'హరి హర వీర మల్లు' నుంచి దిల్ రాజు టైమ్‌కి తప్పించుకున్నాడా ?

ఇదో కొత్త లెక్క;

Update: 2025-07-26 04:54 GMT

పెద్ద సినిమా ఒకటి రిలీజ్ కాబోతుందంటే, దాని డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం అనేక మంది పోటీ పడతారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు — ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి వారివి — కంటెంట్ ఎలా ఉన్నా, ఓపెనింగ్స్ మాత్రం రేంజ్‌లో ఉంటాయి. ఫస్ట్ డే కలెక్షన్లే లక్షల్లో కాదు కోట్లలో వస్తాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు ముందే ట్రేడ్ లెక్కలు వేసుకుంటారు. ఎవరిలో వారు హక్కుల కోసం బిడ్డింగ్‌కి దిగతారు. అదే సమయంలో, నిర్మాతలు కూడా ఈ పోటీని బాగా ఉపయోగించుకుంటూ ఎక్కువ మొత్తానికి డీల్ చేయాలనే లక్ష్యంతో తమ లెక్కలు వేస్తారు.

అయితే, కొన్నిసార్లు డీల్ కుదరకపోవడం అప్పట్లో నిరాశగా అనిపించినా… ఆ తర్వాత ఫలితాలను చూసిన తర్వాత అదే నిర్ణయం లాభంగా మారినట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి కూడా అలాగే ఉంది అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

"హరి హర వీరమల్లు" హక్కుల కోసం చివరి వరకూ ప్రయత్నించినా, డీల్ ఫిక్స్ కాలేదు. అప్పట్లో కొంచెం బాధగా అనిపించినా, ఇప్పుడు సినిమా ఫలితాన్ని చూసిన తర్వాత ట్రేడ్ లో అంటున్నారు — దిల్ రాజు టైమ్‌కి తప్పించుకున్నాడు బాస్!

ఏం జరిగింది

పవన్ కళ్యాణ్‌ నటించిన హరి హర వీరమల్లు ఇటీవలే థియేటర్లలో విడుదలై రెండో రోజే భారీగా క్రాష్‌ అయ్యిన సంగతి తెలిసిందే. సాధారణంగా పెద్ద సినిమాలు దారుణంగా ఫెయిల్ అయితే నిర్మాతలకే కాదు, పంపిణీదారులకూ తీరని నష్టాలు వస్తాయి. అయితే ఈసారి మాత్రం ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాత్రం చక్కగా తప్పించుకున్నాడు.

దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర హక్కులను కొనుగోలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ సినిమాకి ఆయన సుమారు ₹50 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నప్పటికీ, నిర్మాత మాత్రం ₹80 కోట్లు డిమాండ్ చేయడంతో ఆ డీల్ కుదరలేదు.

తరువాత మైత్రీ మూవీస్ అడ్వాన్స్‌తో నైజాంలో తామే రిలీజ్ చేసుకున్నారు. విగ్నేశ్వర ఫిల్మ్స్ మాత్రం ఉత్తరాంధ్ర హక్కులు ₹14 కోట్లకు తీసుకుంది.

ప్రస్తుత ట్రెండ్ చూస్తే, సినిమా ₹25 కోట్లు కలెక్ట్ చేయడమే గొప్ప విజయం అనిపిస్తుంది. అంటే చెప్పక్కర్లేదు – దిల్ రాజు ఈ సినిమా హక్కులు తీసుకుని ఉంటే, భారీ నష్టాలు తప్పేవి కావు!

ఇంతకు ముందే ఆయన నిర్మించిన తమ్ముడు సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. అలాంటి సమయంలో వీరమల్లు నుండి బయటపడడం దిల్ రాజుకు పెద్ద లక్ అనే చెప్పాలి.

Tags:    

Similar News