'మేఘాలు చెప్పిన ప్రేమకథ' మూవీ రివ్యూ!
సౌండ్ బాగుంది, సెన్స్ మిస్ అయింది !
వరుణ్ (నరేశ్ అగస్త్య) — లగ్జరీ కార్లు, ఫారిన్ యూనివర్సిటీలు, బిజినెస్ మీటింగ్స్‌తో నిండిన జీవితం. కానీ ఆ వెలుగుల వెనుక దాగి ఉంది… సంగీతం కోసం తపించే ఒక మనసు. తండ్రి మహేంద్ర (సుమన్) — ఎమోషన్ కన్నా ఎకానమీని నమ్మిన మనిషి. తల్లి (ఆమని) — కొడుకులోని కళాకారుడిని అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి. మరి నాయనమ్మ (రాధిక)… ఆమె వయోలిన్ స్వరం వరుణ్‌లో జీవిస్తుంది. చిన్నప్పుడు ఆమె వాయించిన ఒక్క రాగం అతని జీవితమంతా ప్రవహించింది. ప్రేరేపిస్తోంది.
ఫారిన్‌లో చదువు పూర్తిచేసి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ పట్టిన వరుణ్‌కి ఒక్కరోజు స్పష్టమైంది — “ఇది నా జీవితం కాదు. ఇది ఇతరుల కల.”
అప్పుడు తీసుకున్న నిర్ణయం… కుటుంబాన్ని కుదిపేసింది. కోట్ల జీతాన్ని వదిలి వయోలిన్‌ను పట్టుకున్నాడు. “నేను బతకడానికి కాదు, వినిపించడానికి పుట్టాను,” — అని చెప్పి ఇండియాకి తిరిగొచ్చాడు.
కానీ తండ్రి మహేంద్రకు అది తిరుగుబాటు లాంటిది. “కళతో కడుపు నిండదు! జ్ఞాపకాలతో బతకలేవు!”. అతని కోపంలో ధ్వనించింది అధికారం, అహం, బాధ. వరుణ్ మౌనంగా బయటకు నడిచాడు. వెనక కదిలిన తల్లికంటతడి, ముందున్న తెలియని మార్గం. ఇక్కడినుంచి మొదలవుతుంది నిజమైన సంగీతం…
అక్కడే అతనికి ఎదురవుతుంది మేఘన (రాబియా ఖతూన్). ఆమె గతం మిస్టరీగా ఉంటుంది, ఆమె కళ్లలో ఓ రాగం దాగి ఉంటుంది.
ఆమె స్వరం అతని వయోలిన్‌లో మిళితమవుతుంది… కానీ ప్రేమ రాగమా? లేక బాధా? అని అతనికి కూడా అర్థం కాకుండా పోతుంది.
ప్రతీ స్వరానికి ఒక తపన ఉంటుంది… ప్రతీ తపన వెనుక ఒక నిశ్శబ్దం ఉంటుంది. వరుణ్ ఆ నిశ్శబ్దాన్ని స్వరంగా మార్చగలడా?
లేక ఆ స్వరం అతన్ని మౌనంగా మార్చేస్తుందా? ఒక యువకుడి తన ఆత్మ కోసం జరిపిన సంగీతయాత్ర — కళ, కుటుంబం, ప్రేమ మధ్య తూలిపోయిన హృదయం చుట్టూ తిరిగే కథ ఇది.
ఎనాలసిస్
ఈ సినిమా మొదలైన కాసేపటికే మనకు స్పష్టమవుతుంది — ఇది కమర్షియల్ సినిమా కాదు, కాన్సెప్ట్ సినిమా. ఒక యువకుడు కుటుంబ వ్యాపారాన్ని వదిలి సంగీతాన్ని ఎంచుకోవడం, తండ్రితో విభేదం, ప్రేమతో అతని అన్నీ జీవితార్దం తెలియటం — ఇవన్నీ కథకు బలమైన ఎమోషనల్ రూట్‌లా కనిపిస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆ కాన్సెప్ట్ “సినిమాటిక్ ఆర్క్” కాకుండా “సెంటిమెంట్ లూప్” గా నడుస్తుంది. కథ ఎక్కడ మొదలైందో, అక్కడే తిరిగి ముగుస్తుంది.
ప్రేక్షకుడు ఒక దశలో “ఇది ఎక్కడికి వెళ్తోంది?” అని కాకుండా “ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు?” అనిపించే స్థితి.ప్రతీ సీన్ భావోద్వేగంతో రాసినా, అందులో ఎటువంటి “నేరేటివ్ ఇంపల్స్” లేదు. కథలోని మెయిన్ ప్లాట్ తో సమానంగా సబ్‌ప్లాట్స్ ఒక్కొక్కటీ సొంత ఎమోషనల్ వాల్యూ కలిగి ఉన్నా, ఇవి ఒకదానిని ఇంకోటి డ్రైవ్ చేయడంలో విఫలమయ్యాయి.
సినిమా మొత్తం మూడ్ పెయింటింగ్‌లా ఉంది. కానీ కథ డ్రామాటిక్ రిథమ్ కోల్పోయింది. సినిమా డైరెక్టర్ స్పష్టంగా “కవితాత్మక ట్రీట్మెంట్” కోరుకున్నాడు. ఫ్రేమ్స్ సున్నితంగా ఉన్నాయి, లైటింగ్ సుభ్రమైనది, సంభాషణలు కొన్నిసార్లు మ్యూజికల్ డైలాగ్స్‌లా ఉన్నాయి. కానీ ఇక్కడే ఆ కళాత్మకత సినిమాను దూరం చేసింది. కవితలో భావం చాలు. కానీ సినిమాలో క్లాష్, టెన్షన్, రిజల్యూషన్ అవసరం.
ప్రేక్షకుడు అందమైన దృశ్యాల మధ్య “ఏదైనా జరగాలని” ఎదురు చూస్తాడు. ఇక్కడ ఏమీ జరగదు. అందుకే ఒక దశలో సినిమా “అందమైన బోరింగ్” గా అనిపిస్తుంది.
టెక్నికల్ ప్యాకేజ్:
కెమెరా బాగుంది — కొన్ని ఫ్రేములు పియానో టోన్‌లా కనిపిస్తాయి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో క్లాసికల్ టచ్ ఉన్నా, సన్నివేశాల రిథమ్‌ని సేవ్ చేయలేకపోయింది.
ఎడిటింగ్ మెల్లిగా నడిపినందున, స్క్రిప్ట్ పేస్ మరింత స్లో అయ్యిపోయింది.
ఫైనల్ థాట్
ప్రతీ రాగం అందంగా ఉండదు. కొన్నిసార్లు మౌనం కూడా నొప్పిస్తుంది.
చూడచ్చా
చూడచ్చు… కానీ పాప్‌కార్న్ తో కాదు, కాఫీ తీసుకెళ్లి.
ఎక్కడుంది
ఈటీవీ విన్ ఓటిటిలో తెలుగులో ఉంది.