనే అని చెప్పొచ్చు.

టెక్నికల్ వ్యూ

సంగీతం (విజయ్ బుల్గానిన్‌): పాటలు యూత్‌కి కనెక్ట్ అయ్యేలా మెలోడీ–ట్రెండీ మిక్స్‌లో ఉన్నాయి సినిమాటోగ్రఫీ (శ్రీ సాయికుమార్‌ దారా): విజువల్స్ కొత్త ఫీల్‌ని ఇచ్చాయి. కొన్ని ఫ్రేములు ఫోటోగ్రఫీ స్థాయిలో స్టైలిష్‌గా నిలిచాయి. కొరియోగ్రఫీ: మాంటేజ్ సాంగ్స్‌కి చేసిన కొరియోగ్రఫీ రియలిస్టిక్‌గా ఉండి, సన్నివేశాల్ని నేచురల్‌గా ముందుకు నడిపింది.

ఎడిటింగ్ (ఎస్‌బీ ఉద్దవ్‌): ఫస్ట్‌హాఫ్ పేసింగ్ బాగుంది. కానీ సెకండాఫ్‌లో కొంత డ్రాప్ కనిపించింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే ఇంపాక్ట్ మరింత పెరిగేది.

దర్శకుడు (జేఎస్ ఎస్ వర్థన్‌): డైరెక్షన్ పరంగా పెద్ద ప్రయోగం చేయకపోయినా, తనకు నచ్చిన ఎమోషన్–పాయింట్‌ని నిజాయితీగా చూపించాడు. కథ తెలిసినదే అయినా, మధ్యతరగతి తండ్రి–కూతురు బాండింగ్‌ని పక్కాగా చూపించడంలో విజయం సాధించాడు.

ప్లస్ పాయింట్స్:

మిడిల్‌క్లాస్ తండ్రి & కూతురి అనుబంధం.

టీనేజ్ లవ్ ప్రెజెంటేషన్ – యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది.

ఇంటర్వెల్ ట్విస్ట్ బలంగా ఉంది.

నరేశ్‌ పెర్ఫార్మెన్స్ – ఎమోషనల్ హార్ట్‌బీట్.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ లో సైకో –పోలీస్ ట్రాక్ రొటీన్‌గా అనిపిస్తుంది.

కథలో కొత్తదనం తక్కువ.

క్లైమాక్స్ ప్రిడిక్టబుల్.

ఫైనల్ థాట్ :

ప్రతి కూతురిలో ఒక చిన్న తిరుగుబాటు దాగి ఉంటుంది. ప్రతి తండ్రి గుండెల్లో ఒక భయం దాగి ఉంటుంది. ఆ రెండూ ఢీ కొన్నప్పుడు… జీవితం సినిమా అవుతుంది. మొత్తం మీద, ఇది “ఫీలింగ్‌కి కట్టుబడి చూసే సినిమా” – కానీ కథలో మలుపులు, టెన్షన్ ఎక్కువగా ఆశించే ప్రేక్షకుడికి మాత్రం రొటీన్‌గా అనిపించే అవకాశం ఉంది.

Tags:    

Similar News