పృథ్వీరాజ్ 'సర్జమీన్' ఓటిటి మూవీ రివ్యూ!
ఈ సినిమా ఎలా ఉంది కథేంటి చూడదగినదేనా రివ్వూ లో చూద్దాం;
కశ్మీర్ లో అల్లకల్లోలం. వరుసగా జరుగుతున్న ఉగ్ర దాడుల వెనుక ఓ పేరు వినపడుతూంటుంది – 'కాబిల్'. అతడు కనిపించడు. మాట్లాడడు. కానీ శత్రువుల్ని దారుణంగా దెబ్బ తీస్తాడు. 'మోసెన్' అనే మరో ఐడెంటిటీ ద్వారా వలసల మాదిరిగా దేశంలో తిరుగుతున్నారు. అతడిని పట్టుకోలేక భారత ఇంటెలిజెన్స్ విసిగిపోయిన వేళ – రంగంలోకి దిగుతాడు ఒకే ఒక్కడు కర్నల్ విజయ్ మీనన్ (పృథ్వీ రాజ్ సుకుమారన్).
కేవలం వృత్తి రీత్యా ఆర్మీ కమాండర్ కాదు అతను… దేశానికి తన ప్రాణాల్ని ఇచ్చేటంతగా ప్రేమించే సైనికుడు. తన తండ్రి ఇచ్చిన స్పూర్తితో దేశసేవను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్న విజయ్ కు, కుటుంబం అంటే భార్య మెహర్ (కాజోల్), కొడుకు హర్మన్ (ఇబ్రహీం అలీఖాన్) మాత్రమే. కొడుకు హర్మన్ అందిరిలా పెరిగిన వాడు కాదు. మానసికంగా సరిగ్గా ఎదగని వాడు. తన మానసిక స్థితి వల్ల తనే సృష్టించుకున్న ఊహా స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటాడు. ధైర్యం లేని, భయపడే స్వభావం వల్ల తండ్రికి నచ్చడు. హర్మన్‌ను సమర్థించడమే కాదు – మెహర్ అతని అణుగుణంగా కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది.
ఇదంతా నెమ్మదిగా నడుస్తున్న సమయం లో… విజయ్ తన టార్గెట్ ని రీచ్ అవుతాడు – కాబిల్ ను పట్టేస్తాడు. కానీ అదే అతని జీవితాన్ని తలకిందులుగా మార్చిన నిర్ణయం అవుతుంది. కాబిల్ అరెస్ట్ అయిన తరువాత అల్లకల్లోలం అయిన అతని నెట్‌వర్క్ ప్రతీకారం తీసుకుంటుంది. విజయ్ కొడుకు హర్మన్ ను కిడ్నాప్ చేస్తారు. "కాబిల్‌ను విడిచిపెట్టు. లేకపోతే నీ కొడుకు బ్రతికాడు అనుకోకు" అనే తూటా లాంటి హెచ్చరికలు వస్తుంటాయి.
ఇక్కడే కథ టర్న్ తీసుకుంటుంది. ఒక తండ్రిగా విజయ్, తన కుమారుడిని రక్షించుకోవాలని తహతహలాడుతాడు. ఒక సైనికుడిగా, దేశానికి తీసుకొచ్చిన ప్రశాంతతను నిలబెట్టాలన్న బాధ్యత కత్తిలా మెరుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – విజయ్ ఎవరిని ఎంచుకుంటాడు? తన కొడుకునా? లేక దేశానికి ఇచ్చిన మాటనా? లేదా ఒక అసాధ్యమైన మార్గం వెతికి, రెండింటినీ కాపాడగలడా? అనేదే స్టోరీ లైన్.
విశ్లేషణ
2021లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ యాంథాలజీ Ajeeb Daastaans చూసిన వాళ్లకు షెఫాలీ షా – మనవ్ కౌల్ మధ్య వచ్చిన సెగ్మెంట్ ఎన్నటికీ మర్చిపోలేరు. ఆ ఎమోషనల్ స్టోరీని డైరెక్ట్ చేసినవాడు కయోజ్ ఇరానీ – ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ కుమారుడు. అది ఆయన డైరెక్షనల్ డెబ్యూట్ కూడా.
అందుకే, ఆయన ఫుల్-లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్‌గా డైరెక్ట్ చేస్తున్న సినిమా సర్‌జమీన్, అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని, కాజోల్ – ఇబ్రాహీం అలీఖాన్ వంటి కాస్ట్ ఉన్నారని తెలిసినప్పుడే అందులో ఒక genuine curiosity ఏర్పడింది.
2023లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాక, చాలా కాలం పాటు అలా స్టోరేజిలో ఉండిపోయింది. చివరకు నామ మాత్రపు థియేట్రికల్ రిలీజ్ కూడా కాకుండా, డైరెక్ట్ ఓటిటీలోకి వచ్చింది. సినిమా చూసిన తర్వాత నిర్మాతలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో బాగా అర్థమవుతుంది.
అలాగే ఇది యాక్షన్ సినిమా కాదు. ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అనిపిస్తుంది పై కథ చదవుతుంటే కానీ సినిమా చూస్తుంటే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అనిపిస్తుంది . రచన లోపాలు, నటనా ఎంపికల్లో అసహజత, outdated screenplay కలిసి సినిమాను మెలోడ్రామాటిక్ మిస్‌గా మార్చేశాయి. ఉన్నంతలో పృథ్వీరాజ్ (42) – కాజోల్ (50) జంట స్క్రీన్‌పై సహజంగానే కనిపిస్తుంది. కానీ ఇబ్రహీం అలీఖాన్ (24)ను వాళ్ల కొడుకుగా చూపించడం ఆశ్చర్యం వేస్తుంది. వాళ్లిద్దరూ తండ్రి,కొడుకుల్లా ఉండరు. ఏదో అన్నదమ్ముల్లా ఉంటారు.
దేశం vs కుటుంబం. ఈ థీమ్ ఎన్నోసార్లు వచ్చినా, ప్రతి కొత్త డైరెక్టర్ దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ సర్‌జమీన్ మాత్రం ఈ కాన్ఫ్లిక్ట్‌ను ఏ మాత్రంగా కొత్తదనం లేకుండా , పాత ఫార్ములా కథనంతోనే నడిపించాడు. బాంబ్ డిఫ్యూజ్ సీన్ అయితే practically predictable. చివర్లో ఒక కీలక పాత్ర రివీల్ చేసే ప్రయత్నం – intended as a twist, కానీ అది రాకముందే ఓ మోస్తరు ప్రేక్షకుడు కూడా ఊహించగలిగేలా ఉంటుంది. దాంతో అది సర్‌ప్రైజ్‌గా కాకుండా, క్లిషేగా మారిపోతుంది.
టెక్నికల్ గా..
సినిమాలో “cut-to-black” ఎడిట్స్ తరచుగా వాడిన తీరు — మూడ్ సెటప్ చేయడంలో కాకుండా, ఒక తలనొప్పిని తెప్పించేలా అనిపిస్తుంది. పేసింగ్‌ను దెబ్బతీస్తుంది.కమల్ జీత్ నేగి కెమెరా వర్క్ బాగుంది. కశ్మీర్ లొకేషన్స్ ను అందంగా చూపించారు. విశాల్ మిశ్రా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్. నితిన్ బైద్ ఎడిటింగ్ ..కత్తెరకి మరికాస్త పదను పెట్టాలి. మిగతా విభాగాలు బాగున్నా..ఈ సినిమాలో ఏమీ ఎలివేట్ కావు.
ఫైనల్ థాట్
ధర్మా ప్రొడక్షన్స్ లాంటి సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల —కొద్దో గొప్పో ఎక్సపెక్ట్ చేస్తాం. కానీ ఇది ఒక వెబ్‌సిరీస్ ట్రయల్స్‌లో భాగంగా వదిలిన డ్రాఫ్ట్ లాగా అనిపిస్తుంది. బలమైన కాన్సెప్ట్, బలహీనమైన ఎగ్జిక్యూషన్.
చూడచ్చా
మరీ ఖాళీగా ఉంటే కాలక్షేపానికి ఓ లుక్కేయచ్చు కానీ ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అయితే కాదు.
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది.
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.