నాగచైతన్య 'తండేల్' రివ్యూ

ఈ మధ్యకాలంలో నాగచైతన్య చిత్రం ఏదైనా భారీ అంచనాలతో రిలీజైంది అంటే అది కేవలం తండేలు మాత్రమే.;

Update: 2025-02-08 06:12 GMT

ఈ మధ్యకాలంలో నాగచైతన్య చిత్రం ఏదైనా భారీ అంచనాలతో రిలీజైంది అంటే అది కేవలం తండేలు మాత్రమే. గతంలో ఎన్నడూ లేని విధంగా చైతు ఈ సినిమాలో కనిపించడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ప్రమోషన్స్ గట్టిగా చేశారు. సాయి పల్లవి, నాగచైతన్య క్రేజీ కాంబినేషన్. ఇవన్నీ ఈ సినిమాకు ఏ మేరకు ఉపయోగపడ్డాయి. సినిమాలో కథేంటి, నచ్చిన అంశాలు , నచ్చని విషయాలు ఏమిటి వంటివి రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

శ్రీకాకుళంలో మత్య్సకారుల కుటుంబానికి చెందిన రాజు (నాగచైతన్య) ...సత్య (సాయి పల్లవి) తో పూర్తి ప్రేమలో ఉంటారు. అతను తన వృత్తి ప్రకారం తమ ప్రాంతానికి చెందిన వారితో కలిసి గుజరాత్ వెళ్లి చేపల వేట సాగిస్తూంటాడు. ఏడాదికి తొమ్మిది నెలలు సముద్రంలోనే ఉంటాడు. అయితే అప్పుడప్పుడు ఈ చేపల వేటలో ప్రమాదాలు చోటు చేసుకుంటూంటాయి. అలా తమ ఊరి సమీపంలో చేపల వేటకు వెళ్లిన ఒకతను మరణించడంతో రాజు ని సముద్రంపైకి వెళ్లవద్దని సత్య కోరుతుంది. అయినా ఆమె మాట కాదని వెళతాడు రాజు.

అలా గుజరాత్ సముద్ర జలాల్లో రాజు ఆధ్వర్యంలో చేపల వేటకు వెళ్లిన 22 మంది శ్రీకాకుళం జాలర్లు తుఫానులో చిక్కుకుంటారు. పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక జాలరిని రక్షించే క్రమంలో ఆ దేశ జలాల్లోకి వెళతారు. దాంతో అక్కడ కోస్టు గార్డులు అరెస్ట్ చేసి కరాచీలోని సింధ్ జైలుకు తరలిస్తారు. తర్వాత ఏమైంది? వాళ్లు ఎలా తిరిగి వచ్చారు. వాళ్ళు తిరిగి రావడం వెనుక సత్య పాత్ర ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ

నిజ జీవిత కథలు తెరకెక్కిచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం తేడా కొట్టినా అవి డాక్యుమెంటరీలుగా మారిపోతాయి. తండేలు కథలో ..కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే అవి పండేలా వాటని పట్టుకుని ట్రీట్మెంట్ చేస్తేనే ఎక్కుతుంది. ఈ సినిమాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు పాకిస్తాన్ చేతికి చిక్కడం, అక్కడి నుంచి వాళ్ళను మన దేశానికి తీసుకు రావడం, మధ్యలో కుటుంబ సభ్యుల సంఘర్షణ... వాస్తవంగా జరిగిన కథలో దేశభక్తితో పాటు ప్రేమ, మానవ భావోద్వేగాలు ఉన్నాయి. అన్ని ఉన్నట్లే కనపడుతున్నాయి .కానీ డ్రామాకు సరపడేటంత కాంప్లిక్ట్స్ పాయింటా లేదా అన్న దగ్గరే సమస్య.

ముఖ్యంగా డైరెక్టర్ కు ఓ భయం ఉంటుంది. తన భర్త ఎక్కడో పాకిస్తాన్ జైల్లో పట్టుబడితే భార్య పోరాటం మొదలెడితే అది మణిరత్నం రోజా సినిమాలా మారిపోతుంది అని. అది జరగకుండా ఉండటం కోసం సాయి శక్తులా ట్రై చేసాడు. అయితే సాధ్యం కాలేదు. కథలో ఉన్న కీ ఎలిమెంట్స్ ఎక్కడికి పోతాయి. మరీ ముఖ్యంగా ఇది సాయి పల్లవి పాత్ర హైలెట్ అయ్యే కథ. ఎంత నాగచైతన్య ని లేపుదామన్నా కుదరదు. నాగచైతన్య పాత్రను లేపే క్రమంలో పాకిస్తాన్ జైల్లో దేశ భక్తి సీన్స్ పెట్టారు. దాంతో అది ప్రక్కదారి పట్టినట్లు అయ్యింది. అదే సినిమాని ఇబ్బందుల్లో పడేసింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, సాయిపల్లవి డాన్స్ లు ఎంత సాయం పట్టిన ఓ స్థాయి దాకానే సినిమాని తీసుకువచ్చి వదిలాయి.

టెక్నికల్ గా...

సినిమా కథను వాస్తవంగా జరిగిన దాన్ని తీసుకున్నప్పుడు సన్నివేశాలు విషయంలో ఓవర్ ద బోర్డ్ వెళ్లకూడదు. కానీ ఇందులో అలాంటి సీన్స్ ఉన్నాయి. ఇక దర్శకుడుగా చందు మొండేటి లవ్ సీన్స్ మీద పెట్టిన దృష్టి మిగతా సినిమాపై పెట్టినట్లు కనపడదు. స్క్రీన్ ప్లే సరిగ్గా కుదలరేదు. దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. సెకండాఫ్ లో ఎడిటర్ మరింత షార్ప్ చేయాల్సింది. కెమెరా వర్క్ సినిమాకు పెద్ద ప్లస్.

చూడచ్చా

సినిమాగా మరీ తీసిపాడేసే సినిమా కాదు. అలాగని అద్భుతం అనుకుని పరుగెత్తే సినిమానూ కాదు. సాయి పల్లవి డాన్స్ ల కోసం, దేవి మ్యూజిక్ కోసం , నాగచైతన్య నటన కోసం సినిమా ఓ సారి చూడచ్చు.

Tags:    

Similar News