మేరే పాస్ మాఁ హై! ఎంత పెద్ద హిట్టంటే... చివరకు యాడ్‌లో కూడా ఈ డైలాగే

బిగ్ బీ, శశి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దివార్’. ఈ సినిమాలో అంతకుమించిన హిట్ డైలాగ్ ‘మేరే పాస్ మాఁ హే’. అంత హిట్ ఎలా అయిందో తెలుసా..

Update: 2024-05-10 03:51 GMT

కేవలం డైలాగులుతో ఆడిన సినిమాలు ఎన్నో చూస్తూంటాం. కానీ ఎప్పుడో 1975లో వచ్చిన సినిమాలోని ఒకే ఒక డైలాగు సూపర్ హిట్ అయ్యి చివరకి యాడ్స్‌లో కూడా కనపడుతోంది. ఇప్పటికీ ఆ డైలాగు గురించి మాట్లాడుకుంటున్నామంటే అది మామూలు విషయం కాదు. ఆ డైలాగు మరేదో కాదు ‘మేరే పాస్ మా హై..’. ఈ డైలాగు వినని వాడు లేడు అన్నంతగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా అమితాబ్‌ని యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తీర్చిదిద్దిన ‘దీవార్’లోనిది.

ఒకే తల్లి పేగు తెంచుకొని పుట్టిన ఇద్దరు కొడుకులు వేర్వేరు దారుల్లో తమ జీవితాన్ని చూసుకున్నారు. ఒకరు క్రిమినల్, మరొకరు పోలీస్. అయితే తాము ఎంచుకున్న దారులు వేరేమో కానీ తమకు తల్లి మీద ప్రేమ మాత్రం సమానమైనదే. వాళ్లిద్దరి ఆలోచనలు వేరు కావచ్చు కానీ తల్లి మీద అనురాగం మాత్రం తక్కువేమీ కాదు. ఆ సంఘర్షణ నుంచి పుట్టిందే ‘మేరే పాస్ మా హై’ డైలాగు.

‘మేరే పాస్ బంగ్లా హై, గాడీహై, పైసాహై, బ్యాంక్ బ్యాలెన్స్ హై.. తేరే పాస్ క్యాహై’(ఇవ్వాళ నా దగ్గర బంగ్లా ఉంది. కారు ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. మరి నీ దగ్గర ఏముంది?) అని ‘దీవార్’ లో క్రిమినల్ అయిన అమితాబ్ అంటే.. పోలీస్ అయిన శశికపూర్ తగ్గేదేలే అన్నట్లు ‘మేరే పాస్ మా హై..’ (నా దగ్గర అమ్మ ఉంది) అంటాడు. ఆ ఒక్క డైలాగ్‌తో సినిమా అందరి హృదయాన్ని గెలిచారు. సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు! ఈ డైలాగు ఎంత పాపులర్ అంటే అప్పట్లోనే ఎనభైల్లో వచ్చిన ఓ తెలుగు సినీ పత్రికలో ఓ యాడ్ ఇందుకు నిదర్శనం.

‘నా దగ్గర బంగళా లేదు, కారు అసలే లేదు కానీ తినేందుకు రెండు పూటలా క్యాడ్ బరీస్‌లు అయితే ఉన్నాయి కదా’ అని ఓ అమ్మాయిని చూసి శశి కపూర్ చెప్తూంటాడు. ఆ యాడ్‌ని చూడగానే నవ్వు వస్తుంది. అలాగే పాపులర్ అయిన ఆ డైలాగు, ఐకానిక్ సీన్ ఒక్కసారిగా మనస్సులో మెదులుతుంది. యశ్‌చోప్రా దర్శకత్వంలో 1975లో వచ్చిన ఈ ‘దీవార్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో విజయ్, రవి పాత్రలను అమితాబ్, శశికపూర్ పోషించారు. ఇద్దరి మధ్య వచ్చే ఈ డైలాగ్‌కు థియేటర్‌.. చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిందని ఇప్పటికి అప్పటి రోజులు గుర్తు చేసుకుంటారు. ‘దీవార్’ విడుదలై దాదాపు 50 ఏళ్లు దగ్గర పడుతున్నా ఈ డైలాగ్‌కు క్రేజ్ తగ్గలేదు.

 

అంతెందుకు ఈ సినిమా పోస్టర్‌ను స్వచ్ఛభారత్‌ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన నైనిటాల్‌లో ఎవరో ఈ పోస్టర్ అతికించారు. అందులో ఒకవైపు అమితాబ్, మరోవైపు శశికపూర్‌ ఉండగా వాళ్లిద్దరికి మధ్యలో తల్లి నిరుపమా రాయ్ ఉంటారు. సినిమాలోని 'మా' సీన్‌ను ఇక్కడ యథాతథంగా ఉపయోగించుకున్నారు. అయితే డైలాగును మాత్రం కొద్దిగా మార్చారు. నిజాయితీపరుడైన చిన్నకొడుకు దగ్గర ఉంటానని చెప్పాల్సిన తల్లి.. ''ముందుగా ఎవరు ఇంట్లో బాత్రూం కట్టిస్తారో వాళ్ల దగ్గరే నేను ఉంటా'' అని చెప్పినట్లుగా ఆ పోస్టర్‌లో ఉంది.

పర్యాటకులు ఎక్కువగా వచ్చే నైనిటాల్‌లో ప్రజలను స్వచ్ఛభారత్‌ దిశగా ప్రోత్సహించేందుకు ఎవరో ఈ పోస్టర్‌ను రూపొందించి అక్కడ అతికించారు. దాన్ని ప్రధాని నరేంద్రమోదీకి ఒక ఫాలోవర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ చూసిన మోదీ.. దాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇక తన దీవార్ సినిమాను తన తల్లి చాలా సార్లు చూసిందని, గంటల తరబడి చిన్నపిల్లలా ఏడ్చిందని, తన కుమారుడిని కోల్పోయినట్లుగా విలపించిందని అమితాబ్ గతంలో ఆమె పుట్టిన రోజున గుర్తు చేసుకున్నారు. అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే ఇంతకు మించి మాట ఏముంటుంది అందుకే ఈ సీన్...డైలాగు అజరామరం. ఇక ఈ సినిమాని తెలుగులో ‘మగాడు’ పేరుతో ఎన్టీఆర్ రీమేక్ చేశారు. తెలుగు నాట ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా గురించిన మరో విశేషం..

ఈ సినిమాలో అమితాబ్ డ్రస్ బాగా పాపులర్. అమితాబ్ నిండైన విగ్రహానికి ఫెరఫెక్ట్‌గా సింకైనట్లు అనిపిస్తుంది. రెండు బటన్లు పైకి ముడేసిన బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ఖాఖీ ప్యాంటు, భుజం మీద వేలాడే తాడు కలిసి ‘దీవార్’లో అమితాబ్ బచ్చన్‌కు యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ తెచ్చాయి. అయితే ఈ లుక్‌కి కారణం క్రియేటివిటీ కాదని, టైలర్ చేసిన తప్పు అని అమితాబ్ చెప్పారు.

దీవార్ సినిమాలో అమితాబ్ చొక్కా ముడేసుకోవడానికి కారణం. టైలర్ పొరపాటుగా చొక్కాను పొడుగ్గా కుట్టేయటమేనట. అమితాబ్ బచ్చనే పొడవు. ఇంకా పొడవు షర్టు బాగోదని భావించిన అమితాబ్, రెండు బటన్లు విప్పి ముడేసి, భుజం మీద తాడు వేసుకున్నారట. అంతే, దర్శకుడు ఓకే చేయడం, సినిమాలో ఆ లుక్‌తో అమితాబ్‌కు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా విపరీతమైన క్రేజ్ రావడం జరిగిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్టై నిర్మాతపై కనకవర్షం కురిపించడం జరిగింది.

Tags:    

Similar News