నెరు: ఈ సినిమా చూసేందుకు కొంచెం ధైర్యం, ఓపిక కావాలి మరి

ఎందుకంటే, ఇది మిమ్మల్ని ఒక పోరాటంలోకి లాక్కెళుతుంది. ఒక బాధితురాలి తరఫున పోరాడేలా చేస్తుంది. ఫైట్లు, పాట‌లు, కామెడీ ట్రాక్ కోసం చూడాల్సిన సినిమా కాదు.

Update: 2024-02-06 09:05 GMT


ఓ ఒటిటి  సినిమా



- సూర్యప్రకాష్ జోశ్యుల


కోర్టు తీర్పులు సాక్ష్యంపై ఆధారపడిన సత్యంపై ఆధారపడి ఉంటాయి. అవును ఎంత గొప్ప నిజమైనా నిరూపించాలంటే సాక్ష్యాలు,సాక్షులు కావాల్సిందే. అందుకే నేరం ఎలాంటిదైనా ‘ఐ విట్నెస్’కు ఉన్న బలం ఇంక దేనికీ ఉందు. కానీ ఆ ‘ఐ’(చూపు) లేని ఓ అమాయకురాలిపై అఘాయిత్యం జరిగితే? కోర్టులు,చట్టాలు ఆ కేసుని ఎలా పరిష్కరిస్తాయి... ఎవరు సాక్ష్యంగా నిలుస్తారు? ఆ బాధితురాలు తనకు జరిగిన దారుణాన్ని కోర్టులో ఎలా నిరూపించగలుగుతుంది ? ఇది పెద్ద ప్రశ్నే. ఇదే కంటెంట్ తో 'నెరు' సినిమా సాగుతుంది. ఓటిటిలో ఇప్పుడు ఈ సినిమా ఓ సెన్సేషన్. సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.

కథగా చూస్తే సారా మహమ్మద్ (అనస్వర రాజన్)కి కళ్లు కనిపించటం మానేస్తాయి. అయినా ఆమె బ్రతుకు ఆమె తల్లి,మారుటి తండ్రితో ఆనందంగా గడిపేస్తోంది. అయితే ఓ రోజు ఆమె తల్లి, తండ్రి పెళ్లికు వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తాడు. కళ్లు ఉన్న వాళ్లు అయితే ఫలానా వాళ్లు తనని బలాత్కరించారని గుర్తు పట్టగలరు, కేసు పెట్టగలరు. కానీ ఆమె అంధురాలైపోయింది. కానీ ఆమెకు ఓ ప్రత్యేకమైన వరం ఉంది. అది తన తండ్రి వద్ద బంకమట్టితో శిల్పాలు చేసే కళ. దాంతో ఆమె తన మీద అత్యాచారం చేసిన వ్యక్తి శిల్పాన్ని సిద్ధం చేస్తుంది. దీంతో ఈ శిల్పానికి దగ్గర పోలికలున్న మైకేల్ (శంకర్ ఇందుచూడన్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.

కానీ అతడేమో పెద్ద ఇండస్ట్రిలియస్ట్ కొడుకు కావడంతో.. దేశంలో పెద్ద లాయిర్ ని పెట్టుకుంటాడు. తన వాదనా పటిమతో ఎలాంటి కేసు అయినా సరే చిటకలో గెలిచేసే సుప్రీం కోర్ట్ లాయర్ రాజశేఖర్ (సిద్దిఖి) వల్ల బెయిల్ వస్తుంది.
బాధితురాలి తరుపున ఆ పెద్ద లాయిర్ కు భయపడి ఎవరూ వాదించటానికి ముందుకు రారు. ఒకరిద్దరు తమంతట తాము వాదిస్తామని వచ్చినా వాళ్లంతా రాజశేఖర్ కొనేసి పంపబడ్డ వాళ్లు. కానీ ఆమె తల్లి,తండ్రి, సారా.. వీళ్లు ఎవరూ ఆ కేసుని వదలదలుచుకోలేదు. అప్పుడు పూర్తిగా లాయర్ ప్రాక్టీస్ మానేసిన విజయ మోహన్(మోహన్ లాల్) కనపడ్డాడు. 
విజయ్ కు కూడా ఈ కేసు తీసుకోవాలని లేదు. అయితే,  చూపులేని అమ్మాయి కు ఉన్న ధైర్యం కు సపోర్ట్ చేయాలనిపించింది. నల్లకోటు తొడిగాడు. వాదోపవాదాల, అన్యాయపు ఆరోపణలును తిప్పి కొట్టడాలు..ఎత్తుకు పై ఎత్తులు..ఊపిరి సలపనివ్వని డ్రామా..ఆఖరికి గెలుపు.

ఏముంది ఇందులో .. చాలా ఉంది. ‘దృశ్యం’ సీరిస్ దర్శకుడు జీతూ జోసఫ్ స్క్రీన్  ప్లే పనితనం, మోహన్ లాల్ విశ్వరూపం,నిజం గెలుస్తుందనే నమ్మకం ఉన్నాయి.

ఈ కోర్ట్ రూమ్ లో అంతంత సేపు జరిగే డ్రామా ఎవరు చూస్తారు..బోర్ కదా అంటే . బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అనే ఎమోషన్ అద్భుతంగా క్రియోట్ చేశారు. అది   మిమ్మల్ని స్క్రీన్ నుంచి కళ్లు కదలనివ్వదు. చివరకు మనమే ఆ రేప్ విక్టిమ్ కు ధైర్యం చెప్పాం,ఓదార్చాం, గెలిపించాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది చాలు కదా.

ఇక డిసెంబరు 21న కేరళలో విడుదలైన ఈ చిత్రం అక్కడ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.  రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)లో అందుబాటులోకి వచ్చింది. మోహన్‌లాల్‌- జీతూ జోసెఫ్‌ అంటే మన అందరికీ గుర్తొచ్చేది సూపర్ హిట్ ‘దృశ్యం’రెండు పార్ట్ లు. ఇవి రెండూ తెలుగులో రీమేక్ అయ్యాయి.

అలాగే ఈ సినిమాని సైతం తెలుగులో వెంకటేష్ తో చేద్దామనుకున్నారు. కానీ ఎందుకనో విరమించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్‌’గుర్తుకు వస్తుందని భావించి ఉండవచ్చు. ఇక టెక్నికల్ గా అవుట్ స్టాండింగ్. అంధురాలి పాత్ర పోషించిన అనస్వర రాజన్‌ ఎక్స్ ప్రెషన్స్ అయితే చెప్పక్కర్లేదు. నిజమైన అంధురాలు ఏమో అని డౌట్ వస్తుంది.మోహన్ లాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.
డైరక్టర్ విజన్,కన్విక్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే  కేసు గెలిచిన తర్వాత మోహన్ లాల్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ కు మీకు గూస్ బమ్స్ వస్తాయి.
అలాగే సినిమా ఆఖర్లో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటే వచ్చే సీన్ కు లేచి టప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఫైట్లు, పాట‌లు, కామెడీ ట్రాక్ వంటి క‌మ‌ర్షియ‌ల్ హంగులు కోసం అయితే ఈ సినిమా చూడాల్సిన పనిలేదు.



సూర్యప్రకాష్ జోశ్యుల


(* సూర్యప్రకాశ్ జోశ్యుల చాలా పేరున్న మూవీ క్రిటిక్, వందల్లో మూవీ సమీక్షలు చేశారు. ఆయన వ్యాసాలు ‘హిచ్ కాక్ నుంచి నోలన్ దాకా’ అనే పేరుతో మూడు సంపుటాలుగా వచ్చాయి.)

Tags:    

Similar News