ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్“DNA” ఓటిటి మూవీ రివ్యూ
ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి తెలుగు వెర్షన్ తో వచ్చింది. ఎలా ఉంది సినిమా, కథేంటి, చూడదగినదేనా?;
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నడిచే యాక్షన్ థ్రిల్లర్లు చాలా తక్కువ వస్తుంటాయి. ఒకవేళ వస్తే, అవి ఎక్కువ యాక్షన్ కన్నా ఫ్యామిలీ ఎమోషన్స్ కే ప్రయారిటీ ఇస్తూంటాయి. రీసెంట్ గా వచ్చిన తమిళ “DNA” (తెలుగు డబ్బింగ్) ఆ జానర్ కు చెందిందే. వివాహ బంధం, వ్యక్తిగత లోపాలు, తల్లిదండ్రుల బాధ్యత... ఇవన్నీ ఒక మిస్టరీ ట్రాక్‌లో అల్లుకుంటూ వెళ్లిన కథ. ఎమోషనల్ రూట్‌ను వదిలిపెట్టకుండా, థ్రిల్లర్‌కు అవసరమైన మసాలాతో నింపిన చిత్రమిది. ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి తెలుగు వెర్షన్ తో వచ్చింది. ఎలా ఉంది సినిమా, కథేంటి, చూడదగినదేనా?
స్టోరీ లైన్
ఆనంద్ (అథర్వ) ప్రేమలో విఫలమై బాధలో డ్రగ్స్ తీసుకుంటూ తన ప్రపంచంలో తాను తిరుగుతూంటాడు. దాంతో పెళ్లి చేస్తే దారినపడతాడని వాళ్ల అమ్మా,నాన్నా దివ్య (నిమిషా సజయన్) తో సంబంధం ఖాయం చేస్తారు. అయితే ఆ borderline personality disorder తో బాధపడుతూంటుంది. పెళ్లై, ఆమె నెల తప్పుతుంది. బిడ్డను కనడానికి హాస్పటిల్ లో చేరుతుంది. ఓ మగపిల్లాడు పుడతాడు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న సమయంలో ఆమె తన బిడ్డ మాయమైందని, వేరే బిడ్డను తెచ్చి తన దగ్గర పెట్టారని గోల గోల చేస్తుంది. అయితే ఆమెకు మానసిక సమస్య ఉండటం వలన ఇలా గోల చేస్తోందా లేక నిజంగానే జరిగిందా ఎవరికీ అర్దం కాదు.
చివరకు ఆనంద్ తమ దగ్గర ఉన్న బిడ్డకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో DNA టెస్ట్ చేయిస్తాడు. ఆ క్రమంలో షాకింగ్ విషయం రివీల్ అవుతుంది. ఆమె చెప్తోంది నిజమే. ఆ బిడ్డ వారి బిడ్డ కాదు. మరి తమ బిడ్డ ఏమైపోయింది. దీని వెనక ఏదైనా కుట్ర ఉందా, ఉంటే తమ బిడ్డను ఎత్తుకుపోయి వేరే బిడ్డను ఎందుకు వదిలేసారనేది ఓ పెద్ద ప్రశ్నగా వారి ముందు నిలుస్తుంది. అప్పుడు ఆనంద్ అసలేం జరిగిందో తవ్వటం మొదలెడతాడు. ఆచూకి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో రకరకాల విషయాలు,షాకింగ్ నిజాలు బయిటకు వస్తాయి. అవేంటి, చివరకు ఏమైంది. వాళ్ల బిడ్డ వారికి దొరికిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
DNA సినిమాతో డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ ఓ సాలిడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇద్దామనే ప్రయత్నం చేసారు. ఈ కథలో ఇద్దరు లోపాలున్న వ్యక్తులు — ఆనంద్, దివ్య — పెళ్లి అనే రిలేషన్‌షిప్‌లోకి వచ్చాక, తమ జీవితాన్ని, నిజమైన భావాలను అర్థం చేసుకోవాలనేది ఇంటర్నెల్ ఐడియా. దానికి డైరెక్టర్ నగరంలో చైల్డ్ కిడ్నాప్‌లు ఎలా జరుగుతున్నాయో, ఎంత డార్క్ వాతావరణముందో చూపిస్తూ, అసలు దివ్య, ఆనంద్ వాళ్ల బిడ్డను టైమ్‌కంటే ముందే దొరకజేస్తారా లేదా? అనే ఉత్కంఠను చివరి దాకా మేనేజ్ చేసాడు. ఇదంతా చూస్తూంటే ఈ జనరేషన్‌కు నచ్చేలా ఎమోషన్, మిస్టరీ, హ్యూమన్ కనెక్ట్ — అన్నీ బలంగా కట్ చేసిన థ్రిల్లర్ అనిపిస్తుంది.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మోడరన్ ఐడియాతో వచ్చిన కథను చాలా ఓల్డ్ స్కూల్ స్టైల్‌లో ప్రెజెంట్ చేశారు. అలాగే స్క్రీన్ ప్లే మొదటి నుంచి చివరి వరకూ ఒకే పేస్ లో వెళ్లదు. ప్రారంభం ఓ జంట మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా నడుస్తున్న సినిమా… సడెన్‌గా "హీరో vs క్రిమినల్స్" అన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా మారిపోతుంది. జానర్ మారడంలో తప్పు లేదు కానీ, రెండో భాగం వచ్చేసరికి టోన్ పూర్తిగా ఎక్కడికో వెళుతుంది.
టెక్నికల్ గా ..
డైరెక్టర్ నెల్సన్‌కి ఈ సినిమా టెక్నికల్ టీమ్ గట్టి సపోర్ట్ అందించింది.
సినిమాటోగ్రఫీ (పార్థిబన్) సినిమాకు అవసరమైన మూడ్, టెన్షన్‌ని క్రియేట్ చేసింది. ఇన్‌ప్రోగ్రెస్ బిల్డింగ్‌లో జరిగే ఫైట్ సీన్‌లో లైటింగ్ హైలైట్.
ఘిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్‌కి అసలు స్పైన్ లా పనిచేస్తుంది. సాబు జోసఫ్ ఎడిటింగ్ కూడా అదే లెవెల్లో ఉంది – షార్ప్ కట్స్‌తో టెంపో తగ్గకుండా అందించారు, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఈ ముద్దరు టెక్నీషియన్స్ పోటీ పడ్డారు. పాటలు బాగోలేవు. స్క్రిప్టు పరంగా మాడరన్ స్టోరీ, ఓల్డ్ ట్రీట్‌మెంట్ పూర్తి సింక్ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ సైతం బాగా చేసారు.
చూడచ్చా
ఓ లుక్కేయచ్చు, థ్రిల్లర్ అభిమానులకు నచ్చుతుంది.
ఎక్కడుంది
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.