ఎన్టీఆర్ 'దేవర 2' ఇక లేనట్టేనా…బయిటకు రాని అసలు కారణం ఏమిటి?

వార్ 2 ప్రభావం పడిందా? షాకింగ్ రీజన్స్… నిరాశలో అభిమానులు!;

Update: 2025-08-16 06:08 GMT

ఓ పెద్ద ప్రాజెక్ట్‌ను ఓ స్టార్ హీరో ప్రక్కన పెట్టేశాడంటే… అది కేవలం ఒక సినిమా రద్దు కావడం మాత్రమే కాదు, దాని వెనుక పరిశ్రమలోని రకరకాల సమీకరణలు, మార్కెట్ లెక్కలు, వ్యక్తిగత అభిరుచులు, క్రియేటివ్ దిశ అన్ని కలిసిన లెక్కలు తో కూడిన కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు పబ్లిక్ డొమైన్‌లోకి వస్తాయి, మరికొన్ని మాత్రం ఇండస్ట్రీ గోడల మధ్యే మిగిలిపోతాయి. ప్రస్తుతం అలాంటి సిట్యువేషన్ దేవర 2 విషయంలో కనిపిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్—దేవర సక్సెస్‌ తర్వాత వెంటనే అనౌన్స్ అయిన ఈ సీక్వెల్‌… ఇప్పుడు పూర్తిగా అగిపోయే దశకు చేరుకుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయింది. ఇది కేవలం “డేట్ మార్చేశారు” అనే స్థాయి విషయం కాదు; ఇండస్ట్రీలో ‘ఎందుకు?’ అనే ప్రశ్నకు సమాధానం కోసం జనం లోతుగా తవ్వడం మొదలుపెడుతున్న సంగతి. అసలేం జరిగింది?

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌ ఇచ్చిన ఉత్సాహంతో వెంటనే దేవర 2 వస్తుందని ప్రకటించింది టీమ్. అలాగే కొరటాల శివ స్క్రిప్ట్‌ను పూర్తిచేసి, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

అయితే పరిస్థితి చూస్తూంటే దేవర 2 ఇక జరగబోదన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కారణం అధికారికంగా బయటకు రాకపోయినా, ఇండస్ట్రీ వర్గాల మాట ప్రకారం ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్‌నే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

డ్రాగన్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్, ఆ వెంటనే తమిళ దర్శకుడు జైలర్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నారు. అయితే దేవర 2 ని ఎందుకు ప్రక్కన పెట్టారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అదే సమయంలో, “ఎన్టీఆర్‌కు దేవర 2పై ఆసక్తి తగ్గిందని, అందుకే వరుస ప్రాజెక్టులతో షెడ్యూల్ ఫుల్ చేసుకున్నారని” అనేది మరో టాక్. వార్ 2 ఊహించని రీతిలో నిరాశపరిచిన నేపథ్యంలో, భారీ యాక్షన్ ప్రాజెక్టులపై ప్లానింగ్ మార్చుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఎన్టీఆర్ కెరీర్ ఇప్పుడు పాన్-ఇండియా దిశగా పీక్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన తీసుకునే ప్రతి ప్రాజెక్ట్ జాగ్రత్తగా ప్లాన్ అవ్వాల్సిందే. అందుకే దేవర 2 ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా ప్రక్కన పెట్టేసి, కొత్త డైరెక్టర్లు, కొత్త జానర్స్ వైపు అడుగులు వేస్తున్నాడు.

మరోవైపు, కొరటాల శివ మాత్రం దేవర 2పై నమ్మకంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రెండో భాగంలో జాన్వీ పాత్ర అసాధారణంగా ఉంటుంది. కథలో అసలు మలుపు అక్కడే. ప్రతి సీన్ హైలో ఉంటుంది. పార్ట్ 1లో మీరు చూసింది 10 శాతం మాత్రమే, పార్ట్ 2లో 100 శాతం చూపిస్తాం” అని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ కూడా గతంలో ఓ ఆంగ్ల ఇంటర్వ్యూలో, “పార్ట్ 1 షూట్ సమయంలోనే పార్ట్ 2కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తీసేశాం. ఇది దేవర కంటే మెరుగ్గా ఉంటుంది” అని చెప్పాడు.

కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే, ఆ నమ్మకం, ఆ వాగ్దానం అంతా గాల్లో కలిసిపోయే అవకాశం ఎక్కువ. కొరటాల శివ కూడా ఇప్పుడు కొత్త కథలపై దృష్టి పెట్టి, నాగ చైతన్య లేదా మరో యువ హీరోతో త్వరలో పని చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి — దేవర 2 ప్రాజెక్ట్ ఇక నిలిచిపోవడం ఖాయం అనిపిస్తోంది.

ఏదైమైనా...

దేవర 2 ఆగిపోయిందన్న వార్త నిజమైతే.., ఎన్టీఆర్ కెరీర్‌లో కేవలం ఇది ఒక ప్రాజెక్ట్ డ్రాప్ అయిన సంఘటన మాత్రం కాదు — ఇది స్టార్ హీరోలు తమ నెక్ట్స్ సినిమాలు ఎంచుకునే విధానంపై, పాన్-ఇండియా మార్కెట్‌లో ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎలా మారిపోతోందనే విషయంపై ఒక క్లియర్ గా కనపడుతున్న సంకేతం. మార్కెట్ ట్రెండ్, బాక్సాఫీస్ ఫలితాలు, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్, క్రియేటివ్ కమ్ఫర్ట్ — ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే పెద్ద సినిమాలు కదలికలో ఉంటాయి. ఒక్క లింక్ సడలినా, ఎంత పెద్ద హైప్ ఉన్న ప్రాజెక్ట్ అయినా గాల్లో కలిసిపోవచ్చు. దేవర 2 కథ కూడా అదే చెబుతోంది.

Tags:    

Similar News