ప్రభుదేవా 'జాలీ ఓ జింఖానా' మూవీ రివ్యూ
ఈ సినిమా ఎలా ఉంది, చూడదగినదేనా, నవ్వుకోవచ్చా? అనేది రివ్యూలో చూద్దాం..;
ప్రభుదేవా ప్రధాన పాత్రలో , అదీ కామెడీ అంటే ఉత్సాహంగా చూడబుద్దేస్తుంది. లాస్ట్ ఇయిర్ నవంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి తెలుగుకు వెర్షన్ తో దిగింది. ప్రభుదేవా - మడోన్నా సెబాస్టీయన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉంది, చూడదగినదేనా, నవ్వుకోవచ్చా?
స్టోరీ లైన్
తంగసామి (వైజీ మహేంద్రన్) తన కూతురు చెల్లమ్మ(అభిరామి) , మనవరాళ్ళైన భవాని (మడోనా సెబాస్టియన్) , శివాని, యాజినీతో ఓ హోటల్ నడుపుతుంటాడు. తెన్ కాశీకి చెందిన ఓ పొలిటీషన్ ఎమ్మెల్యే రాజు (మధుసూదన్) మనుషులు వచ్చి ఆ హోటల్లో పడి తెగ తిని రెండు లక్షలు బిల్ చేస్తారు. బిల్ అడిగితే గొడవ అవుతుంది. చివరకు వాళ్ల చేతిలో దెబ్బలు తిన్న తంగసామి హాస్పటల్ లో చేరుతాడు. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. 25 లక్షలు కావాలి. అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతాయి? అక్కడే కథ టర్న్ తీసుకుంటుంది.
అనుకోకుండా భవాని ఎకౌంటులో 25 లక్షలు పడతాయి. అప్పుడు ఆమె తాను అప్పు అడిగిన రాకెట్ రవి పంపించాడనుకుని ఖర్చుపెట్టేస్తుంది. ఆ ముసలాయన బ్రతుకుతాడు. కానీ అప్పుడే ఆమెను కలవటానికి బొట్టు భవాని (సాయి దీనా) అనే లోకల్ రౌడీ వస్తాడు. ఎమ్మెల్యే రాజు మనుషులు తనకి పంపించిన డబ్బు పొరపాటున ఈ నెంబర్ కు పంపించినట్టుగా చెబుతాడు. అర్జెంట్ గా ఆ మొత్తం తన అకౌంటుకు ట్రాన్సఫర్ చేయమని బెదిరిస్తాడు. ఖర్చైపోయిన డబ్బులు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తాయి? డబ్బులు ఇవ్వకపోతే బొట్టు భవాని చంపేస్తాడని భయంపట్టుకుంటుంది. అప్పుడు వాళ్లకో ఆలోచన వస్తుంది.
ఈ సమస్యనుంచి తమని ఒడ్డున పడేసేది లాయర్ పూంగు (ప్రభుదేవా) అని గుర్తు వస్తుంది. దాంతో సిటీలోని ఒక హోటల్లో ఉన్న ఆయనను కలుసుకోవడానికి అంతా కలిసి వెళతారు. అక్కడ మరో ట్విస్ట్ . అక్కడ పూంగు ఉండడు. అతని డెడ్ బాడీ ఉంటుంది. అది చూసి షాక్ అవుతారు. ఆ టైమ్ లోనే అతనికి సంబంధించిన మరో మనీ మేటర్ వాళ్లకి తెలుస్తుంది. ఇప్పుడు పూంగును హత్య చేసినదెవరు? ఆ క్రైమ్ తమపై పడకుండా వాళ్లు ఏం ప్లాన్ చేస్తారు?చివరకు ఆ బొట్టు భవాని మనుష్యుల నుంచి తప్పించుకున్నారా..ఆ డబ్బులు తిరిగి ఎలా కట్టారు అనేది అసలైన కథ.
విశ్లేషణ:
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు Billy Wilder ఇలా అంటారు. “If you don’t have a good story, you don’t have anything.” (“మంచి కథ లేకపోతే... మీ దగ్గర ఏమీ లేనట్లే.”).
అయితే ఇక్కడ అసలు ఇక్కడ కథే లేదు కానీ రెండు గంటల పైగా సినిమా ఉంది.
బ్లాక్ కామెడీ చేయాలని, ఓ శవం పెట్టుకుని కమల్ పంచతంత్రంలాంటి సినిమా చేయాలని అత్యుత్సాహంతో చేసిన ప్రయత్నం ఇది. అయితే 'పంచతంత్రం' లో “పాత్రలు ఎలా ఆలోచిస్తాయి?” అన్న యాంగిల్ తో కామెడీని క్రియేట్ చేసారు. కానీ 'జాలీ ఓ జింఖానా'లో 'ఇప్పుడు నవ్వాలి' అని స్క్రిప్ట్ బలవతంగా డిమాండ్ చేస్తూన్నట్లు ఉంటుంది.
ఓ రౌడీ వేధిస్తున్నాడని న్యాయాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన తల్లీ కూతుళ్లు, లాయర్ హత్య కాబడ్డ శవం చూసి షాక్ అవుతారు. అదే షాక్ ఆడియన్స్‌కి కూడా వస్తుంది — కానీ అది షాకే కానీ కామెడీ కాదనే విషయం గుర్తించలేదు దర్శక,రచయితలు. ఈ సీన్ ఏమాత్రం పండినా, ఆ తరవాత జరిగే కథకు ప్రేక్షకుడు కనెక్ట్ అయేవాడు. అప్పుడు సినిమా మొత్తం ఇంట్రస్టింగ్ కామెడీగా తయ్యారయ్యేది. అయితే అలాంటి ప్రమాదం రాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు.
అలా మొదట్లోనే కీ ఎలిమెంట్ లోనే ఫెయిలైన ఈ స్క్రిప్టు ఫెయిలై చూసేవారికి కథపై ఆసక్తి చంపేస్తుంది. సెట్యువేషనల్ కామెడీ, డైలాగ్ కామెడీ రెండూ చూసేవారికి సహనపరీక్ష పెట్టడంలో పోటీ పడ్డాయి.
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే... ఇది హీరోల కథ కాదు. అలాగని ఆర్డనరీ మనుషుల కథ కూడా కాదు. స్క్రీన్‌ప్లే అనే సర్కస్‌లో అడ్డదిడ్డంగా అటూ ఇటూ పరుగెత్తే స్టీరియోటైప్ పాత్రల మతిలేని హంగామా మాత్రమే.
ఏదైమైనా మనం నవ్వుకోవటానికి కూర్చున్నాం. కానీ జోక్స్ వస్తున్నాయి..వెళ్తున్నాయి. కానీ నవ్వు మాత్రం రావటం లేదు. అప్పుడు మనకు డైరక్టర్ వాయిస్ గుసగుసగా వినపడుతుంది... “Why so serious?”..కాస్త నవ్వొచ్చుగా అని. అలా ప్రతీ సీన్ లోనూ నవ్విద్దామని ట్రై చేస్తూనే ఉన్నాడు డైరక్టర్. కానీ ప్రతీసారి అతని ప్రయత్నం వృధా అవుతూనే వచ్చింది. అంతకు మించి దారణం ఏముంటుంది.
ఎవరేలా చేసారంటే..
ప్రభుదేవాకి మంచి ఈజ్ ఉంటుంది. కామెడీలు అంటే అతనికి కొట్టిన పిండి. ఆడుతూ పాడుతూ చేసేస్తాడు. కానీ ఇక్కడ శవం పాత్ర కదా..ఆడటానికి,పాడటానికి ఏమీ లేదు. భవానీగా మడోన్నా సెబాస్టియన్ అభిరామి ఫెరఫెక్ట్. ఫాదర్ గా యోగిబాబు పెద్దగా చేయటానికి ఏమీ లేదు.
రమర్ ఎడిటింగ్ ఓకే. ఎమ్ సి గణేశ్ చంద్ర సినిమాటోగ్రఫీ నడిచిపోతుంది. అశ్విన్ వినయగమూర్తి మ్యూజిక్ జస్ట్ యావరేజ్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్
ప్రభుదేవా ఉన్నాడు కదా అని ఆవేశపడితే ఆయాసమే మిగిలుతుంది. ఈ దర్శక,నిర్మాతలు ఈ సినిమాని కామెడీ ప్రయోగం అనుకున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే ప్రేక్షకులే గినీపిగ్స్. ఈ సినిమా ట్యాగలైన్ లో చెప్పినట్లు ఇది నాన్ స్టాఫ్ న్యూసెన్సే.
ఎక్కడ చూడచ్చు
ఈ సినిమా తెలుగులో 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.