'ఊరు పేరు భైరవకోన' మూవీ రివ్యూ

ఈ మధ్యకాలంలో పెద్దగా విజయాలు లేని విఐ ఆనంద్ సందీప్ కిషన్ తో మరోసారి ఒక సినిమా కొత్త పాయింట్ తో తీయడం అనేది కొంచెం సాహసమే. సినిమా రివ్యూ

Update: 2024-02-16 13:25 GMT
ఊరు పేరు భైరవ కోన (ట్విట్టర్ పోస్టర్ )

పెద్దగా హడావిడి ఆర్భాటం లేకుండా వచ్చేసింది సందీప్ కిషన్ సినిమా, " ఊరు పేరు భైరవకోన". మిస్టరీ, ఫాంటసీ థ్రిల్లర్లను ఇష్టపడే వి ఐ ఆనంద్ ఈ సినిమా దర్శకుడు, కథకుడు కూడా. ఆనంద్ ఇంతకుముందు తీసిన మూడు సినిమాల్లో ఒక్క క్షణం, డిస్కో రాజా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్లు. ఎక్కడికి పోతావు చిన్నవాడా మాత్రం సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఊరు పేరు భైరవకోన ఒక ఫాంటసీ, సూపర్ నేచురల్, రొమాంటిక్(!) యాక్షన్ సినిమా


ఎప్పుడు కొత్త పాయింట్ తో సినిమా తీయాలనుకునే దర్శకుడు ఆనంద్ ఈసారి "గరుడ పురాణం" ఆధారంగా తీసిన సినిమా. సందీప్ కిషన్ హీరోగా ఇది ఆనంద్ కి రెండో సినిమా. అప్పట్లో వచ్చిన టైగర్ పెద్దగా విజయవంతం కాలేదు. ఈ మధ్యకాలంలో పెద్దగా విజయాలు లేని విఐ ఆనంద్ సందీప్ కిషన్ తో మరోసారి ఒక సినిమా కొత్త పాయింట్ తో తీయడం అనేది కొంచెం సాహసమే.
ఈ సినిమాకు మూలం " గరుడ పురాణం". 18 హిందూ పురాణాల్లో, గరుడ పురాణం చివరిది. ఇందులో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి కి చావు పుట్టుకలు స్వర్గం నరకం గురించి చెప్పిన విషయాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇది నిజంగానే కొత్త పాయింట్. గరుడ పురాణంలో చివరి 4 పేజీల మీద ఆధారపడి తీసిన సినిమా. ఇది సూపర్ నేచురల్, మైథాలజికల్, హారర్, సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ అనొచ్చు.

సినిమా ప్రారంభంలోనే దర్శకుడు, గరుడ పురాణంలో ఆ చివరి నాలుగు పేజీల గురించి (శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశాడు అన్నది ప్రస్తావిస్తాడు. ఇది కొంత ఆసక్తికరంగా కనబడుతుంది. దీని మీద ఆధారపడి నడిపిన కథ వినటానికి బాగుంటుంది, కానీ తీసేటప్పటికీ ఎలా ఉంటుందన్నది ముఖ్యం.

ఈ సినిమా కథ ఇద్దరు(దొంగలు అనవచ్చా) మిత్రులు బసవ(సందీప్ కిషన్), జాన్(హర్ష చెముడు) ఒక పెళ్లిలో విలువైన నగలు దొంగలించి పారిపోయే క్రమంలో, భైరవకోన అనే ఊరికి వెళ్లడం, అక్కడ కొన్ని విచిత్రాలు చూడడం, చివరికి నగలు పోగొట్టుకోవడం. మళ్లీ అవే నగల కోసం భైరవకోన కు వెళ్లడం అనేది మూల కథ. అంతకుముందు ఫైట్ మాస్టర్ గా సినిమాల్లో పనిచేసే బసవ కు కాకతాళియంగా భూమి(వర్ష బొల్లమ్మ) తారసపడడం ఆమెతో ఆటోలో కొంతమందిని బసవ వెంటాడడం(ఇది కొంచెం ఎక్కువసేపు ఉంది) తర్వాత భూమి కనబడకుండా పోవడం, భూమిని బసవ ప్రేమించడం జరుగుతుంది. సినిమాలు ఈ భాగమే చాలాసేపు నడవడం వల్ల, సినిమా స్లోగా వెళ్ళినట్లు అనిపిస్తుంది.
కథ కూడా కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటూ నత్తనడక నడవడం సినిమాకు కొంత మైనస్ అయింది. మొదటి భాగంలో దర్శకుడు సినిమా కొంచెం నెమ్మదిగా నడిపించినప్పటికీ, తర్వాత కథను నడిపించడంలో చూపిన చొరవ, కామన్ సెన్స్ దీన్ని చూడదగ్గ సినిమాగా మలిచాయి.

ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే వర్షా బొల్లమ్మ పాత్ర పరంగా బాగానే చేసింది. ఈ అమ్మాయి త్వరలో ఇంకా కొన్ని సినిమాల్లో వివిధ భాషల తెరలపై కనిపించే అవకాశం ఉంది. ఇంతకు ముందే వచ్చిన ఈగల్ సినిమాలో కొంతసేపు కనిపించిన కావ్య థాపర్ పెద్దగా చేసింది ఏమీ లేదు. సందీప్ కిషన్ తన పాత్ర మేరకు పర్వాలేదనిపించాడు.

నటన పరంగా సర్ప్రైజ్ ప్యాకేజ్ హర్ష చెముడు. టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. ఇందులో ఎక్కువ నిడివి ఉన్న పాత్ర పోషించిన హర్ష వెన్నెల కిషోర్ తో కలిసి చేసిన కామెడీ, కథలో భాగమై ప్రేక్షకులను బాగా అలరించే అవకాశం ఉంది. ఈ సినిమాను కొంతవరకు నిలబెట్టేది హర్ష, వెన్నెల కిషోర్ల కామెడీ నే. ఇలాంటి సీరియస్ సినిమాలో కామెడీ పెద్దగా వర్కౌట్ కాదు. పైగా సినిమా కు అడ్డుగా నిలబడుతుంది. కానీ సర్ప్రైజింగ్ గా ఈ కామెడీ వర్కౌట్ అయింది. ఇక్కడ దర్శకుడు కాస్త తెలివితేటలు ప్రదర్శించాడు. ఇది ఒక కామెడీ ట్రాక్ మాదిరి కాకుండా కథలో కలపడం దర్శకుడు చేసిన తెలివైన పని. ప్రేక్షకులు రిలీఫ్ ఫీలయ్యేది, ఎంజాయ్ చేసేది ఇక్కడే. వెన్నెల కిషోర్ గురించి చెప్పాలంటే సినిమా లో, కథలో ముఖ్యమైన భాగమయ్యాడు. కామెడీ టైమింగ్ లో తనదైన శైలితో సినిమాకు ఒక బలమయ్యాడు. ఆశ్చర్యకరంగా ప్రముఖ తమిళ నటి మణి వడివక్కరసి ఈ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించింది. చాలా సాఫ్ట్ గా చక్కగా చేసింది. గరుడ పురాణాన్ని ఈ పాత్ర ద్వారా కొంత అర్థం చేసుకోవచ్చు. అలాగే రవిశంకర్ కూడా బాగానే చేశాడు. ఎమోషన్స్ ని బాగానే పండించాడు.

ఈ సినిమాకి మరో ప్రధాన బలం శేఖర్ చంద్ర అందించిన సంగీతం. ఈ మధ్యకాలంలో శేఖర్ చంద్ర అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కు అందించిన సంగీతం చాలా బాగుంది. . అలాగే ఇలాంటి సినిమాకు సరిపోయే నేపథ్య సంగీతం అందించడం, సినిమా ను కొంత చూడగలిగేలా చేసింది. అలాగే రాజ్ తోట ఫోటోగ్రఫీ కూడా అంతే. సినిమా మూడ్ ని ఎలివేట్ చేసింది. ఈ రెండిటితో పాటు, సినిమా ద్వితీయార్థంలో దర్శకుడు కొంచెం క్లారిటీతో ముందుకు వెళ్లడం, ఒకటి రెండు ట్విస్టులతో సినిమాని కొంచెం వేగంగా నడపడం కొంతవరకు ఈ సినిమాని చూడదగ్గ సినిమా గా చేశాయి. దర్శకుడు సినిమాని ఓ 20 నిమిషాలు తగ్గించి, ప్రధమార్ధంలో సరైన క్లారిటీతో, కాసింత వేగవంతమైన కథనంతో నడిపి ఉంటే మరింత బాగుండేది.

చివరగా చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన చాలా సినిమాల కంటే, ఈ సినిమా కొంచెం బెటర్ అనిపించే సినిమా. కొంత గందరగోళంతో, కొంత వరకు స్లోగా నడిచినా, ఈ సినిమాను ఇంతకు ముందు చెప్పిన కొత్త పాయింట్, కామెడీ,, నేపథ్య సంగీతం, ఫోటోగ్రఫీ కోసం పిల్లలు పెద్దలు కూడా చూడవచ్చు
నటీనటులు
సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ
వడివుక్కరసి, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పి. రవిశంకర్
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వీఐ ఆనంద్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మాటలు: భోగవరపు భాను , నందు సవిరిగాన
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
నిర్మాత: రాజేశ్ దండా
బ్యా నర్: హాస్య మూవీస్
విడుదల:ఫిబ్రవరి 16, 2024


Tags:    

Similar News